logo
Published : 01/12/2021 03:12 IST

నియంత్రణే లక్ష్యం

హెచ్‌ఐవీ బాధితుల్లో ఉమ్మడి జిల్లా  నాలుగో స్థానం

నేడు అంతర్జాతీయ ఎయిడ్స్‌ నివారణ దినం

కొత్తగూడెం పట్టణం, ఖమ్మం వైద్యవిభాగం, న్యూస్‌టుడే

రోగ నిరోధక శక్తిని క్షీణింపచేస్తూ ప్రాణాలను హరించే ఎయిడ్స్‌ మహమ్మారి ఉభయ జిల్లాలను కలవరపరుస్తోంది. రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వైరస్‌ బాధితుల సంఖ్యలో నాలుగో స్థానంలో ఉంది. దేశంలో తెలంగాణ రాష్ట్రం నాలుగో స్థానంలో ఉంది. వ్యాధి నియంత్రణకు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నా ప్రతి నెలా కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. సమస్యపై అవగాహన కల్పించేందుకు ప్రతి డిసెంబరు 1న అంతర్జాతీయ ఎయిడ్స్‌ నివారణ దినం నిర్వహిస్తున్నారు. జిల్లాలో వ్యాధిగ్రస్థులు, కారణాలు, నివారణ చర్యలు, బాధితులకందుతున్న సేవలపై ‘న్యూస్‌టుడే’ కథనం.

వ్యాధికి కారణాలు ఇవే..

ప్రధానంగా అరక్షిత లైంగిక సంబంధాలు, పాజిటివ్‌ రోగులు వాడిన సూదులు, సిరంజీలు, రేజర్లు, బ్లేడ్లు ఉపయోగించడం, రక్తాన్ని పరీక్షించకుండా ఇతరులకు ఎక్కించడం ద్వారా ఎయిడ్స్‌ విస్తరిస్తోంది. కొత్తగా నమోదవుతున్న బాధితుల్లో ఇలాంటివారే ఉంటున్నారు. జిల్లాలో ప్రతినెలా నమోదవుతున్న కొత్తగా కేసుల్లో ఇద్దరు గర్భిణులు ఉంటున్నారు. హెచ్‌ఐవీ క్రిమి మానవ శరీరంలో ప్రవేశించిన తర్వాత రోగ నిరోధక శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

ఐసీటీ కేంద్రాల్లో బాధితులకు సేవలు

సమగ్ర కౌన్సెలింగ్‌ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోని ఐసీటీ కేంద్రాల్లో రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. జిల్లాలో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి, సత్తుపల్లి, మధిర సీహెచ్‌సీల్లో, భద్రాద్రి జిల్లాలో 6 కేంద్రాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. అనుమానిత పరీక్షలు చేయించుకునే వ్యక్తులకు, గర్భిణులకు ఇక్కడ పరీక్షలు చేస్తూ సలహాలు సూచనలు అందచేస్తారు. ఎయిడ్స్‌ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఈ ఏడాది ‘ఈక్విటేబుల్‌ యాక్సస్‌, ఎవ్రీవన్‌ వాయిస్‌’ నినాదంతో విస్తృత ప్రచారం చేపట్టాలని నిర్ణయించారు.

ఏఆర్‌టీ కేంద్రాల్లో చికిత్సలు

ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రితో పాటు మధిర, సత్తుపల్లి, భద్రాచలంలోని కేంద్రాల్లో బాధితులకు ప్రత్యేక వైద్యసేవలు అందిస్తున్నారు. మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. బాధితులకు ఇతర ఇన్ఫెక్షన్లు సోకినా పరీక్షించి చికిత్సలు అందించడం, ఏడాదికి ఒకసారి వైరల్‌లోడ్‌, ఆరునెలలకు సీడీ-4 పరీక్షలు వంటి సేవలను కొనసాగిస్తున్నారు. క్రమం తప్పకుండా మందులు వాడే వారికి ప్రభుత్వం నెలకు రూ.2000 పింఛన్లు ఇస్తున్నారు. ఖమ్మం ఆస్పత్రిలో సురక్ష క్లినిక్‌ను ఏర్పాటు చేసి సుఖవ్యాధులు సోకిన వారికి కౌన్సెలింగ్‌ చేస్తున్నారు.
స్వచ్ఛంద సంస్థల కృషి
జిల్లాలో ఎయిడ్స్‌ నియంత్రణకు స్వచ్ఛంద సంస్థలు శ్రమిస్తున్నాయి. జాగృతి సంస్థ ఫిమేల్‌ సెక్స్‌వర్కర్స్‌, స్వలింగ సంపర్కులు, ట్రాన్స్‌ జెండర్స్‌ ప్రవర్తనలో మార్పుకోసం పనిచేస్తుంది. జనవాణి సంస్థ వలస కార్మిక ప్రాంతాల్లో పనిచేస్తూ వారిలో మార్పునకు కృషి చేస్తోంది. సుఖవ్యాధులతో బాధపడే వారు పరీక్షలు చేయించుకొని నిర్ధారించుకునేలా ప్రోత్సహిస్తున్నాయి. భద్రాద్రి జిల్లాలో జాగృతి, సెక్యూర్‌ సంస్థలు పనిచేస్తున్నాయి.


ఎయిడ్స్‌ వ్యాప్తి నివారణకు చైతన్య కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నాం. భయం, అపోహలు తొలగించేందుకు అవగాహన శిబిరాలు చేపడుతున్నాం. రక్త నమూనా శిబిరాలు ఏర్పాటు చేసి నిర్ధారణ పరీక్షలు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాం. ఎలాంటి రక్షణ లేకుండా బయటి వ్యక్తులతో శృంగారంలో పాల్గొనడం ప్రమాదకరం. అనుమానం ఉన్న వారు తక్షణమే వైద్య పరీక్షలు చేయించుకుని వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నాం.

డాక్టర్‌ ప్రసాద్‌, ఎయిడ్స్‌, లెప్రసీ జిల్లా ప్రోగ్రామ్‌ అధికారి

Read latest Khammam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని