మహీంద్రా మెచ్చిన ‘గాయకులు’ వీరు..

సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ అనేక ఆసక్తికర అంశాలను, వైరల్‌ వీడియోలను షేర్‌ చేస్తుంటారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా. ఆయన చేసే పోస్ట్‌లు ఒక్కోసారి మనల్ని కదిలిస్తాయి.

Updated : 21 Feb 2021 04:24 IST

ముంబయి: సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ అనేక ఆసక్తికర అంశాలను, వైరల్‌ వీడియోలను షేర్‌ చేస్తుంటారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా. ఆయన చేసే పోస్ట్‌లు ఒక్కోసారి మనల్ని కదిలిస్తాయి. మరోసారి నవ్విస్తాయి. ఇంకోసారి ఆలోచింపజేస్తాయి. అంతేనా.. మట్టిలో ఉన్న మాణిక్యాలను ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి. తాజాగా అలాంటి వీడియోలే షేర్‌ చేశారు ఆనంద్‌జీ. దిల్లీకి చెందిన ఇద్దరు పేద యువకులు తమ గాత్రంతో ఆకట్టుకుంటున్న వీడియోలు పోస్ట్‌ చేసిన ఆయన.. వారికి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. 

పొట్ట కూటి కోసం దిల్లీలోని న్యూ ఫ్రెండ్స్‌ కాలనీలో చెత్త సేకరిస్తూ జీవనం సాగిస్తున్న అన్నదమ్ములు హఫీజ్‌, హబీబర్‌.. తమ గాత్రంతో స్థానికులను ఆకట్టుకుంటున్నారు. వీరు పాటలు పాడుతున్న వీడియోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టి మహీంద్రా దృష్టిలో పడ్డారు. ఈ వీడియోలను ఆయన తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేస్తూ.. ‘‘ఉజ్వల భారత్‌. నా స్నేహితుడు రోహిత్‌ ఖట్టర్‌ ఈ వీడియోలను షేర్‌ చేశారు. ప్రతిభ ఎక్కడినుంచి పుడుతుంది అనేదానికి ఎలాంటి హద్దులు లేవు. నైపుణ్యాలు లేనప్పటికీ ఎంతో చక్కగా పాటలు పాడుతున్నారు. వీరు మ్యూజిక్‌లో శిక్షణ తీసుకునేందుకు నేను, రోహిత్‌ సాయం చేయాలనుకుంటున్నాం. అయితే ఉదయమంతా పనిలో ఉంటారు కాబట్టి సాయంత్రం పూట వీరికి మ్యూజిక్‌ నేర్పించే వారు దిల్లీలో ఎవరైనా ఉంటే చెప్పండి’’ అని తన అభిమానులు, ఫాలోవర్లను కోరారు. మరి ఆనంద్‌జీ మెచ్చిన ‘గాయకుల’ గాత్రాన్ని మీరు వినేయండి..!



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని