logo

చెరువులో మునిగి విద్యార్థి దుర్మరణం

దెందులూరు మండలం చల్లపల్లిలోని పిల్లకుంట చెరువులో మునిగి యడ్లపల్లి అజయ్‌బాబు(17) శుక్రవారం మృతి చెందాడు. ఇందుకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మాణిక్యాలరావు, మంగమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, అజయ్‌బాబు సంతానం

Published : 22 Jan 2022 01:45 IST


అజయ్‌బాబు(పాతచిత్రం)

చల్లపల్లి(దెందులూరు), న్యూస్‌టుడే: దెందులూరు మండలం చల్లపల్లిలోని పిల్లకుంట చెరువులో మునిగి యడ్లపల్లి అజయ్‌బాబు(17) శుక్రవారం మృతి చెందాడు. ఇందుకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మాణిక్యాలరావు, మంగమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, అజయ్‌బాబు సంతానం. కుమార్తెలకు వివాహం కాగా అజయ్‌బాబు పాలిటెక్నిక్‌ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం సెలవు కావడంతో ఇంటివద్దే ఉన్నాడు. 11 గంటలు ప్రాంతంలో గ్రామానికి సమీపంలోని పిల్లికుంట వైపు పశువులను తోలుకెళ్లాడు. మధ్యాహ్నం తర్వాత పశువులు చెరువులో దిగడంతో వాటిని కడిగి ఇంటికి తోలుకెళ్లడానికి చెరువులో దిగాడు. అప్పటివరకు ఆయనతో కలిసి ఉన్న మరో వ్యక్తి అజయ్‌బాబు ఎంత సేపటికి తిరిగి రాకపోవడంతో చెరువు వద్దకు వెళ్లి చూశాడు. ఆయన దుస్తులు, ఇతర వస్తువులు ఉండటంతో వెంటనే గ్రామానికి వెళ్లి విషయాన్ని తెలియచేశాడు. గ్రామస్థులు వచ్చి పడవ సాయంతో చెరువులో గాలించి మృతదేహాన్ని బయటకు ఇంటికి తీసుకెళ్లారు. దీనిపై ఎటువంటి ఫిర్యాదు రాలేదని దెందులూరు పోలీసులు తెలిపారు.

ఒక్కగానొక్క కుమారుడు..: చేతికి అందివచ్చిన ఒక్కగానొక్క కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులతో పాటు బంధువులు బోరున విలపించారు. గ్రామస్థులు కన్నీరు పెట్ట్టుకున్నారు. అందరితో కలివిడిగా ఉండటంతో పాటు శుక్రవారం ఉదయం స్థానిక యువకులతో కలిసి ఉండి సాయంత్రానికి చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చెరువులో ఇష్టానుసారంగా తవ్వకాలు సాగించడం వల్లే ప్రమాదం జరిగినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని