logo
Updated : 01/12/2021 06:26 IST

అయినవాడే అందరికీ.. ఇక అందడు ఎప్పటికీ..      

సినీవినీలాకాశంలో సిరివెన్నెల అక్షర విరిజల్లులు కురిపించి పాటలతో నవరసాలు పండించిన అభ్యుదయ రచయిత.. సిరివెన్నెల సీతారామశాస్త్రికి ఉమ్మడి ఖమ్మం జిల్లాతో ఎనలేని అనుబంధం ఉంది. తెలుగు భాషా అభ్యున్నతి కోసం ఖమ్మంలో జరిగిన పలు కార్యక్రమాలకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. జిల్లాలోని పలువురు కవులతో సత్సంబంధాలు కలిగి వారి రాసే కవితలు, రచనలను ఎంతో ప్రోత్సహించేవారన్న పేరుంది. ఆయన లేరని తెలిసి విషాదంలో మునిగిపోయారు..

ఖమ్మం సాంస్కృతికం, కొత్తగూడెం సాంస్కృతికం, న్యూస్‌టుడే

‘కొడవలిలా ఉంటూ కుత్తుక కోస్తూ వెంటాడేదే ప్రశ్న’ అంటారు సిరివెన్నెల.. పాటల్లో ఆ ప్రశ్నించే తత్వమే ప్రేక్షకుల్ని పరవశించేలా చేసింది. ‘ఆదిభిక్షువు వాడినేమి అడిగేది.. బూడిదిచ్చేవాడినేమి కోరేది’ అని అడిగినా అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా? స్వర్ణోత్సవాలు చేద్దామా అని ప్రశ్నించినా సిరివెన్నెలకే చెందింది.

‘ఎల్లలు లేని తెలుగు’ కార్యక్రమంలో సిరివెన్నెలను సత్కరిస్తున్న నాటి తానా బాధ్యులు

తాతా మధు, జంపాల వి చౌదరి, మువ్వా తదితరులు


‘చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా.. చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా..’ అంటూ సీతారామునిలోని హేతువాదతత్వం, ఛాందసత్వాన్ని ఖండిస్తూ మార్గదర్శనం చూపితే, ‘విధాత తలపున ప్రభవించినది అనాథ జీవన వేదం’ అంటూ ఆధ్యాత్మిక భావనకు పట్టంగట్టారు.


రామయ్య సన్నిధిలో సీతారాముడు

భద్రాచలం, న్యూస్‌టుడే: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి భద్రాచలంతో విడదీయలేని అనుబంధం ఉంది. ఈయన మరణాన్ని ఇక్కడి వారు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో ఒకసారి దైవ దర్శనానికి ఇక్కడకు వచ్చారు. ఎంతో భక్తితో సీతారాముణ్ని దర్శించుకుని పూజలు చేశారు.

* 2015లో తానా ఆధ్వర్యంలో తెలుగు భాషా సాహిత్య సాంస్కృతిక ప్రచారం కోసం నగరంలోని సీక్వెల్‌ రిసార్ట్స్‌లో ‘ఎల్లలు లేని తెలుగు’ పేరిట జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై తనదైన శైలిలో మాట్లాడి సభికులను మంత్రముగ్ధులను చేశారు. అక్కడే ‘భ్రమల్లేని భావకుడు’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.

* 2017లో భక్తరామదాసు కళాక్షేత్రంలో జరిగిన మువ్వా రంగయ్య, పద్మావతి అవార్డుల ప్రదానోత్సవం సభకు హాజరయ్యారు. ప్రముఖకవి దిగంబర ‘నగ్నముని’కి శాస్త్రి చేతుల మీదుగా అవార్డు అందజేశారు.

* 2018లో తెలుగు భాషను విద్యార్థులకు చేరువ చేయాలనే ఉద్ధేశంతో మమతా వైద్య కళాశాల ఆడిటోరియంలో జరిగిన కార్యశాలకు హాజరై మాతృభాష మాధుర్యంపై చేసిన ప్రసంగం ఆకట్టుకుంది.

*జిల్లాకు చెందిన రచయిత మువ్వా శ్రీనివాసరావు 2021లో రాసిన ‘వైరాయణం’ పుస్తకాన్ని జూమ్‌ యాప్‌లో ఆవిష్కరించారు. బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం ఆన్‌లైన్‌ వేదికగా ఖమ్మం కేంద్రంగా జరిగిన కార్యక్రమంలో ప్రధాన వక్తగా ప్రసంగించారు.


ముందుమాట రాయడం అదృష్టం
- మువ్వా శ్రీనివాసరావు, రచయిత

తెలుగు పాటకు తన ప్రతిభా పాటవాలతో సాహిత్య గౌరవం ఇచ్చిన గొప్ప రచయిత. నాతో ఆయన సోదరభావంతో మెలిగేవారు. నేను రాసిన కవితలు, రచనలపై ఎప్పుడూ ఆయనతో చర్చించేవాడిని.  నేను రాసిన ‘వైరాయణం’ పుస్తకానికి సిరివెన్నెల ముందుమాట రాయడం నా అదృష్టంగా భావిస్తున్నా. సాహిత్య ప్రపంచానికి ఆయన లేని లోటు తీరనిది.


తరగని వెన్నెల..
- వురిమళ్ల సునంద, కవి, ఉపాధ్యాయురాలు

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సిరివెన్నెల సీతారామశాస్త్రిని తరగని సాహితి వెన్నెలగా భావించవచ్చు. తన సాహిత్యంతో తెలుగు భాషా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి. ఆయన రాసిన పాటలు అన్ని తరాల వారిని ఆకర్షించేలా ఉంటాయి. ప్రేమ కావ్యాలతో పాటు సామాజిక చైతన్యం పురిగొలిపేలా గుర్తుండిపోతాయి. సీతారాముల కల్యాణాన్ని తెలిపేలా ఆయన మురారి సినిమాలో రాసిన ‘అలనాటి రామచంద్రుడికి అన్నింట సాటి..’ అనే పాట ప్రతి వివాహ వేడుకలో విన్పిస్తుంది.


‘సిరివెన్నెల’ మృతి సాహితి లోకానికి లోటు
 మంత్రి అజయ్‌, ఎంపీ నామా సంతాపం

ఖమ్మం నగరపాలకం, న్యూస్‌టుడే: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి సాహితీలోకానికి, చలనచిత్ర పరిశ్రమకు లోటని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఖమ్మం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు మంగళవారం వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. తొలిచిత్రం ‘సిరివెన్నెల’లో తాను రాసిన పాటలకు ఎనలేని గుర్తింపు లభించిందని, ఆ సినిమానే తన ఇంటిపేరుగా మార్చుకున్న ఘనత సీతారామశాస్త్రికే దక్కిందన్నారు. మూడున్నర దశాబ్దాల పాటు మూడువేలకు పైగా పాటలురాసిన శాస్త్రికి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.


అపురూప కవి
- అట్లూరి వెంకటరమణ, ప్రముఖ కవి

తెలుగు పాటను కావ్య స్థాయికి పెంచిన సీతారామశాస్త్రి అపురూప కవిగా నిలిచారు. చలనచిత్ర పరిశ్రమ గొప్ప రచయితను కోల్పోవడం బాధాకరం. ఆయన మరణంతో పాట మూగబోయింది. అక్షరం కన్నీరు పెట్టింది. సిరివెన్నెల అక్షరశైలి, భావుకత, పాటల నిర్మాణం ఎంతగానో ఆకర్షించాయి. నన్ను సాహిత్యం వైపు వెళ్లేలా ప్రోత్సహించడంలో శాస్త్రి ప్రభావం మరువలేనిది. ఆయనతో కలిసి వేదికలను పంచుకోవడం జీవితంలో మరిచిపోలేను.


ప్రజల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు.. కటకోఝ్వుల రమేశ్‌: జిల్లా సాహితి సంఘం ప్రధాన కార్యదర్శి

అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వాత్రంత్యమందామా.. అంటూ చివరి నిమిషం వరకు తెలుగు సాహిత్యానికి, ఉదాత్తమైన ఆలోచన సరళికి రచనల్లో ప్రాధాన్యతను ఇచ్చిన గొప్ప గేయరచయిత. తన సాంగత్యంతో సినీపాటలకు ఎంతో గౌరవాన్ని అందించారు. రచనలతో యువతలో చైతన్యాన్ని కలిగించిన ఆయన ఇక లేరనే విషయం బాధాకరమే. అయినప్పటికీ ఎన్నో వేలపాటల రూపంలో ఆయన ఎప్పటికీ ప్రజల్లో నిలిచి ఉంటారు.


వనాలను వరించిన వసంతం... సీర ప్రసన్న, కవి, తెలుగు భాషోపాధ్యాయురాలు, సింగరేణి పాఠశాల, కొత్తగూడెం

కలం కాగితంతో ఆయన చేసిన అక్షర తపస్సు తెలుగు సాహిత్యంలో ఒక నూతన అధ్యాయం. పసిడి పతకాల హారం విజయతీరం కాదని ఆటనే మాటకు అర్థం నిను నువ్వే గెలుచు యుద్ధమే అని స్ఫూర్తినిచ్చినా, తరలిరాని వనాలను వరించిన వసంతం. సిగ్గులేని సమాజాన్ని నిగ్గదీసి అడిగిన స్వరం. జగమంత కుటుంబంలో ఏకాకి జీవితం అంటూ ఎన్నో హృదయాలను తట్టిలేపిన సినీ సాహితీ సారస్వతం తెలుగు సాహితి జగాన సిరివెన్నెల కలం అమరం అజరామరం.


 

Read latest Khammam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని