Ganesh nimajjanam : మినహాయింపులు ఇవ్వకపోతే హైదరాబాద్‌ స్తంభిస్తుంది

గణేశ్‌ నిమజ్జనం తీర్పుపై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింది. తీర్పును పునఃపరిశీలించాలంటూ జీహెచ్‌ఎంసీ

Updated : 13 Sep 2021 13:05 IST

హైకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేసిన జీహెచ్‌ఎంసీ

హైదరాబాద్‌ : గణేశ్‌ నిమజ్జనంపై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింది. తీర్పును పునఃపరిశీలించాలంటూ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తీర్పులో ప్రధానంగా 4 అంశాలు తొలగించాలని కోరారు.

హుస్సేన్ సాగర్, ఇతర జలాశయాల్లో పీఓపీ విగ్రహాల నిమజ్జనంపై నిషేధం ఎత్తివేయాలని.. ట్యాంక్ బండ్ వైపు నుంచి నిమజ్జనానికి అనుమతించాలని.. సాగర్‌లో కృత్రిమ రంగులు లేని విగ్రహాలనే అనుమతించాలన్న ఆంక్షలు తొలగించాలని.. హుస్సేన్ సాగర్‌లో రబ్బరు డ్యాం నిర్మించాలన్న ఉత్తర్వులు సవరించాలని పిటీషన్‌లో జీహెచ్‌ఎంసీ కోరింది.

ట్యాంక్ బండ్ వైపు అనుమతించక పోతే.. నిమజ్జనం పూర్తి కావడానికి 6 రోజులు పడుతుందని జీహెచ్‌ఎంసీ పిటిషన్‌లో పేర్కొంది. వ్యయ ప్రయాసలతో కూడిన రబ్బరు డ్యాం నిర్మాణానికి కొంత సమయం అవసరమని వివరించింది. నగరవ్యాప్తంగా మండపాల్లో వేల సంఖ్యలో భారీ విగ్రహాలు ఉన్నాయి.. విగ్రహాల సంఖ్యకు తగినన్ని నీటి కుంటలు లేవని విన్నవించింది. పెద్ద విగ్రహాలు నీటి కుంటల్లో నిమజ్జనం చేయడం కష్టమని.. ఇప్పటికే హుస్సేన్ సాగర్ వద్ద క్రేన్లు, ఇతర ఏర్పాట్లు చేశామని వివరించింది. ఇందు కోసం నెలల క్రితమే ప్రణాళికలు సిద్ధమయ్యాయని తెలిపింది.  ఇప్పటికిప్పుడు ప్రణాళికలు మార్చితే గందరగోళం తలెత్తుతుందని పేర్కొంది. నిమజ్జనం తర్వత 24 గంటల్లో వ్యర్థాలు తొలగిస్తామని కోర్టుకు వెల్లడించింది. మాస్కులు ధరించేలా ప్రజలను చైతన్యపరుస్తామని చెప్పింది. విగ్రహాలను ఆపితే నిరసనలు చేపడతామని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పిలుపునిచ్చిందని జీహెచ్ఎంసీ కోర్టుకు తెలిపింది. హైకోర్టు మినహాయింపులు ఇవ్వకపోతే గందరగోళం తలెత్తి నగరం స్తంభిస్తుందని పేర్కొంది.

మధ్యాహ్నం 2.30కు విచారణ

జీహెచ్ఎంసీ రివ్యూ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని ప్రభుత్వ న్యాయవాది కోర్టును కోరారు. దీంతో లంచ్ మోషన్ విచారణకు హైకోర్టు అంగీకరించింది. మధ్యాహ్నం 2.30 గంటలకు రివ్యూ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని