logo

చిత్రావతి కాలువలో ప్రేమజంట గల్లంతు

మండల పరిధిలోని దాడితోట గ్రామంలోని అయ్యవారిపల్లి గంగమ్మ గుడి వద్ద ఉన్న కాలువలో ప్రమాదవశాత్తు గల్లంతైంది. చిత్రావతి నది చూసేందుకు శుక్రవారం వెళ్లిన అమర్‌నాథ్, రామాంజనమ్మ కాలువలో కొట్టుకుపోయారు. స్థానిక ఎస్సై లక్ష్మీనారాయణ,

Updated : 15 Jan 2022 06:33 IST


చిత్రావతి సమీపంలో చివరిసారిగా  స్వీయ చిత్రం తీసుకున్న అమర్‌నాథ్, రామాంజనమ్మ 

దాడితోట(తాడిమర్రి), న్యూస్‌టుడే: మండల పరిధిలోని దాడితోట గ్రామంలోని అయ్యవారిపల్లి గంగమ్మ గుడి వద్ద ఉన్న కాలువలో ప్రమాదవశాత్తు గల్లంతైంది. చిత్రావతి నది చూసేందుకు శుక్రవారం వెళ్లిన అమర్‌నాథ్, రామాంజనమ్మ కాలువలో కొట్టుకుపోయారు. స్థానిక ఎస్సై లక్ష్మీనారాయణ, గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు.. బుక్కరాయసముద్రం మండలం కొత్తచెదుల్ల గ్రామానికి పిచ్చికుంట్ల అమర్‌నాథ్, అనంతపురం ప్రకాష్‌నగర్‌కు చెందిన రామాంజనమ్మ ఇరువురు ప్రేమికులు. అమర్‌నాథ్‌ అనంతపురంలో సెంట్రింగ్‌ పనులు చేస్తుంటాడు. అదే మండలానికి చెందిన పరశురాం అనే యువకుడు కూడా అమర్‌నాథ్‌ వద్ద పనిచేస్తున్నాడు. పరశురాం సంక్రాంతి పండగకు దాడితోటలోని తమ బంధువుల ఇంటికి వచ్చాడు. వారిని కూడా ఆహ్వానించాడు. ముగ్గురు కలిసి మధ్యాహ్నం భోజనం చేసి తరువాత చిత్రావతి జలాశయం చూసి, అయ్యవారిపల్లి గంగమ్మ గుడి వద్దకు చేరుకున్నారు. అక్కడంతా కలిసి చరవాణిలో చిత్రాలను తీసుకునే సమయంలో హఠాత్తుగా రామాంజనమ్మ కాలువలోకి జారిపోయింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో అమర్‌నాథ్‌ కుడా కాలువలో పడ్డాడు. పరశురాం వారిని గమనించేలోపు కాలువ మధ్యలో లోతుగా ఉన్న గుంతలోకి వెళ్లిపోయారు. జరిగిన విషయాన్ని పరశురాం గ్రామస్థులకు, పోలీసులకు తెలిపాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గల్లంతైన జంట కోసం గ్రామంలోని ఈతగాళ్లతో వెతికించారు. రాత్రి కావడంతో వెతకడం కష్టంగా మారిందని ఎస్సై లక్ష్మీనారాయణ తెలిపారు. పండగ రోజున ప్రేమికులు గల్లంతుకావడం ఇరువురు కుటుంబాలలో పెను విషాదాన్ని మిగిల్చింది. 


కాలువలో గాలిస్తున్న పోలీసులు, గ్రామస్థులు  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని