PRC : వెనక్కి తగ్గేదేలే..పటిష్ఠంగా పీఆర్సీ ఉద్యమ కార్యాచరణ

పీఆర్సీ జీవోలపై ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరపాలని ప్రభుత్వం ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. సామరస్య పూర్వకంగా ప్రభుత్వంతో సంప్రదింపులకు రావాలని...

Updated : 23 Jan 2022 21:07 IST

అమరావతి : పీఆర్సీ జీవోలపై ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరపాలని ప్రభుత్వం ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. సామరస్య పూర్వకంగా ప్రభుత్వంతో సంప్రదింపులకు రావాలని మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని చేసిన ప్రయత్నాలు వికటించాయి. మరోవైపు విజయవాడ రెవెన్యూ భవన్‌లో సమావేశమైన పీఆర్సీ స్టీరింగ్‌ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసు ఇవ్వాలని నిర్ణయించింది. సచివాలయంలో సీఎస్ ఛాంబర్‌ 4లో ఐకాస సంఘాల నేతలంతా కలసి సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. ఇప్పటికే ప్రకటించిన ఉద్యమ కార్యాచరణను పటిష్ఠంగా అమలు చేయాలని నిర్ణయించారు.

అన్ని జిల్లాల్లో ఆందోళన కార్యక్రమాలు విజయవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని పీఆర్సీ జేఏసీ తీర్మానించింది. ప్రతి జిల్లాకు జేఏసీ తరపున ఒక్కో రాష్ట్రస్థాయి నాయకుడిని పంపాలని నిర్ణయించింది. ఉద్యమం విజయవంతం చేయడానికి నలుగురు నేతలను జిల్లాలకు పంపాలని నేతలు తీర్మానించారు. రోజూ జిల్లాల్లో జరిగిన ఉద్యమంపై స్టీరింగ్ కమిటీకి నివేదిక ఇవ్వనున్నారు. అన్ని జిల్లాల్లో పీడీఎఫ్ ఎమ్మెల్సీలను కలుపుకొని ఉద్యమానికి వెళ్లాలని తీర్మానించారు. విజయవాడ రెవెన్యూ భవన్‌లో జరిగిన సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు బండి శ్రీనివాసరావు, హృదయరాజు, శివారెడ్డి బొప్పరాజు వెంకటేశ్వర్లు, వైవీరావు, ఫణి పాల్గొన్నారు. సచివాలయ సంఘం నుంచి వెంకట్రామిరెడ్డి, ప్రసాద్,అరవ పాల్, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నుంచి కేఆర్ సూర్యనారాయణ, ఆస్కర్ రావు, కృష్ణయ్య పాల్గొన్నారు.

సంప్రదింపులకు మరో ప్రయత్నం

ఉద్యోగుల సమ్మె ప్రతిపాదన విరమింపజేసేందుకు ప్రభుత్వం మరోసారి  ప్రయత్నించింది. చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాల నేతల్ని మరోసారి ఆహ్వానించింది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు చర్చలకు రావాల్సిందిగా జేఏడీ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ ఉద్యోగ సంఘాల నేతలను కోరారు. చర్చల్లో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌, బొత్స సత్యనారాయణ, పేర్ని నానితోపాటు సీఎస్‌ సమీర్‌శర్మ, ప్రభుత్వ సలహాదారు సజ్జల పాల్గొంటారని అన్నారు.

అధికారిక సమాచారం లేదు

ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు ప్రభుత్వం కమిటీ వేసినట్లు అధికారిక సమాచారం లేదని స్టీరింగ్‌ కమిటీ నేతలు స్పష్టం చేశారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కమిటీ పరిధి, నిర్ణయాధికారంపై తమకు స్పష్టత లేదన్నారు. పీఆర్సీ జీవోల అమలు నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చేవరకు చర్చలకు వెళ్లేది లేదన్నారు. జనవరి నెలకు డిసెంబరు జీతాన్నే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వేతన సవరణ అంశంపై అశుతోష్‌ కమిటీ ఇచ్చిన నివేదికను ఇవ్వాలని కమిటీ సభ్యులు కోరారు. ఉద్యమ కార్యాచరణలో పార్టీలను ఆహ్వానించడం లేదని, ఉద్యమం అంటే ప్రభుత్వానికి నిరసన తెలిపే కార్యక్రమం మాత్రమేనని తెలిపారు. చరిత్రలో ఎప్పుడూ లేనట్లుగా రకరకాలుగా ఉద్యోగులపై సోషల్ మీడియాలో ప్రభుత్వం మాటలయుద్దం చేస్తోందని కమిటీ నేతలు విమర్శించారు. ఉద్యోగులపై ఎలా తీవ్ర పదజాలాలతో మాట్లాడుతున్నారో ఇంటెలిజెన్స్ ద్వారా ప్రభుత్వం తెప్పించుకోవాలని, ఉద్యోగులపై దాడి చేసి రెచ్చగొట్టడం సరైన పద్ధతి కాదని అన్నారు. ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగత విమర్శలు చేయవద్దని స్టీరింగ్‌ కమిటీ సభ్యులు కోరారు. విమర్శలను తిప్పికొట్టేందుకు 8 మంది సభ్యులతో మానిటరింగ్‌ సెల్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని