logo

మన్యం సమగ్రాభివృద్ధికి కృషి

మహనీయుల ఆశయాలు, త్యాగాలే స్ఫూర్తిగా అధికార యంత్రాంగం జిల్లా సమగ్రాభివృద్ధికి కృషిచేయాలని కలెక్టర్‌ అనుదీప్‌   పిలుపునిచ్చారు. కొత్తగూడెం కలెక్టరేట్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందన

Published : 27 Jan 2022 03:58 IST

గణతంత్ర వేడుకల్లో కలెక్టర్‌ అనుదీప్‌ పిలుపు

జాతీయ పతకాన్ని ఎగురవేసి వందన సమర్పణ చేస్తున్న అనుదీప్‌

కొత్తగూడెం కలెక్టరేట్, న్యూస్‌టుడే: మహనీయుల ఆశయాలు, త్యాగాలే స్ఫూర్తిగా అధికార యంత్రాంగం జిల్లా సమగ్రాభివృద్ధికి కృషిచేయాలని కలెక్టర్‌ అనుదీప్‌   పిలుపునిచ్చారు. కొత్తగూడెం కలెక్టరేట్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందన సమర్పణ చేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. కలెక్టరేట్‌లో నిరాడంబరంగా నిర్వహించిన వేడుకలనుద్దేశించి అనుదీప్‌ మాట్లాడుతూ.. భిన్న సంస్కృతులు, మతాలు, భాషలు గల భారతావని ఒకే గొంతుకలా ముందుకు సాగుతోందంటే అది రాజ్యాంగం చలవే అన్నారు. అందులో అన్ని వర్గాల ప్రజల స్వేచ్ఛ, సమానతకు మహనీయులు పెద్దపీట వేశారన్నారు. అఖండ భారత్‌ సమైక్యత, సోదరభావంలో నేడు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. మహనీయుల ఆశయాలు నెరవేరాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు లక్షిత పేద, బలహీన వర్గాలకు చేరేలా అధికార యంత్రాంగమంతా చిత్తశుద్ధితో కృషిచేయాలని కోరారు. మణుగూరు మండల వాసి రామచంద్రయ్య ‘పద్మశ్రీ’ పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. కరోనా మహమ్మారి అంతానికి వ్యాక్సిన్‌ అందించిన భారత్‌ బయోటెక్‌ అధినేత కృష్ణ ఎల్ల దంపతులు పద్మభూషణ్‌ అందుకోవడం, వారు తెలంగాణ ప్రాంతం వారు కావడం గర్వకారణమన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన వైద్య, నర్సింగ్‌ కళాశాలల తరగతులు త్వరలో ప్రారంభించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. నూతన కలెక్టరేట్‌ భవన సముదాయంతో పాటు సీతమ్మ సాగర్‌, సీతారామ ఎత్తిపోతల పథకాలు భద్రాద్రికి మణిహారంగా మారనున్నట్లు చెప్పారు. బీటీపీఎస్‌, కేటీపీఎస్‌ వెలుగులు రాష్ట్రమంతా ప్రసరిస్తున్నాయని గుర్తుచేశారు.

* ప్రతి ఇంటి నుంచి సేకరించే వ్యర్థాలతో వర్మీ కంపోస్టు ఎరువులు తయారు చేస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. ‘హరితహారం’ అవెన్యూ ప్లాంటేషన్‌తో రహదారుల ఇరువైపులా చెట్లు పచ్చని తోరణాల్లా కనిపిస్తున్నాయన్నారు. పుణ్యక్షేత్రం భద్రాచలం ‘క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ సిటీ’గా అవతరించబోతోందన్నారు. కరోనాను చైతన్యంతో తరిమికొట్టేందుకు కంకణబద్ధులు కావాలన్నారు. స్వీయ నియంత్రణ పాటించడమే ఇందుకు మార్గమన్నారు.కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ కె.వెంకటేశ్వర్లు, డీఆర్వో అశోక చక్రవర్తి, డీపీఆర్వో శ్రీనివాస్‌, ఏఓ గన్యా తదితరులు పాల్గొన్నారు.


భావితరాలకు ఆదర్శంగా నిలవాలి: జిల్లా జడ్జి

జెండా ఆవిష్కరిస్తున్న జిల్లా జడ్జి చంద్రశేఖరప్రసాద్‌

ఖమ్మం న్యాయవిభాగం, న్యూస్‌టుడే: న్యాయవాదులు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తూ సమాజానికి మార్గదర్శకులు కావాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖరప్రసాద్‌ అన్నారు. బుధవారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కోర్టులో న్యాయమూర్తి జాతీయ జెండా ఆవిష్కరించి న్యాయవాదులు, ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజం సక్రమ మార్గంలో నడవాలంటే న్యాయవాదులు చేసే కార్యక్రమాలు ముందు తరాలకు ఆదర్శంగా ఉండాలన్నారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. న్యాయమూర్తులు డానీరూత్‌, శ్యాంశ్రీ, అక్తర్‌, శ్రీనివాస్‌, జావీద్‌పాషా, అనితారెడ్డి, శాంతిసోనీ, మౌనిక, పూజిత, భారతి, బార్‌ అధ్యక్షుడు మలీదు నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు కె.గురుమూర్తి, కార్యదర్శి కోనా చంద్రశేఖర్‌, ఇమ్మడి లక్ష్మీనారాయణ, బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు కొల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.


‘సింగరేణికి ఆర్థిక పటిష్టత’

జెండా వందనం చేస్తున్న చంద్రశేఖర్‌, ఉద్యోగులు

కొత్తగూడెం సింగరేణి, న్యూస్‌టుడే: సింగరేణికి పటిష్ట ఆర్థిక పునాది వేసే లక్ష్యంతో రానున్న అయిదేళ్లలో 10 కొత్త గనులు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసినట్లు సంస్థ డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌)ఎస్‌.చంద్రశేఖర్‌ అన్నారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా బుధవారం కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో ఆయన త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ గతేడాది ఇదే సమయానికి నష్టాల్లో ఉన్న సంస్థ ఈ ఆర్థిక సంవత్సరాంతానికి రూ.25 వేల కోట్ల టర్నోవర్‌ను సాధిస్తుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. మూడో దశ కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకొంటున్నామన్నారు. రూ.3.5 కోట్లతో అయిదు చోట్ల ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 16,292 మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించినట్లు వెల్లడించారు. కార్మిక సంక్షేమానికి పెద్దపీˆట వేస్తున్నామన్నారు. తెలంగాణ రాక ముందు ఒక్కో కార్మికునికి సగటున రూ.70 వేలు ఖర్చుచేయగా ప్రస్తుతం ఈ మొత్తం రూ.2.10 లక్షలకు పెరిగిందని చంద్రశేఖర్‌ వెల్లడించారు. డైరెక్టర్లు బలరాం, సత్యనారాయణరావు, నాయకులు వెంకటరావు,  డి.శేషయ్య,   మధుకర్‌, జీఎంలు బసవయ్య, ఆనందరావు, నాగభూషణ్‌రెడ్డి, ముఖ్యవైద్యాధికారి వేడుకల్లో పాల్గొన్నారు. ఉత్తమ కార్మికులు, అధికారులను డైరెక్టర్లు సన్మానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని