logo
Published : 01/12/2021 03:12 IST

సరిహద్దులో అప్రమత్తం

రేపటి నుంచి పీఎల్‌జీఏ వారోత్సవాలు
చర్ల, న్యూస్‌టుడే

దండ కారణ్యంలో మావోయిస్టుల సామగ్రిని వెలికి తీస్తున్న భద్రతా బలగాలు

పీఎల్‌జీఏ వారోత్సవాలకు గడువు సమీపిస్తుండటంతో సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మావోయిస్టు పార్టీ ‘ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం’(పీఎల్‌జీఏ) ఆవిర్భావ వారోత్సవాలను డిసెంబరు 2 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించనుంది. ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం-తూర్పుగోదావరి(బీకేటీజీ) ఏరియా కమిటీ కార్యదర్శి ఆజాద్‌ వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసు, భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌-ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులో ఉన్న మన్యం ప్రాంతంలో తనిఖీలను ముమ్మరం చేశారు.
పార్టీ బలోపేతానికి యత్నం
పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో ఉనికి చాటుకునేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మహారాష్ట్ర ఎన్‌కౌంటర్లో 26 మంది నక్సల్స్‌ మృతిచెందటం పార్టీకి తీరని నష్టాన్ని కలిగించింది. ఇంకోపక్క పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషన్‌ మరణంతో బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌కు పార్టీ తాత్కాలిక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. యుద్ధ తంత్రంలో ఆరితేరిన దామోదర్‌ నేతృత్వంలో సరిహద్దులో దాడులు జరుగుతాయని భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. తమ వేగుల సాయంతో ఇన్‌ఫార్మర్ల వ్యవస్థపై ప్రత్యేక గురిపెట్టిన మావోయిస్టులు నూతన పంథాలో సాగేందుకు వార్షికోత్సవాలను వేదికగా మార్చుకోనున్నారని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రజాయుద్ధంతో గెరిల్లా సైన్యాన్ని ఉరకలెత్తించేందుకు కేంద్ర కమిటీ ఇప్పటికే కింది స్థాయి కేడర్‌కు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది.
ఉక్కుపాదంతో...
కొద్దికాలంగా మావోయిస్టు పార్టీ కార్యకలాపాలపై పోలీసు బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. సరిహద్దు ప్రాంతంలో వారి కదలికలు తగ్గుముఖం పట్టాయి. రెండేళ్లుగా చెదురుమదురు ఘటనలు మినహా పరిస్థితి ప్రశాంతంగా ఉంది. పోలీసులు అరెస్టులు, లొంగుబాట్లు, ఎన్‌కౌంటర్లతో మావోలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. షెల్టర్‌ జోన్లలో బేస్‌క్యాంపులు ఏర్పాటు చేసి నిరంతరం కూంబింగ్‌ చేస్తున్నారు. ఒకప్పుడు సమాంతర పాలన చేసిన ప్రాంతాలను భద్రతా బలగాలు క్రమంగా తమ అధీనంలోకి తెచ్చుకుంటున్నారు. పూసుగుప్ప, ఎర్రంపాడు, కుర్నపల్లి అటవీ ప్రాంతాల్లో మావోలు అమర్చిన బూబీట్రూప్స్‌ను చాకచక్యంగా తొలగించారు. వారోత్సవాల నేపథ్యంలో డిసెంబరు 10 వరకు ఆర్టీసీ మధ్యాహ్నం నుంచి చర్ల, వెంకటాపురం, చింతూరు మార్గాల వైపు బస్సు సర్వీసులను రద్దు చేసింది. హిట్‌లిస్టులో ఉన్నవారిని, రాజకీయ నాయకులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా పోలీసులు ఆదేశించారు. అధికారులు మారుమూల గ్రామాలకు వెళ్లొద్దని సూచించారు. సరిహద్దు పోలీసుస్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడికక్కడ సీఆర్పీఎఫ్‌ బలగాలు పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున పోలీసు బలగాలు దండకారణ్యంలోకి ప్రవేశించాయి.

Read latest Khammam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని