logo

రాజీవ్‌ స్వగృహ ఇళ్ల విక్రయం వేలం పాటకు త్వరలోనే నోటిఫికేషన్‌

ఖమ్మం గ్రామీణ మండలం పోలేపల్లి రెవెన్యూ పరిధిలో నిర్మించిన రాజీవ్‌ స్వగృహ ఇళ్ల సముదాయాన్ని ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రయత్నం చేస్తుంది. త్వరలోనే దీనికి టెండర్లు పిలిచి వేలం పాటలో ఇళ్ల సముదాయాన్ని విక్రయించేందుకు

Published : 27 Jan 2022 03:58 IST

ఖమ్మం గ్రామీణం, న్యూస్‌టుడే

2021 నవంబరు 28న ప్రచురితమైన కథనం

ఖమ్మం గ్రామీణ మండలం పోలేపల్లి రెవెన్యూ పరిధిలో నిర్మించిన రాజీవ్‌ స్వగృహ ఇళ్ల సముదాయాన్ని ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రయత్నం చేస్తుంది. త్వరలోనే దీనికి టెండర్లు పిలిచి వేలం పాటలో ఇళ్ల సముదాయాన్ని విక్రయించేందుకు కసరత్తు చేస్తున్నారు’ అంటూ 2021 నవంబరు 28వ తేదీన ‘ఈనాడు’ పత్రికలో కథనం ప్రచురితమైంది.
అదే నిజమైంది. సరిగ్గా రెండు నెలలు అంటే బుధవారం(26 జనవరి 2022) కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ రాజీవ్‌స్వగృహ ఇళ్ల సముదాయాన్ని సందర్శించి త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ చేసి వేలం పద్ధతిలో ఇళ్ల సముదాయాన్ని విక్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ స్వయంగా ప్రకటించారు.

నిర్మాణం ఇలా: 2008లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం స్థిరాస్తి వ్యాపారం చేయడానికి సిద్ధపడి ప్రభుత్వ ఉద్యోగులు, మధ్య తరగతి వారి సొంతింటి కళను నెరవేర్చేందుకు రాజీవ్‌స్వగృహ పథకాన్ని తీసుకొచ్చారు. ఖమ్మం గ్రామీణ మండలం పోలేపల్లి రెవెన్యూ పరిధిలో నిర్మాణం చేపట్టారు. రూ.వంద కోట్ల వ్యయంతో నిర్మాణం ప్రారంభించి సుమారు రూ.72 కోట్లు ఖర్చు చేశారు. మొత్తం 8 బ్లాకులు, ఒక్కో బ్లాక్‌లో 9 ఫ్లోరులు, ఒక్కో ఫ్లోర్‌కు 8 ఇళ్లు మొత్తం 576 ఇళ్లు నిర్మించారు. వాటిలో రెండు పడక గదుల ఇళ్లు 288 ఒక్కో ఇంటి విస్తీర్ణం 1,145 చదరపు అడుగులు, మూడు పడక గదుల ఇళ్లు 288 ఉన్నాయి. ఒక్కో ఇంటి విస్తీర్ణం 1,435 చదరపు అడుగులు ఉంది.
ఉద్యోగులకు నిరాశే: 2018లో ఉద్యోగ సంఘాల నేతలు, మరికొందరితో కలిసి రాజీవ్‌ స్వగృహ ఇళ్ల సముదాయాన్ని కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు. కానీ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల నాయకుల మధ్య చర్చలు సఫలం కాలేదు.

వచ్చే ఆదాయం(సుమారుగా..)  
2008లోనే 576 ఇళ్ల నిర్మాణానికి రూ.72 కోట్లు ఖర్చు చేశారు. వాస్తవంగా ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ధరల ప్రకారం రెండు పడకగదుల ఇల్లు ఒక్కోటి సరాసరి రూ.30 లక్షలు ఉంటుంది. ఇలా 288 ఇళ్లకు రూ.86.40 కోట్లు, మూడు పడక గదుల ఇల్లు అయితే దాదాపుగా రూ.35 లక్షలు ఉంటుంది. అలా 288 ఇళ్లకు రూ.100.80 కోట్లు వచ్చే వీలుంది. మొత్తం భూమి 16.23 ఎకరాలలో మొదటి ఫేజ్‌లో భాగంగా 9.23 ఎకరాలలో ఇళ్లు నిర్మించారు. రెండో ఫేజ్‌ నిర్మాణానికి 7 ఎకరాలు కేటాయించారు. ఖాళీగా ఉన్న ఈ 7 ఎకరాల స్థలం గుర్తించి హద్దులు కూడా నిర్ణయించారు. ప్రస్తుతం ఇక్కడ ధర ఎకరానికి రూ.2 కోట్లు. ఈ లెక్కన రూ.14 కోట్ల వచ్చే వీలుంది. ఇలా మొత్తం సుమారుగా ఆదాయం రూ.201.20 కోట్లు ప్రభుత్వ ఖజానాకు జమ అయ్యే అవకాశం నెలకొంది. కానీ ప్రభుత్వం, అధికారులు ఏ ధరకు ఇళ్లను, భూమిని కట్టబెడతారో వేచి చూడాలి.


ఇళ్ల సముదాయం విక్రయం
కలెక్టర్‌ గౌతమ్‌

ఇళ్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ గౌతమ్‌ పక్కన కమిషనర్‌ ఆదర్శ్‌ సురభి

ఖమ్మం గ్రామీణం, న్యూస్‌టుడే: జలజ టౌన్‌షిప్‌(రాజీవ్‌స్వగృహ) ఇళ్ల సముదాయాలను వేలం పద్ధతిలో విక్రయించటానికి త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ అన్నారు. పోలేపల్లి పంచాయతీ పరిధిలో నిర్మాణం చేపట్టిన రాజీవ్‌స్వగృహ ఇళ్ల సముదాయాన్ని నగరపాలక సంస్థ కమిషనర్‌ ఆదర్శ్‌ సురభి, శిక్షణ కలెక్టర్‌ బి.రాహుల్‌తో కలిసి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. 576 ఇళ్ల సముదాయాలను వేలం పద్ధతిన విక్రయించటానికి నిర్ణయించినట్లు తెలిపారు. సంబంధిత సమాచారం ఎంఎస్‌టీసీ వైబ్‌సైట్‌లో పొందుపర్చామని, ఈ-వేలం పద్ధతిన పూర్తి పారదర్శకంగా విక్రయ ప్రక్రియ జరుగుతుందన్నారు. వివరాలకు కలెక్టర్‌ కార్యాలయంలో హెల్ప్‌డెస్క్‌, రాజీవ్‌స్వగృహ ఇళ్ల సముదాయంలో ప్రత్యేక కార్యాలయం అందుబాటులో ఉంటుందని కలెక్టర్‌ వివరించారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని