హైదరాబాద్‌లో సిటీ బస్సులు రైట్‌.. రైట్‌

కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా ఆరు నెలల సుధీర్ఘ విరామం తర్వాత నగరంలో సిటీ బస్సులు శుక్రవారం రోడ్డెక్కాయి.

Updated : 25 Sep 2020 12:56 IST



హైదరాబాద్‌: కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా ఆరు నెలల సుధీర్ఘ విరామం తర్వాత నగరంలో సిటీ బస్సులు శుక్రవారం రోడ్డెక్కాయి. దశల వారీగా సిటీ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని యాజమాన్యం నిర్ణయించింది. ఇందులో భాగంగానే తొలిదశలో కేవలం 25శాతం మాత్రమే సిటీ బస్సులు నడపనున్నారు.  గ్రేటర్ పరిధిలో 29 డిపోల్లో సుమారు 2,900 బస్సులు ఉన్నాయి. వీటిలో హైదరాబాద్ రీజియన్ లో 1,700 బస్సులు, సికింద్రాబాద్ రీజియన్‌లో 1,200 బస్సులు గతంలో నడిచేవి. వీటిలో ప్రస్తుతం 25శాతం బస్సులను నడపాలని సీఎం ఆదేశించడంతో సుమారు 650 బస్సులు నడవనున్నాయి. మరోవైపు కర్ణాటక, మహారాష్ట్రలకు కూడా అంతర్‌ రాష్ట్ర బస్సులు నేటి నుంచి నడపనున్నట్లు రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. 

కొవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు విధించిన లాక్‌డౌన్‌లో భాగంగా మార్చి 22 నుంచి ఆర్టీసీ బస్సులు నిలిపివేసిన విషయం తెలిసిందే. తదనంతరం కేంద్ర మార్గదర్శకాల ప్రకారం అన్‌లాక్‌లో భాగంగా ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థకు అనుమతి ఇవ్వడంతో ముందుగా జిల్లాలకు బస్సులను నడపడం ప్రారంభించారు. ఆ సమయంలో గ్రేటర్‌ పరిధిలో కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో సిటీ బస్సులు నడపడం అంత శ్రయేస్కరం కాదని ప్రభుత్వం భావించింది. ఆ తర్వాత ఈ నెల మొదట్లో మెట్రో రైలును సైతం ప్రారంభించారు. సిటీ బస్సులు నడిపేందుకు సీఎం కేసీఆర్‌ అనుమతించడంతో ఇవాళ నుంచి నగరంలో సిటీ బస్సులు రోడ్డెక్కాయి. బస్సుల్లో కరోనా నిబంధనలు పాటించేలా అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. 

మరిన్ని చిత్రాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని