logo

ఖాళీ కడుపులు.. చెవికెక్కని పాఠాలు

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నిలిచిపోయింది. శ్రమకు తగ్గ ప్రతిఫలం లేదని నిర్వాహకులు నిరవధిక సమ్మెకు దిగారు. డిమాండ్లు పరిష్కరించే వరకు పొయ్యి వెలిగించేదిలేదని జిల్లా విద్యాశాఖకు నోటీసులు అందించారు.

Published : 07 Dec 2021 06:31 IST

పాఠశాలల్లో నిలిచిన మధ్యాహ్న భోజనం

పెద్దపల్లి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నిలిచిపోయింది. శ్రమకు తగ్గ ప్రతిఫలం లేదని నిర్వాహకులు నిరవధిక సమ్మెకు దిగారు. డిమాండ్లు పరిష్కరించే వరకు పొయ్యి వెలిగించేదిలేదని జిల్లా విద్యాశాఖకు నోటీసులు అందించారు. గడచిన ఆరు రోజులుగా పాఠశాలలో పొయ్యి వెలగడంలేదు. దీంతో విద్యార్థులు ఆర్ధాకలితో పాఠాలు వింటున్నారు. విద్యాశాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికీ వంట పాత్రల సమస్య ఎదురైంది. ఫలితంగా విద్యార్థులు ఇంటినుంచే భోజనాన్ని తెచ్చుకుంటున్నారు. సోమవారం జిల్లాలోని పలు పాఠశాలల్లో ‘న్యూస్‌టుడే’ పరిశీలించింది. స్థానిక విద్యార్థులు ఇంటికి వెళుతుండగా దూర ప్రాంత విద్యార్థులు ఖాళీ కడుపుతోనే పాఠాలు వినే పరిస్థితి నెలకొంది. విద్యాశాఖ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకుంటే బోధనపై ప్రభావం చూపనుందని ఉపాధ్యాయులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా తమకు గౌరవ వేతనాన్ని రూ.11,700కు పెంచాలని, ప్రతి పాఠశాలకు ఉచిత గ్యాస్‌ కనెక్షన్‌, మార్కెట్‌లో కోడిగుడ్డు ధర రూ.6 వరకు పలుకుతుండగా రూ.4 చెల్లించడంతో ఆర్థిక భారం పడుతుందని...ప్రభుత్వమే కోడిగుడ్లు సరఫరా చేయాలని, వంట పాత్రలు కొనుగోలు సమస్యలు పరిష్కరించాలని మధ్యాహ్న భోజన నిర్వాహకులు సమ్మె ప్రకటించారు.

పాఠశాలల్లో వెలగని పొయ్యి

జిల్లాలో 358 ప్రాథమిక, 83 ప్రాథమికోన్నత, 101 ఉన్నత, 7 ఆదర్శ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. రోజువారిగా సుమారు 35 వేలకు పైగా విద్యార్థులు భోజనాన్ని తింటున్నారు. మార్కెట్‌లో రోజు రోజుకూ విపరీతంగా కూరగాయల ధరలు పెరగడంతో నష్టాలు చవిచూస్తున్నామని నిర్వాహకులు అంటున్నారు. నిర్వాహకులు వంట గదికి తాళంవేడయంతో పాత్రలు అందుబాటులో లేవని ప్రత్యామ్నాయ నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు.

ఇంటి నుంచే భోజనం

పెద్దపల్లి మండలం అప్పన్నపేట జడ్పీ పాఠశాలకు బంధంపల్లి, అందుగులపల్లి, దేవునిపల్లి, క్రషర్‌నగర్‌, బ్రహ్మణపల్లి, రాగినేడు, కనగర్తి, కాసులపల్లి, భొంపెల్లి గ్రామాల నుంచి వస్తున్నారు. ఇక్కడ 260 మంది విద్యార్థులు చదువుతున్నారు. వంట చేయకపోవడంతో ఇంటినుంచే తీసుకొస్తున్నారు. స్థానిక విద్యార్థులు ఇళ్లలోకి వెళ్లి భోజనం చేసి వస్తున్నారు.


ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం

- మాధవి, జిల్లా విద్యాధికారి

నిర్వాహకుల సమ్మె విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. పాఠశాలల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ప్రధానోపాధ్యాయులకు సూచించాం. వంటపాత్రల సమస్య ఉంది. కొందరు పిల్లలు ఇంటినుంచి తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.


సారూ.. ఇంటికెళ్లొస్తాం

పాఠశాలలో ఇంటికి పంపించమని ప్రాధేయపడుతున్న చిన్నారులు

మంథని గ్రామీణం, న్యూస్‌టుడే: మంథని బాలికల పాఠశాలలో మంథని, ముత్తారం మండలాల్లో పది గ్రామాల నుంచి ప్రవేశాలు తీసుకుంటున్నారు. 320 మంది చదువుతుండగా ఎక్కువ మంది దూరప్రాంతాల వారే ఉన్నారు. మధ్యాహ్నం వేళలో భోజనాన్ని తీసుకురాలేదని, ఇంటికి పంపించమని విద్యార్థులు ఉపాధ్యాయున్ని ప్రాథేయపడుతున్నారు. తల్లిదండ్రుల అనుమతి ఉంటేనే ఇంటికి పంపిస్తామని ఉపాధ్యాయులు అంగీకరించడంలేదు.


ఇంటి బువ్వే దిక్కు

ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న వంట మనుషులకు ప్రభుత్వం నుంచి సరైన బిల్లులు మంజూరు కాకపోవడంతో సమ్మె బాట పట్టారు. దీంతో రామగుండం నియోజకవర్గంలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం లేకుండా పోయింది. దీంతో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఇంటి వద్ద నుంచే మధ్యాహ్న భోజనం వెంట తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. గోదావరిఖని ప్రభుత్వ జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు సోమవారం పాఠశాలకు 336 మంది హాజరయ్యారు. అందరూ టిఫిన్‌ బాక్సులో అన్నం వెంట తీసుకుని ఇలా ఒకే చోట కూర్చొని తింటున్నారు.

-న్యూస్‌టుడే, మార్కండేయకాలనీ


అంతా అయోమయం

సుల్తానాబాద్‌లో భోజనాన్ని వడ్డిస్తున్న ప్రత్యామ్నాయ నిర్వాహకులు

సుల్తానాబాద్‌, న్యూస్‌టుడే: సుల్తానాబాద్‌ ఉన్నత పాఠశాలలో సమీప గ్రామాల నుంచి విద్యార్థులు చదువుకుంటున్నారు. గత మూడు రోజులుగా వంట నిర్వాహకులు సమ్మె చేయడంతో పాఠశాలల్లో అసలు భోజనం పెడతారో లేదోనని విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. పాఠశాలల్లో భోజనం వండేవారు కరవయ్యారు. విద్యార్థులే ఇంటినుంచి భోజనం తెచ్చుకుంటున్నారు. సదుపాయం లేనివారు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని