firecrackers: 400 ఏళ్ల నాటి టెక్నిక్‌.. మట్టితో టపాసుల తయారీ!

దేశవాళీ టపాసులకు మళ్లీ ఆదరణ దక్కేలా కృషి చేస్తోంది గుజరాత్​కు చెందిన ‘ప్రముఖ్​ పరివార్’ అనే స్వచ్ఛంద సంస్థ. ప్రధాని నరేంద్ర మోదీ నినాదం ‘వోకల్​ ఫర్​ లోకల్​’ స్ఫూర్తితో......

Published : 03 Nov 2021 01:34 IST

వడోదరా: దీపావళి పండగ గురించి ప్రస్తావన వస్తే మొదటగా గుర్తొచ్చేది టపాసులే. ఈ పండగ రోజు సాయంత్రం ఇంటి వాకిట్లో దీపాల వెలుగులో బాణసంచా కాలుస్తూ సంబురాలు చేసుకుంటాం. అయితే ఏటా రకరకాల టపాసులు మార్కెట్లోకి అందుబాటులోకి రావడం, ఇదే సమయంలో చౌకగా లభించే చైనా బాణసంచాకు డిమాండ్​ పెరుగుతుండగా.. దేశవాళీ టపాసులకు ఆదరణ తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో ఈ బాణాసంచాకు మళ్లీ ఆదరణ దక్కేలా కృషి చేస్తోంది గుజరాత్​కు చెందిన ‘ప్రముఖ్​ పరివార్’ అనే స్వచ్ఛంద సంస్థ. ప్రధాని నరేంద్ర మోదీ నినాదం ‘వోకల్​ ఫర్​ లోకల్​’ స్ఫూర్తితో 400 ఏళ్ల క్రితం నాటి పద్ధతిలో మట్టితో బాణసంచా తయారు చేయిస్తోంది.

వడోదరా జిల్లాలోని కుమ్హర్‌వాడా, ఫతేపుర్‌ గ్రామాలకు చెందిన కొందరు కళాకారులు మట్టితో టపాసులు తయారు చేయడంలో సిద్ధహస్తులు. 400 ఏళ్ల క్రితంనాటి పద్ధతిలో ఈ బాణసంచా తయారు చేస్తారు. అయితే గత 20 ఏళ్లుగా ఈ టపాసులకు ఆదరణ లేకుండా పోయింది. దీంతో రంగంలోకి దిగిన ప్రముఖ్‌ పరివార్‌ మళ్లీ ఆ టపాసులను తయారుచేసే విధంగా స్థానికులను ప్రోత్సహిస్తోంది. ఆ కళాకారులకు ఉపాధి కల్పిస్తోంది. 

ఎలాంటి హాని ఉండదు

పర్యావరణ హితమైన ఈ బాణసంచాతో ఎలాంటి హాని ఉండదంటున్నారు స్వచ్ఛంద సంస్థ​ అధ్యక్షుడు నితల్​ గాంధీ. ‘ఇవి 100 శాతం దేశవాళీ బాణసంచా. కొథీలుగా పిలిచే వీటిని బంకమట్టితో తయారు చేస్తారు. కొన్ని టపాసులను కాగితం, వెదురుతో రూపొందిస్తారు. పర్యావరణ హితమైన ఈ బాణసంచాతో పిల్లలకు ఎలాంటి హాని ఉండదు. వోకల్​ ఫర్​ లోకలే లక్ష్యంగా మేము వీటిని తయారు చేయిస్తున్నాం. స్థానిక కళాకారులకు ఉపాధి కల్పించడమే మా లక్ష్యం’ అని నితల్‌ పేర్కొన్నారు.

తయారీదారుల హర్షం

ఈ స్వదేశీ బాణసంచా తయారీతో తమకు ఉపాధి దక్కడంపై తయారీదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రమణ్​ ప్రజాపతి అనే ఓ తయారీదారు మాట్లాడుతూ.. ‘400 ఏళ్ల క్రితం నుంచి ఈ తయారీ పద్ధతి ఉంది. గిరాకీ లేక 20 ఏళ్ల క్రితమే వీటి తయారీని ఆపేశాను. కానీ ఓ రోజు నితల్​ గాంధీ వచ్చి వీటి గురించి అడగ్గా కొన్ని నమూనాలు చూపించాను. ఇవి ఆయనకు నచ్చాయి. ఈ దీపావళికి కొంత సంపాదించబోతున్నా’ అని తన ఆనందాన్ని వెలిబుచ్చారు. ఈ బాణాసంచాకు ప్రస్తుతం మంచి ఆదరణ లభిస్తోందని.. మొత్తంగా లక్షకు పైగా కొథీలను తయారు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని