దోమలను తరిమికొట్టే మొక్కలివే..!

ప్రస్తుత కాలంలో దోమల బెడద మామూలుగా లేదు. కాస్త చినుకులు పడితే, మురుగు కాల్వ పొంగితే చాలు విజృంభిస్తాయి. సాయంత్రం అయితే చాలు చిన్నా, పెద్దా అనే తేడా...

Updated : 17 Sep 2020 09:50 IST

ప్రస్తుత కాలంలో దోమల బెడద మామూలుగా లేదు. కాస్త చినుకులు పడితే, మురుగు కాల్వ పొంగితే చాలు విజృంభిస్తాయి. సాయంత్రం అయితే చాలు ప్రతి ఒక్కరి రక్తం పీల్చేసేందుకు సిద్ధమైపోతాయి. దీంతో ఆలౌట్‌, కాయిల్స్, దూపం, క్రీములూ అంటూ రకరకాల ఆయుధాలను మనం ప్రయోగిస్తాం. ఇలాంటి రసాయనాలతో కాకుండా సహజసిద్ధంగా దోమల దండు నుంచి మనల్ని కాపాడే మొక్కలు ఉన్నాయి. వాటిని మన గార్డెన్‌లోనో, ఇంటిలోనో పెంచుకుంటే దోమల బెడద నుంచి కుటుంబాన్ని రక్షించుకోవచ్చు. అవేంటంటే..?

లావెండర్‌ 

లావెండర్‌ ఉత్పత్తులు చర్మ సౌందర్యానికి ఎక్కువగా వినియోగిస్తుంటారు. అలానే రూం స్ప్రేలు తయారీలోనూ వాడుతుంటారు. లావెండర్‌ మొక్క ఉన్న చోట దోమలు గానీ, ఇతర కీటకాలు గానీ తిరగవు. కారణం ఆ మొక్క ఆకుల్లో ఉత్పత్తి అయ్యే ఆయిల్‌కు దోమలు, కీటకాలు నశిస్తాయి. ఈ మొక్కలు ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకోగలవు. అయితే కాస్త వెచ్చని ప్రాంతాల్లో లావెండర్‌ మొక్కలు పెరగగలవు.


బంతిపూల మొక్కలు

ఏదైనా శుభకార్యాలు, పండుగల సందర్భంగా బంతిపూలను వాడుతుంటాం. పూల వాడకం వెనుక కూడా శాస్త్రీయపరమైన కారణాలూ ఉన్నాయి. బంతిపూల మొక్కలు కూడా దోమల నుంచి మనల్ని కాపాడతాయి. చాలా సులువుగా చిన్న కుండీల్లో బంతి మొక్కలను ఇంటి ప్రవేశ ప్రాంతంలో పెంచుకుంటే దోమలను అరికట్టొచ్చు. అంతేకాదు ఇంటి అలంకరణకూ ఉపయోగపడతాయి. 


పుదీనా జాతికి చెందిన మొక్కలు

* క్యాట్‌పిన్‌

పుదీనా రకానికి చెందిన మొక్క క్యాట్‌పిన్‌. ప్రతి చోటా ఇలాంటి మొక్కలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. దోమలను తరిమేయడంలో క్యాట్‌పిన్‌ మొక్క ఎంతో సమర్థంగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. చాలా తేలికగా ఈ రకం మొక్కలు పెరుగుతాయి. ఓ కుండీలో నల్లమట్టితో ఎలాంటి వాతావరణంలోనైనా మొక్క పెరుగుతుంది. సహజ సిద్ధంగా దోమలను నివారణకు సరిగ్గా పని చేస్తుంది. 

* రోజ్‌మ్యారీ

రోజ్‌మ్యారీ మొక్క కూడా పుదీనా జాతికి చెందినదే. ఆయుర్వేదంలో ఎక్కువగా వినియోగిస్తుంటారు. అలాగే దోమలను తరిమికొట్టడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ మొక్కను మన ఇళ్లల్లోని బాల్కనీలు, పెరడులోనూ తేలికగా పెంచుకోవచ్చు. రోజ్‌మ్యారీ మొక్కతో దోమలనే కాకుండా ఇతర కీటకాలను కూడా నివారించవచ్చు. 

* తులసి

తులసి ఆకులు మన ఆరోగ్యానికి ఎంత మంచిదో.. దోమలను తరిమేయడంలోనూ అలానే సాయపడుతుంది. దైనందిన ఆహారంలో తులసిని ఓ భాగం చేసుకునేవారు ఉన్నారు. ఉదయాన్నే మనం సేవించే తేనీటిలో ఓ రెండు తులసి ఆకులు వేసుకుంటే ఆ రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకే ఆరోగ్యానికి, ఇటు దోమల నుంచి రక్షణకు ఇంటి ఆవరణలో ఓ తులసి మొక్కను పెంచుకోవడ ఉత్తమం.

* పుదీనా

సంవత్సరం పొడువునా పచ్చదనం పంచే అరుదైన మొక్కల్లో పుదీనా ఒకటి. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆరోగ్యం పరంగా ఎన్నో ఉపయోగాలు ఉన్న పుదీనా మొక్క ఇంట్లో ఉంటే దోమలు కూడా దరిచేరవు.


-ఇంటర్నెట్‌ డెస్క్ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని