logo
Updated : 01/12/2021 06:21 IST

నకిలీ ఆర్‌సీలతో యాజమాన్య మార్పిడి

భద్రాద్రి-కొత్తగూడెం కేంద్రంగా దందా

ఈనాడు, హైదరాబాద్‌: వాహనాలకు నకిలీ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్స్‌ (ఆర్‌సీ) సృష్టించి యాజమాన్య హక్కులు మార్చుతున్న ముఠాను సైబరాబాద్‌ ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్ట్‌ చేసింది. మంగళవారం సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర ఈ వివరాలు వెల్లడించారు. చాలామంది బ్యాంకులు/ఫైనాన్స్‌ సంస్థల వద్ద రుణం తీసుకుని ద్విచక్రవాహనాలు, కార్లు కొంటారు. సకాలంలో రుణం చెల్లించని వారి నుంచి ఆ సంస్థలు వాటిని స్వాధీనం చేసుకుని వేలం వేసి అమ్మేస్తుంటాయి. అసలు పత్రాల్లేకుండా యాజమాన్య హక్కులు మార్పించుకోవటం థర్డ్‌పార్టీకి కష్టంగా మారుతుంది. దీన్ని అవకాశంగా మలచుకుని అడ్డదారిలో సొమ్ము సంపాదించేందుకు చమన్‌ సతీష్‌, షేక్‌ జహంగీర్‌భాషా, కలిగీడి చంద్రశేఖర్‌, ఎం.గణేశ్‌, సయ్యద్‌ హుస్సేన్‌, సీహెచ్‌.రమేశ్‌, సంపత్‌ ముఠాగా ఏర్పడి నకిలీ ఆధార్‌ కార్డులు, రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్లను తయారు చేసి వాహన యజమానులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. దాదాపు 9 నెలలుగా చేరి దందా సాగిస్తున్నారు.   

ఎక్కడెక్కడివారో కలిసి..

చమన్‌ సతీష్‌ శంషాబాద్‌లోని రాళ్లగూడ నివాసి. నకిలీ ఆధార్‌, ఆర్‌సీ కార్డుల సృష్టికర్త. రాజేంద్రనగర్‌కు చెందిన ఎం.గణేశ్‌ అతడికి సహాయం చేసేవాడు. యూసుఫ్‌గూడకు చెందిన ఆర్టీఏ ఏజెంట్‌ జహంగీర్‌ బాషాకు పలు రవాణాశాఖ కార్యాలయాల్లో కొందరు అధికారులతో పరిచయాలున్నాయి. వాహన రిజిస్ట్రేషన్‌ లొసుగులపై అవగాహన ఉంది. సరైన పత్రాల్లేని వాహనాలకు అనుమతి పత్రాలు ఇప్పించటంలో సిద్ధహస్తుడు. కొత్తగూడెంలోని ఆర్టీఏ ఏజెంట్‌ సంపత్‌ ఇతడికి అవసరమైన ఆర్‌సీ కార్డులను సమకూర్చేవాడు.

రవాణాశాఖ కార్యాలయాల్లో చోరీ

కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌ జరగ్గానే రవాణాశాఖ వాటి యజమానులకు కొరియర్‌ ద్వారా ఆర్‌సీ కార్డులను పంపుతుంది. వివిధ కారణాల వల్ల యజమానులకు చేరని కార్డులు వెనక్కు వచ్చేస్తుంటాయి. దీన్ని గమనించిన సంపత్‌ తనకున్న పరిచయాలతో కొత్తగూడెం, భద్రాద్రిలోని రవాణాశాఖ కార్యాలయాల నుంచి రోజూ 2-3 ఆర్‌సీ కార్డులను దొంగిలించేవాడు. ఒక్కోదాన్ని బాషాకు రూ.200-300కు విక్రయించేవాడు. ఇతడు సతీష్‌కు అమ్మేవాడు. కిషన్‌బాగ్‌కు చెందిన ఆర్‌టీఏ సయ్యద్‌ హుస్సేన్‌ కూడా రవాణా కార్యాలయానికి తిరిగి వచ్చిన ఆర్‌సీ కార్డులను చోరీ చేసేవాడు. వీటిని వేలంలో వాహనాలను కొనే మియాపూర్‌కు చెందిన సీహెచ్‌.రమేష్‌కు విక్రయించేవాడు.

పాత పేర్లు చెరిపేసి

డీటీపీ ఆపరేటర్లుగా అనుభవం ఉన్న ఎం.గణేశ్‌ ఆర్‌సీ కార్డులపై ఉన్న పేర్లు, నంబర్లు, చిరునామాను చెరిపేసి కొత్త పేర్లను రాసేవాడు. వాటితోపాటు యాజమాన్య బదిలీకి అవసరమైన ఆధార్‌కార్డులను తయారు చేసి.. రూ.1000-1200 వరకూ విక్రయించేవారు. 9 నెలల వ్యవధిలో సుమారు 1000 నకిలీ ఆర్‌సీ కార్డుల ద్వారా వాహనాల యాజమాన్య బదిలీ చేయించినట్టు గుర్తించామని ఎస్‌వోటీ డీసీపీ సుదీప్‌ తెలిపారు. ముఠా వద్ద నుంచి 900 నకిలీ ఆర్‌సీలు, ఖాళీ ఆర్‌సీ కార్డులు 3000 స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఆరుగురిని రిమాండ్‌చేయగా సంపత్‌ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు.

Read latest Khammam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని