logo
Published : 30/11/2021 03:55 IST

ఆపదొస్తే అంతే..

ఉమ్మడి జిల్లాలో 108 వాహన సేవలు అధ్వానం

సూర్యాపేట (తాళ్లగడ్డ), నల్గొండ అర్బన్‌, న్యూస్‌టుడే

ఈ నెల 21వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో సూర్యాపేట జిల్లా కేంద్రం ఖమ్మం రోడ్డులోని పెట్రోల్‌ బంక్‌ ఎదురుగా సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్తున్న కారు వెనుక నుంచి ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని వెంటనే సూర్యాపేట జనరల్‌ ఆసుపత్రికి తరలించేందుకు స్థానికులు 108 నంబరుకు ఫోను చేసి వాహనాన్ని పంపించాలని కోరారు. ప్రస్తుతం వాహనాలు అందుబాటులో లేవని.. ఫోన్‌ కట్‌ చేశారు. స్థానిక యువకులు క్షతగాత్రుడి ప్రైవేటు వాహనంలో సూర్యాపేట జనరల్‌ ఆసుపత్రికి తరలించారు.


సూర్యాపేట జమ్మిగడ్డ క్రాస్‌ రోడ్డులో సెప్టెంబరు 18వ తేదీన ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని ఆటో ఢీకొంది. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించేందుకు స్థానికులు 108 కోసం ఫోను చేయగా.. ప్రస్తుతం పెన్‌పహాడ్‌ మండలంలో ఉందని చెప్పారు. కొద్ది సేపు అంబులెన్సు కోసం నిరీక్షించిన స్థానికులు చివరకు ఢీకొట్టిన ఆటోలోనే ఆసుపత్రికి తరలించారు.


ఉమ్మడి జిల్లాలో 108 అంబులెన్సు సేవలు అధ్వానంగా తయారయ్యాయి. సకాలంలో అందుబాటులో లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. కొన్ని మండలాలకు అసలు వాహనాలే కేటాయించలేని పరిస్థితి నెలకొంది. అందుబాటులో ఉన్న వాటిలో ఎక్కువ శాతం పదేళ్ల క్రితం వాహనాలే ఉన్నాయి. వీటిలో కొన్ని ఏడాది క్రితం మూలనపడ్డాయి. వెరసి.. సేవల్లో తీవ్ర జాప్యమవుతోంది. ఒక్కోసారి వాహనాలు అందుబాటులో లేవంటూ సిబ్బంది సమాధానం చెబుతున్నారు.

సూర్యాపేట జిల్లాలో పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. జిల్లాలోని సూర్యాపేట డివిజన్‌కు 4 వాహనాలు, హుజూర్‌నగర్‌ డివిజన్‌కు 6 వాహనాలను కేటాయించారు. సూర్యాపేట డివిజన్లోని నాగారం, తిరుమలగిరి, తుంగతుర్తి మండలాలకు ఏడాదిగా ప్రత్యేకమైన వాహనాలు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మండలాల్లో ఏదైనా సమస్య ఏర్పడితే జాజిరెడ్డిగూడెంలో ఉండే వాహనమే దిక్కు. ఏడాది నుంచి ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారులకు సమస్యపై ప్రజలు విన్నవించినా ఫలితం కనిపించడం లేదు. హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’లో భాగంగా అందించిన 108 అంబులెన్సు హుజూర్‌నగర్‌ మండలానికి కేటాయించారు. ఈ స్థానంలో ఉన్న పాత వాహనాన్ని ఇక్కడే వినియోగించాల్సి ఉన్నప్పటికీ భద్రాచలం పంపించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉన్న రెండు వాహనాల్లో ఒకటి మరమ్మతులకు గురికావడంతో తొలగించారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఒకటే సేవలు కొనసాగిస్తుంది.

* నల్గొండ జిల్లాలో 108 అంబులెన్సుల కొరత కారణంగా మారుమూల ప్రాంతాల నుంచి బాధితులను సకాలంలో ఆసుపత్రులకు తీసుకురావడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జిల్లాలో ప్రతి మండలానికో అంబులెన్స్‌ ఏర్పాటు చేస్తామని మూడేళ్ల క్రితం ప్రజాప్రతినిధులు చెప్పినప్పటికీ అమల్లో జాప్యంతో క్షతగాత్రులు, ప్రసవానికి వచ్చే మాతృమూర్తులు, పాము కాటు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో 108 నెంబర్‌కు సమాచారం ఇచ్చినా సుదూర ప్రాంతం నుంచి అంబులెన్స్‌ వచ్చే సమయానికి బాధితుల ప్రాణాలమీదకు వస్తుంది. ప్రస్తుతం జిల్లాలో 18 అంబులెన్సులు అందుబాటులో ఉన్నాయి.

* యాదాద్రి భువనగిరి జిల్లాలో 108 పదకొండు అంబులెన్స్‌లు ఉన్నాయి. ఇందులో ఒకటి భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’లో భాగంగా సమకూర్చారు. భువనగిరిలో రెండు, ఆలేరు, యాదగిరిగుట్ట, బీబీనగర్‌, తుర్కపల్లి, చౌటుప్పల్‌, రామన్నపేట, వలిగొండ, చౌటుప్పల్‌, మోత్కూరులో మండలాల్లో ఒక్కో వాహనం ద్వారా సేవలు అందుతున్నాయి. పోచంపల్లికి కేటాయించిన వాహనం ఇటీవల మరమ్మతులకు గురవడంతో అందుబాటులో లేదు. మోటకొండూరు, గుండాల, ఆత్మకూరు, అడ్డగూడూరు, రాజపేట, నారాయణ్‌పూర్‌ మండలాల్లో ప్రత్యేకంగా 108 వాహనాలు లేవు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని