INPICS: ‘చిత్రం’ చెప్పే విశేషాలు

Updated : 03 Sep 2020 20:58 IST

కర్నూలు జిల్లా మిడుతూరు మండలం రోళ్లపాడు అభయారణ్యంలో జింకలు సందడి చేస్తున్నాయి. మందలో ఒకదానికొకటి పోటీపడి ఢీ కొడుతూ సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. 


ఇంట్లో అలంకరణకు వాడే వాల్‌పోస్టర్లను ఓ వ్యాపారి మార్చి నెలలో భారీగా కొనుగోలు చేశాడు. అనంతరం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో సరకు అంతా మిగిలిపోయింది. కొవిడ్‌ ప్రభావంతో దుకాణానికి కొనుగోలుదారులు రాకపోవడంతో ప్రస్తుతం మోహదీపట్నంలో పాదచారుల బాటపై సగం రేటుకు అమ్ముతున్నట్లు తెలిపాడు. 


మైదానంలో ఆట చూస్తూ అభిమానులు కటౌట్లుగా మారిపోయారు ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా? వారు నిజమైన అభిమానులు కాదు.. కేవలం బొమ్మలు మాత్రమే. ఇటలీలోని మోంజాలో సెప్టెంబర్ 4 నుంచి 6 వరకు ఇటాలియన్‌ గ్రాండ్‌ప్రి జరగనుంది. తమ అభిమాన రేసర్లను ప్రోత్సహిస్తూ జెండాలూపుతూ కనిపించే ప్రేక్షకులను కొవిడ్‌ కారణంగా మైదానంలోకి అనుమతించడం లేదు. దీంతో నిర్వాహకులు గ్యాలరీలోని ప్రేక్షకుల స్థానంలో బొమ్మ కటౌట్లను ఏర్పాటు చేశారు.


ఆగస్టులో తెలుగు రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. లోతట్టు ప్రాంతాల్లోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వానలు తగ్గినా వరదలు చేసిన గాయాలు మానడానికి సమయం పడుతోంది. ఇందుకు నిదర్శనంగా తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం, తొయ్యేరు గ్రామాలు నేటికి నీటిలో మునిగి ఉన్నాయి. వరదల కారణంగా విద్యుత్‌ సరఫరా స్తంభించిపోయింది. చేతి పంపులు పాడైపోయాయి. తాగేందుకు నీరు లేక కిలోమీటర్ల కొద్ది నడుచుకుంటూ వేరే గ్రామాలకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. మరికొంతమంది వెళ్లే ఓపిక లేక వరద నీటిని వేడి చేసుకొని తాగుతున్నారు. పడవల ద్వారా అధికారులు తమకు తాగునీరు, నిత్యావసరాలు అందజేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. 


కరోనా మహమ్మారి వ్యాప్తి భయంతో దేశవ్యాప్తంగా మార్చి 22 నుంచి మెట్రో రైలు సేవలు నిలిపివేశారు. వీటిని సెప్టెంబరు 7 నుంచి పునఃప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా దిల్లీలోని మెట్రో రైళ్లను సిబ్బంది రైళ్ల లోపల శానిటైజ్‌ చేస్తున్నారు. స్టేషన్‌ పరిసరాల్లోనూ పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా ఏర్పాటు చేస్తున్నారు. 


అత్యంత ఎక్కువ తీవ్రత కలిగిన పరివర్తనం చెందిన కరోనా వైరస్‌ను పరిశోధకులు ఇండోనేషియాలో కనుగొన్నారు. వైరస్‌ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు బయటకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అక్కడి ఆరోగ్యశాఖ అప్రమత్తత ప్రకటించింది. దీనిని పాటించకుండా జకర్తాలోని బహిరంగ ప్రదేశాల్లో  మాస్క్‌ ధరించకుండా తిరుగుతున్న వ్యక్తి పట్టుకున్న అధికారులు శిక్షగా అతడిని నమూనా శవపేటికలో పెట్టి ఊరేగించారు.


హిమాచల్‌ ప్రదేశ్‌ ధర్మశాలలో ఉన్న ప్రముఖ బౌద్ధ గురువు దలైలామా నివాసం గోడకు మొక్కుతున్న భక్తుడు. 


జాలర్లు సముద్రంలో నుంచి పట్టి తెచ్చిన చేపలను విశాఖ సాగర తీరం సమీపంలో ఎండబెట్టిన దృశ్యం. బాగా ఎండిన తర్వాత ఒడిశా, తమిళనాడు, పశ్చిమ్‌ బెంగాల్‌ రాష్ట్రాలకు వీటిని ఎగుమతి చేస్తారు.


రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై చైనా విజయం సాధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజింగ్‌లో ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకిస్తున్న సందర్శకుడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని