logo

పరమానందం పంచిన తిరుమంజనం

భద్రాచలం రామాలయంలో బుధవారం స్వామివారికి తిరుమంజనం నిర్వహించి సుప్రభాతం పలికి ఆరాధించారు. మంత్రోచ్ఛారణ మధ్య సాగిన ఈ వేడుక పరమానందాన్ని పంచింది. భక్తులు ప్రధాన కోవెలలోని మూలమూర్తులను దర్శించుకుని

Published : 27 Jan 2022 03:58 IST

పూజలు అందుకుంటున్న సీతారాముడు

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం రామాలయంలో బుధవారం స్వామివారికి తిరుమంజనం నిర్వహించి సుప్రభాతం పలికి ఆరాధించారు. మంత్రోచ్ఛారణ మధ్య సాగిన ఈ వేడుక పరమానందాన్ని పంచింది. భక్తులు ప్రధాన కోవెలలోని మూలమూర్తులను దర్శించుకుని అనుబంధంగా ఉన్న ఆంజనేయస్వామిని లక్ష్మీతాయారు అమ్మవారిని దర్శించి పూజలు చేశారు. బేడా మండపం వద్ద వైదిక పెద్దలు క్షేత్ర చరిత్రపై చేసిన ప్రవచనం ఆకట్టుకుంది. వైష్ణవ సంప్రదాయం ప్రకారం విష్వక్సేన పూజ చేసి పుణ్యాహ వాచనం నిర్వహించి కంకణాలను ధరింపజేశారు. కన్యాదానం నిర్వహించి ప్రవరను పఠించి సీతమ్మవారికి యోక్త్రాన్ని రామయ్యకు యజ్ఞోపవీతాన్ని ధరింపజేశారు. భక్తుల జయజయ నీరాజనాల మధ్య మాంగళ్య ధారణ చేసి తలంబ్రాల వేడుక కొనసాగించారు. దర్బారు సేవ ఆధ్యాత్మికతను రెట్టింపు చేసింది.
ఘనంగా ముగిసిన విలాసోత్సవాలు
భద్రాచలం రామాలయంలో మూడు రోజులపాటు కొనసాగిన విలాసోత్సవాలు బుధవారం ఘనంగా ముగిశాయి. దేవస్థానం సిబ్బంది ఆధ్వర్యంలో వశిష్ట మండపంలో ఈ క్రతువు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కొవిడ్‌ ఆంక్షలతో కోవెల ప్రాంగణంలో వేడుక చేశారు. మంత్రోచ్చారణతో పాటు మంగళవాద్యాల మధ్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుణ్ని పల్లకీలో తీసుకొచ్చి చిత్రకూట మండపంలో ఉంచారు. అర్చకులు స్వామికి అర్చనలు చేసి తీర్థ ప్రసాదాలను అందించి ఆశీర్వచనాలు పలికారు. 29న విశ్వరూప సేవ నిర్వహించనున్నారు.
నగదు లెక్కించే యంత్రం వితరణ
హైదరాబాద్‌కు చెందిన శ్రీ భ్రమరాంబికా సేవా సమితి ఆధ్వర్యంలో భద్రాచలం రాములవారికి నగదు లెక్కించే యంత్రాన్ని కానుకగా అందించారు. దాతలు బుధవారం రాముణ్ని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించి రూ.6 వేల విలువైన ఈ యంత్రాన్ని సమర్పించారు. కౌంటర్లలో నగదును లెక్కించేందుకు దీన్ని ఉపయోగించనున్నట్లు సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని