logo

అందుబాటులో గురుకులం

ఎస్సీ గురుకులాలు పేద విద్యార్థులకు వరంగా మారాయి. అందుబాటులో ఉన్నత ప్రమాణాలతో కార్పొరేట్‌ తరహా విద్యను అందిస్తున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పదోతరగతి చదువుతున్న విద్యార్థులు సంక్షేమ గురుకుల కళాశాలల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో చేరేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Published : 22 Jan 2022 03:40 IST

ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

న్యూస్‌టుడే, అచ్చంపేట


అచ్చంపేటలో ప్రయోగాలు చేస్తున్న గురుకుల విద్యార్థులు

ఎస్సీ గురుకులాలు పేద విద్యార్థులకు వరంగా మారాయి. అందుబాటులో ఉన్నత ప్రమాణాలతో కార్పొరేట్‌ తరహా విద్యను అందిస్తున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పదోతరగతి చదువుతున్న విద్యార్థులు సంక్షేమ గురుకుల కళాశాలల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో చేరేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆంగ్ల మాధ్యమంలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపులతో పాటు వృత్తి విద్యా కోర్సులున్నాయి. ఇంటర్‌ తరగతుల నిర్వహణతో పాటు ఐఐటీ, ఎన్‌ఐటీ, నీట్‌, క్లాట్‌, సీఎంఏ తదితర పోటీ పరీక్షలకు అవసరమైన శిక్షణిస్తారు. నాణ్యమైన విద్యతో పాటు ఉచిత వసతి సౌకర్యం కల్పిస్తారు. ఈ గురుకులాల్లోని ప్రతిభ కళాశాలల్లో (కాలేజ్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌) చదివిన విద్యార్థులు ప్రతిష్ఠాత్మకమైన జాతీయ స్థాయి ఉన్నత విద్యా సంస్థల్లో సీట్లు సంపాదిస్తుండటం విశేషం.

● ఉమ్మడి జిల్లాలో బాలురకు మూడు, బాలికలకు రెండు మొత్తం అయిదు ప్రతిభా కళాశాలలున్నాయి. ఒక్కో కళాశాలలో ఎంపీసీలో 40, బైపీసీలో 40 చొప్పున ఉమ్మడి జిల్లాలోని 5 కళాశాలల్లో 400 సీట్లు అందుబాటులో ఉన్నాయి. సాధారణ, వృత్తి విద్యా కళాశాలలు బాలురకు మూడు, బాలికలకు 10 వంతున ఉమ్మడి జిల్లాలో 13 కళాశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో 560 సీట్లు, ఎంఈసీ, సీఈసీ గ్రూపుల్లో 80 సీట్లు, వృత్తి విద్యా కోర్సుల్లో 160 సీట్లు వంతున మొత్తం 800 సీట్లు ఉన్నాయి.

దరఖాస్తు గడువు 25..

గురుకుల విద్యాలయాల్లో ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రకటన జారీ చేశారు. 2022-23 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో చేరేందుకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌లో జనవరి 25 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఫిబ్రవరి 20న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్ష తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ఉంటుంది. విద్యార్థులకు బహుళైచ్చిక పద్ధతిలో 150 ప్రశ్నలకు 150 మార్కులు కేటాయిస్తారు. తప్పు జవాబు రాస్తే ఒక్కో ప్రశ్నకు పావు మార్కు తగ్గిస్తారు. విద్యార్థుల ప్రతిభతోపాటు రిజర్వేషన్ల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు.

ప్రమాణాలు ఉన్నతం..

సాధారణ, వృత్తి విద్యా కళాశాలలు● బాలురకు నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట, లింగాల, మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర కళాశాలలున్నాయి.

● బాలికలకు నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని మన్ననూరు, తెలకపల్లి, వనపర్తి జిల్లాలోని గోపాల్‌పేట, పెద్దమందడి, జోగులాంబ గద్వాల జిల్లాలో అలంపూర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలో రాంరెడ్డి గూడెం, నంచర్ల, నారాయణపేట జిల్లాలో మరికల్‌, ఊట్కూరు, నారాయణపేట కళాశాలలు.

విధానం ఇలా..

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విద్యార్థులు పేరు, ఇంటి పేరు, ప్రస్తుతం చదువుతున్న పాఠశాల నుంచి పుట్టిన తేదీ ధ్రువీకరణ, చరవాణి సంఖ్య, ఇంటర్మీడియట్‌లో ఎంపిక చేసుకోబోయే గ్రూపు, ప్రస్తుతం చదువుతున్న పాఠశాల పేరు, మాధ్యమం, పాఠశాల చిరునామా, విద్యార్థి ఆధార్‌ సంఖ్య, కులం, ఉప కులం, గ్రూపు వివరాలు, విద్యార్థి ఫొటో, తల్లిదండ్రుల పేర్లు, గ్రామం, మండలం, ప్రస్తుత జిల్లా, పాత జిల్లా, విద్యార్థి చదువుతున్న జిల్లా పేరు, పిన్‌కోడ్‌ సంఖ్య తదితర వివరాలను దరఖాస్తులో నమోదు చేయాలి.

బాలురకు.. : నాగర్‌కర్నూలు జిల్లాలోని జేపీనగర్‌ (కల్వకుర్తి), వనపర్తి జిల్లాలోని మదనాపూర్‌, జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇటిక్యాల కళాశాలలు

బాలికలకు.. : మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జడ్చర్ల, జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టు కళాశాలలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని