logo
Updated : 30/11/2021 06:36 IST

పోషకాహారానికేది అండ

అంగన్‌వాడీ కేంద్రాల్లో అధ్వానంగా చిన్నారుల భోజనం

దేవరకొండ, న్యూస్‌టుడే: నల్గొండ జిల్లాలో 1,833 ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు, 266 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటిలో 1,795 మంది టీచర్లు విధులు నిర్వహిస్తున్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందించేందుకు ప్రభుత్వం ఆరోగ్యలక్ష్మి పథకం ప్రవేశపెట్టింది. లబ్ధిదారులకు పాలు, గుడ్లతో కూడిన భోజనాన్ని అందించాల్సి ఉంది. 3-6 సంవత్సరాల పిల్లలకు, గర్భిణులకు ఆరోగ్యలక్ష్మిలో భాగంగా ఒక పూట భోజనం అందించాల్సి ఉంటుంది. 0-3 చిన్నారులకు బాలామృతం అందిస్తున్నట్లు లెక్కలు చూపుతున్నారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వీటిని పంపిణి చేస్తున్నారు కానీ.. అంగన్‌వాడీ కేంద్రంలో వారు చూపే లెక్కలకు పొంతన ఉండడం లేదు.. ఏ అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించినా ముగ్గురు లేదా ఐదుగురు చిన్నారులు తప్ప ఎక్కడా పది మంది కన్పించరు. మరికొన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో అసలు చిన్నారులే కన్పించరు. కానీ అధికారులు నిత్యం పది మందికి పైగా భోజనం చేస్తున్నట్లు లెక్కలు చూపుతూ గుడ్లు, పాలు, మురుకులు, బాలామృతం పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. దేవరకొండ ఐసీడీఎస్‌ ప్రాజెక్టులో పనిచేసే అధికారి మాత్రం హైదరాబాద్‌ నుంచి వస్తూ ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తుండడంతో మారుమూల ప్రాంతాలైన చందంపేట, డిండి అంగన్‌వాడీ టీచర్లు తమ విధులను చుట్టపుచూపుగా నిర్వహిస్తున్నారు. ఇకనైనా సంబంధిత ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి అధ్వాన పరిస్థితిని మార్చేందుకు కృషి చేయాలని పలువురు కోరుతున్నారు.


చిత్రంలో కన్పిస్తున్న కోడి గుడ్లు డిండి మండలంలో ఓ అంగన్‌వాడీ కేంద్రంలో ఈ నెల 20న చిన్నారులకు పోషకాహారంగా పంపిణీ చేశారు. నెలల తరబడి పంపిణీ చేయకుండా నిల్వ ఉంచి కొత్త స్టాక్‌ వచ్చినప్పుడు వాటిని అందించకుండా రోజుల తరబడి నిల్వ ఉంచిన గుడ్లను చిన్నారులకు అందించారు. ఈ విషయంపై చిన్నారుల తల్లిదండ్రులు, గ్రామస్థులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు విచారణకు వస్తున్నారని డేగుల ద్వారా విషయం తెలుసుకున్న అంగన్‌వాడీ సిబ్బంది నిల్వ ఉన్న గుడ్లను కాస్తా వాగులో పడేశారు.


ఇందులో కన్పిస్తున్న బాలామృతం ప్యాకెట్లు అంగన్‌వాడీలో చిన్నారులకు అందించే పోషకాహారం కానీ..  లబ్ధిదారులకు అందకుండా బాలామృతం ప్యాకెట్లు దేవరకొండ మండలంలో పాల విక్రయదారులకు, పశువుల దాణాకు విక్రయిస్తున్నారు. దేవరకొండ పట్టణంలో నిత్యం కొంతమంది పాల విక్రయదారులు బాలామృతాన్ని నీళ్లు పోసి విక్రయిస్తున్న సంఘటన ఇది.


నాణ్యతతో అందించాలి

- సుమిత్ర, పీడీ, నల్గొండ

అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు నాణ్యతతో కూడిన పోషకాహారం అందించాలి. అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చే పౌష్టికాహారాన్ని తప్పనిసరిగా వాటిని పరిశీలించాకే దింపుకోవాలి. నాసిరకపు గుడ్లు, పాలు వస్తే మా దృష్టికి తీసుకురావాలి. అంగన్‌వాడీ కేంద్రాల్లో పక్కదారి పట్టినట్లు ఫిర్యాదులు వస్తే విచారణ నిర్వహిస్తాం.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని