ఆరోగ్యానికి ఆరుసూత్రాలంటున్న ఆయుర్వేదం!

ఆరోగ్యం బాగుండాలంటే ఆహారం, వ్యాయమాలేనా.. అలవాట్లు కూడా ముఖ్యమే అంటోంది ఆయుర్వేదం. మన శరీరంలో మలినాలు సాధ్యమైనంత తక్కువగా తయారు కావాలని చెబుతోంది. అంతేకాదు ఏర్పడిన మలినాలు ఎప్పటికప్పుడు తొలగిపోతూ ఉండాలంటోంది.

Updated : 03 Dec 2020 09:24 IST


ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆరోగ్యం బాగుండాలంటే ఆహారం, వ్యాయామాలేనా.. అలవాట్లు కూడా ముఖ్యమే అంటోంది ఆయుర్వేదం. మన శరీరంలో మలినాలు సాధ్యమైనంత తక్కువగా ఉండాలని చెబుతోంది. అంతేకాదు ఏర్పడిన మలినాలు ఎప్పటికప్పుడు తొలగిపోతూ ఉండాలంటోంది. ఆరోగ్యాన్ని దివ్యంగా ఉంచుకొనేందుకు ఆరు ముఖ్యమైన సూత్రాలను చెబుతోంది ఆయుర్వేదం. వాటిపై మీరూ ఓ లుక్కేయండి.

ఆరోగ్యమే మహాభాగ్యం.. ఈ నానుడికి తిరుగులేదు. ఎన్ని భోగభాగ్యాలున్నా పిసరంత ఆరోగ్యం లేకపోతే అవి ఎందుకూ కొరగావు. ఈ కఠిన సత్యాన్ని చాలామంది విస్మరిస్తున్నారు. నేటి పోటీ ప్రపంచంలో ఆదాయం, ఆర్జన, ఉద్యోగం, వ్యాపారమంటూ వాటి ధ్యాసలోనే కాలం గడుపుతున్నారు. చివరకు శారీరకంగానూ, మానసికంగానూ చిక్కిపోతున్నారు. గాడితప్పిన జీవన శైలి, తీరుతెన్నూ లేని ఆహారపు అలవాట్లు, శరీరానికి చాలినంత శ్రమలేక పోవటం వంటివి ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసేవే.

1.ఎండలో కూర్చోవాలి.....
ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో మలినాలు తక్కువగా తయారు కావాలి. ఏర్పడిన మలినాలు ఎప్పటికప్పుడు బయటకు పోవాలి. ఉదయం వచ్చే సూర్యరశ్మి శరీరానికి శక్తిని ఇస్తుంది. కొత్తకణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఆ సమయంలో పడే సూర్యకిరణాలు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. ఆ జీర్ణశక్తి సరిపడా ఉంటే శరీరంలో మలినాలు ఎక్కువగా ఏర్పడవు, ఏమైనా ఏర్పడినట్లయితే ఎప్పటికప్పుడు బయటకు వెళ్లిపోతాయి. అందువల్ల ఉదయం పూట వాకింగ్‌కు వెళ్లటం, ఎండలో కూర్చోవటం వంటివి తప్పనిసరిగా చేయాలి. 

2.మారుత సేవన చేయాలి..
అంతేకాదు ఉదయం, సాయంత్ర వేళల్లో మారుత సేవన చేయాలి. అంటే హాయిగా చల్లటి గాలిలో కొంతసేపు గడపాలి. చల్లని గాలి స్పర్శ శరీరానికి ఓ టానిక్‌లా పనిచేస్తుంది. ఇవే కాకుండా వ్యాయామం అలవాటు చేసుకోవాలి. ఎంతలా అంటే అది జీవన విధానంలో ఓ భాగమై పోవాలి. దీనివల్ల శరీరంలో మలినాలు చేరవు. అస్వస్థతకు గురయిన తరువాత చర్యలు తీసుకోవటం కంటే ముందుగానే ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవటం మంచిది. 

3.ఇష్టారీతిన తినటం ఆపాలి...
ప్రస్తుత రోజుల్లో ఆహార నియమాలు పూర్తిగా గాడితప్పాయి. కొంతమందికి ఎప్పుడు తింటున్నాం, ఏం తింటున్నాం అనే ధ్యాసే ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా తింటూ పొట్టను చెత్తకుప్పలా మార్చుకుంటున్నారు. శీతల పానీయాలు, కాఫీ, టీలను మితిమీరి తాగేస్తున్నారు. ఇలాంటి అలవాట్లు ఆరోగ్యానికి ఏమాత్రం మేలు చేయవు.

4.ఉపవాసం ఓ చక్కని చికిత్స....
ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ఉపవాసం ఓ చక్కని చికిత్స అంటోంది ఆయుర్వేదం. లంకణాన్ని పరమౌషధంగా పేర్కొంటోంది. జీర్ణవ్యవస్థకు అప్పుడప్పుడూ విశ్రాంతి ఇవ్వాలని చెబుతుంది. తరచూ ద్రవ పదార్థాలు, పండ్లను తీసుకుంటూ, ఉపవాసాన్ని ఆచరించటం వల్ల శరీరంలో మలినాలు పేరుకుపోవటం తగ్గుతుంది. కొంతమంది నీరు ఎక్కువగా తాగితే మంచిదని అనుకుంటారు. రోజుకు ఎనిమిది లీటర్లకు మించి తాగుతుంటారు. నిజానికి ద్రవ పదార్థాలను అతిగా తీసుకోవటం వల్ల చెడే ఎక్కువ అని అంటారు డాక్టర్లు.

5. పచనం...
పచనం అంటే తీసుకున్న ఆహారం అంతా జీర్ణమయ్యే ప్రక్రియ. ఈ ప్రక్రియ సక్రమంగా జరగాలంటే ఆహారం విషయంలో అన్ని రకాల నియమాలు పాటించాలి. పరిమితంగా తినటం, నిర్ణీత సమయంలోనే ఆహారం తీసుకోవటం, తీసుకున్న ఆహారం జీర్ణమయ్యేంత వరకు మళ్లీ తినకుండా ఉండటం వంటివి అవలంబించాలి.

6. నీటి విషయంలో నిగ్రహం.. 
తీసుకునే ద్రవ పదార్థాల విషయంలో పరిమితి పాటించాలి. ఇష్టారీతిన వ్యవహరించకూడదు. నీరు, ద్రవ పదార్థాలు వంటివి ఎంత అవసరమో అంతవరకు మాత్రమే తీసుకోవాలి. ముఖ్యంగా శీతల పానీయాలు, మద్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఇలాంటివి అనారోగ్యానికి కారణమవుతాయి. ఆధునిక జీవనశైలి పుణ్యమా అని చాలామంది ఆరోగ్యం గాలిలో దీపంగా మారింది. షుగర్‌, బీపీ, స్థూలకాయం, కొలెస్ట్రాల్, గుండెజబ్బులు, పక్షవాతం, క్యాన్సర్‌లు, నిద్రలేమి ఒక్కటనేమి ఏది ఎప్పుడు విరుచుకుపడుతుందో తెలియదు. దీనికి తోడు వైద్యం కూడా ఖరీదైన సరకుగా మారింది. అందువల్ల చికిత్స కంటే నివారణ మేలు అనే సూత్రానికి అందరూ కట్టుబడాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని