logo

దరఖాస్తుల వెల్లువ

ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే ఎస్సీ విద్యార్థులకు ప్రభుత్వం ఉపకార వేతనాలు అందిస్తోంది. అవగాహన లోపం, దరఖాస్తులు చేయకపోవడం వంటి కారణాలతో అర్హులందరికీ ప్రీమెట్రిక్‌ ఉపకార వేతనం దరిచేరడంలేదు. ఈసారి అర్హులందరికీ అందించాలనే

Published : 27 Jan 2022 03:58 IST

ఎస్సీ ప్రీమెట్రిక్‌  ఉపకార వేతనాలకు 4267 మంది నమోదు
ఖమ్మం సంక్షేమవిభాగం, న్యూస్‌టుడే

విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాన్ని అందిస్తున్న సత్యనారాయణ

ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే ఎస్సీ విద్యార్థులకు ప్రభుత్వం ఉపకార వేతనాలు అందిస్తోంది. అవగాహన లోపం, దరఖాస్తులు చేయకపోవడం వంటి కారణాలతో అర్హులందరికీ ప్రీమెట్రిక్‌ ఉపకార వేతనం దరిచేరడంలేదు. ఈసారి అర్హులందరికీ అందించాలనే లక్ష్యంతో జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి గతేడాది కన్నా మూడింతలు దరఖాస్తులు నమోదు చేయించారు. ఈ విద్యా సంవత్సరంలో 4267 మంది విద్యార్థులు దరఖాస్తులు చేయడంతో రాష్ట్రంలో జిల్లా ముందు స్థానంలో నిలిచింది. అందులో ఇప్పటివరకు 1738 మందికి నిధులు విడుదల చేయగా ఇంకా 2529 మందికి రావాల్సి ఉంది.
జిల్లాకు ప్రథమ స్థానం
ఎస్సీ విద్యార్థులకు ప్రీమెట్రిక్‌ ఉపకార వేతనాలు అందించేందుకు జిల్లా పాలనాధికారి గౌతమ్‌ ప్రత్యేక దృష్టిసారించారు. పలుమార్లు అధికారులతో సమీక్షించి ప్రక్రియను వేగవంతం చేసేందుకు రెవెన్యూ, విద్యాశాఖ, మీసేవ, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి కమిటీని ఏర్పాటు చేశారు. దీంతో వీరంతా జిల్లాలోని ఆయా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను అందించారు. ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలో వసతిగృహ సంక్షేమాధికారులు ప్రతిరోజూ పాఠశాలలకు వెళ్లి విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కలిసి వారిని చైతన్యవంతం చేయడంలో సఫలీకృతులయ్యారు. దీనికితోడు ఎస్సీడీడీ కస్తాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రతిరోజూ సాయంత్రం జూమ్‌ సమావేశం ద్వారా పురోగతిని సమీక్షించడం వంటి పనులు చేశారు. ఒక దశలో ప్రక్రియ వేగవంతం చేసేందుకు అలసత్వం వహించే సంక్షేమాధికారులకు శ్రీముఖాలు కూడా జారీ చేశారు. దీంతో ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేసి విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించేందుకు కృషి చేసి జిల్లాను ముందువరుసలో నిలిపారు.

* రాజీవ్‌ విద్యాదీవెన(ఆర్‌వీడీ): 9,10 తరగతులు చదివే విద్యార్థులకు అందించే ఉపకార వేతనం. ఒక్కొక్కరికి రూ.3000 ఇస్తారు.

* న్యూస్కీమ్‌: 5 నుంచి 8వ తరగతిలో అందించే ఉపకార వేతనం. ఒక్కో బాలురకు రూ.1000, బాలికలకు రూ.1500 అందిస్తారు.


ఏటా దరఖాస్తు సంఖ్య ఆశించినంత సంఖ్యలో రాకపోవడంతో ఈసారి ప్రత్యేక దృష్టిసారించాం. జిల్లా పాలనాధికారి ప్రత్యేక చొరవతో గతంలో ఎన్నడూలేనంతగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

- కస్తాల సత్యనారాయణ, ఎస్సీడీడీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని