AP News: ఉద్యోగులూ.. వాళ్ల ట్రాప్‌లో పడొద్దు: చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకోవాలని ఏపీ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి కోరారు.

Updated : 20 Jan 2022 13:23 IST

అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకోవాలని ఏపీ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి కోరారు. ఉద్యోగుల సమస్యలపై కచ్చితంగా చర్చలు జరుపుతుందని.. ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే ప్రభుత్వం ఇది కాదని చెప్పారు. ఇటీవల ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆందోళనల నేపథ్యంలో అమరావతిలో శ్రీకాంత్‌ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. హెచ్‌ఆర్‌ఏపైనా అన్ని ఉద్యోగ సంఘాలతో మాట్లాడతామని చెప్పారు. ఉద్యోగులు మొండి వైఖరితో వ్యవహరించొద్దని కోరారు. 

‘‘మిమ్మల్ని ద్వేషించిన, అసభ్య పదజాలతో దూషించిన వారి ట్రాప్‌లో పడొద్దు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కనుకే అధికారంలోకి వచ్చిన వెంటనే లక్షా 30వేల ఉద్యోగాలు ఇచ్చాం. ఉద్యోగులతో స్నేహపూర్వకంగా వ్యవహరించే ప్రభుత్వమిది. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, మున్సిపల్‌ కార్మికులకు వేతనాలు పెంచడమే కాకుండా కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు కూడా పే స్కేల్‌ ప్రకారమే చెల్లింపులు చేయాలని సూచించింది. ఇది ఏ ఒక్కరినీ విస్మరించే ప్రభుత్వం కాదు. ప్రకటించిన పీఆర్సీతో ఉద్యోగుల జీతాలు పెరుగుతాయి. కొంతమంది మాటలు విని బురదచల్లే కార్యక్రమాలు చేయొద్దు. ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని కుట్ర చేస్తున్న కొంతమంది ట్రాప్‌లో పడొద్దు. 

ఏ రాష్ట్రంలోనైనా 27 శాతం ఐఆర్‌ ఇచ్చారా?

సంక్షేమ కార్యక్రమాల అమల్లో సామాన్యుల పట్ల స్నేహపూర్వకంగా ఉన్న ప్రభుత్వం.. ఉద్యోగుల పట్ల వివక్షతో ఎందుకుంటుంది? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రూ.10వేల కోట్ల భారం పడుతున్నా పీఆర్సీకి సీఎం అంగీకరించారు. కరోనా పరిస్థితులతో ఏ రాష్ట్రంలోనైనా 27 శాతం ఐఆర్‌ ఇచ్చారా? పక్కనే ఉన్న తెలంగాణ ఇచ్చిందా? హెచ్‌ఆర్‌ఏపై అందరితో మాట్లాడి మంచి నిర్ణయం తీసుకుంటుంది. ఉద్యోగులు కోరుకున్న అంశాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే కచ్చితంగా పరిశీలిస్తుంది’’ అని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని