logo

అసలుకు ఆరింతలు వసూళ్లు

గోరంత ఖర్చు చేసి కొండంత లాగేస్తున్నారు. దస్త్రాల ముసుగులో మద్యం లైసెన్సీల నుంచి రూ.లక్షల్లో గుంజుతున్నారు. ఆబ్కారీ శాఖలో ఆనవాయితీగా మారిన అడ్డగోలు వ్యవహారం తరచి చూస్తే ఔరా అన్పించకమానదు. ఆ శాఖలోని ఉద్యోగ సంఘం

Published : 27 Jan 2022 03:58 IST

ఆబ్కారీ కార్యాలయంలోనే దస్త్రాల అడ్డగోలు విక్రయాలు

ఖమ్మం సారథినగర్‌, న్యూస్‌టుడే

గోరంత ఖర్చు చేసి కొండంత లాగేస్తున్నారు. దస్త్రాల ముసుగులో మద్యం లైసెన్సీల నుంచి రూ.లక్షల్లో గుంజుతున్నారు. ఆబ్కారీ శాఖలో ఆనవాయితీగా మారిన అడ్డగోలు వ్యవహారం తరచి చూస్తే ఔరా అన్పించకమానదు. ఆ శాఖలోని ఉద్యోగ సంఘం ముద్రించిన దస్త్రాలను(రిజిష్టర్‌లను) ఆబ్కారీ సూపరింటెండెంట్ల(ఈఎస్‌) కార్యాలయాల్లోనే విక్రయిస్తుండటం గమనార్హం.
చెప్పిన ధరకే కొనుగోలు  
మద్యం దుకాణాల నిర్వహణకు దస్త్రాలు అవసరం. ఒక్కో దస్త్రం ఖరీదు బయట మార్కెట్లో రూ.400 వరకు ఉంటుంది. ఇదే దస్త్రాన్ని మద్యం లైసెన్సీ దుకాణదారుడు రూ.2,400కు అది కూడా ఎక్సైజ్‌ జిల్లా కార్యాలయం నుంచే కొనుగోలు చేస్తున్నారు. కచ్చితంగా ఇక్కడే కొనుగోలు చేయాలా? అంటే అలాంటి ఆంక్షలు లేవు. అయినా స్వకార్యం, స్వామి కార్యం ఇందులోనే ఉండటంతో దశాబ్దాలుగా ఇదే ఆనవాయితీ కొనసాగుతోంది. ఒక్క లైసెన్సీ కిక్కురుమనడం లేదు. చెప్పిన ధరకే కొనుగోలు చేస్తున్నారు.
రూ.లక్షల్లో దందా
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 220 మద్యం దుకాణాలున్నాయి. ఒక్కో దుకాణానికి తక్షణమే రెండు దస్త్రాలు అవసరం. ఈ లెక్కన ఒక్కో దుకాణదారుడు రెండు దస్త్రాలకు రూ.4800 ముట్టజెప్పాల్సి వస్తోంది. మిగిలిన రూ.200 తిరిగి ఏం ఇవ్వాలని రౌండ్‌ ఫిగర్‌ చేసుకుని రూ.5 వేలు వసూలు చేస్తున్నారనే వాదనలున్నాయి. ఇలా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 220 దుకాణాల్లో ఒక్కో దుకాణం అటు ఇటుగా అదనంగా చెల్లించిన రూ.4 వేలను లెక్కిస్తే రూ.8.8 లక్షలు అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఆదాయం ఎక్కడా ఆబ్కారీ అధికార శాఖ లెక్కల్లో ఉండదు. లాభం మాత్రం కొందరు ఉద్యోగుల చేతుల్లో పడుతోంది. ఇలా ఒక్కో దుకాణం తమ రెండేళ్ల కాలంలో రెండు నుంచి ఆరు దస్త్రాలను కొనుగోలు చేస్తుంది. ఈలెక్కన దస్త్రాలు విక్రయ వ్యాపారం ఎంత లాభసాటిగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రతీ దుకాణంలో రెండు దస్త్రాలు అవసరమవుతాయి. వాటి ధర రూ.1200 వరకు ఉంటుంది. శాఖతో సంబంధం లేకుండా వాటిని విక్రయిస్తారు. ధ్రువీకరణ సంతకం కోసం మాత్రమే దస్త్రాలు నా దగ్గరకు వస్తాయి. అధిక వసూళ్లు అనేది అవాస్తవం. విక్రయాల విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటాం.

- సోమిరెడ్డి, జిల్లా ఆబ్కారీ అధికారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని