logo

సొంతింటి కల నెరవేరేదెప్పుడో..

ఆధ్యాత్మిక క్షేత్రమైన వేములవాడలో వివిధ ప్రాంతాల నుంచి పేద కుటుంబాలు వేలల్లో వలస వస్తుంటాయి. వీరు చాలా వరకు అద్దె ఇళ్లలో ఉంటూ కుటుంబాలను పోషించుకుంటారు. ఇలాంటి ఇళ్లు లేని నిరుపేద కుటుంబాలు

Published : 07 Dec 2021 06:22 IST

పడకేసిన రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం పనులు


నిర్మాణంలో ఉన్న రెండు పడక గదుల ఇళ్లు

వేములవాడ గ్రామీణం, న్యూస్‌టుడే: ఆధ్యాత్మిక క్షేత్రమైన వేములవాడలో వివిధ ప్రాంతాల నుంచి పేద కుటుంబాలు వేలల్లో వలస వస్తుంటాయి. వీరు చాలా వరకు అద్దె ఇళ్లలో ఉంటూ కుటుంబాలను పోషించుకుంటారు. ఇలాంటి ఇళ్లు లేని నిరుపేద కుటుంబాలు ఓ సొంతిళ్లు కోసం కలలు కంటుంటారు. ఆ కలను సాకారం చేసేందుకు ప్రభుత్వమే ముందుకు వచ్చి ఇళ్లు లేని నిరుపేద కుటుంబాలకు రెండు పడకగదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సంకల్పించింది. వేములవాడ పట్టణంలో సొంతిళ్లు లేని వారి కోసం 800 డబుల్‌బెడ్‌ రూం ఇళ్లను మంజూరు చేసింది. దీంతో తమ సొంతింటి కల నేరవేరుతుందని చాలా మంది నిరుపేదలు ఆశలు పెట్టుకున్నప్పటికీ అధికారులు, గుత్తేదార్ల అలసత్వం కారణంగా ఇది ఇప్పట్లో సాకారం అయ్యేట్లు కనిపించడం లేదు. వేములవాడ పట్టణంలో దాదాపు అయిదు వేలకు పైగా ఇళ్లులేని నిరుపేద కుటుంబాలున్నాయని అధికారులు ఆరేళ్ల క్రితం గుర్తించారు. మొదటివిడతలో వేములవాడ పట్టణానికి ప్రభుత్వం 800 ఇళ్లను మంజూరు చేసింది. ఈ ఇళ్ల నిర్మాణాలకు ఒకే ప్రాంతంలో ప్రభుత్వ స్థలం అందుబాటులో లేకపోవడంతో సమస్యగా మారింది. ఆర్టీసీ బస్‌డిపో ప్రాంతంలో చింతల్‌ఠాణ కాలనీ వద్ద ప్రభుత్వ భూమిలో 144 ఇళ్ల నిర్మాణాలకు మూడేళ్ల క్రితం శ్రీకారం చుట్టారు. మారుపాక రోడ్డులోని ప్రభుత్వ భూమిలో 84 ఇళ్లు నిర్మాణం చేసేందుకు రంగం సిద్ధం చేసినప్పటికి స్థలం వివాదస్పదం కావడంలో అక్కడ పనులు మొదలు కాలేదు. కేవలం 144 ఇళ్ల నిర్మాణం పనులు మొదలు పెట్టారు.. జీప్లస్‌టూ పద్ధతిలో ఒక్కొక్క బ్లాక్‌లో 12 ఇళ్లు ఉండే విధంగా ఈ ఇళ్ల నిర్మాణం పనులు చేపట్టారు.

పట్టించుకోని అధికారులు

రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం ఈ ఏడాది సెప్టెంబరు వరకు పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ ఇంకా వివిధ దశల్లోనే ఇళ్ల నిర్మాణం మూలుగుతోంది. కొంతకాలంగా పనులు ముందుకు సాగిన దాఖలాలు లేవు. వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు నీరు నిల్చి పనులు ముందుకు సాగలేదు. కొన్ని బ్లాక్‌ల్లోని ఫ్లోరింగ్‌ మొత్తం గజానికి పైగా లోతుకు కుంగిపోయింది. అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉరడటంతో గుత్తేదారు పనుల్లో నాణ్యత పాటించడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇళ్ల నిర్మాణం సైతం ప్రధాన రోడ్డుకు సమాంతరంగా ఉండటంతో భవిష్యత్తులో ఇళ్ల మధ్యలో నీరు నిలిచే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇటీవల వర్షాలకు నిర్మాణంలో ఉన్న ఇళ్ల ప్రాంతంలో మొత్తం నీరు నిల్చింది. ఇప్పటకీ నిర్మాణంలో ఉన్న కొన్ని బ్లాక్‌ల్లో పిల్లర్లు నీటిలోనే ఉన్నాయి. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాల పనులు రోడ్డు భవనాల శాఖ పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నిర్మాణం పనులు కొనసాగుతున్న 144 ఇళ్లు ఎప్పటికీ పూర్తవుతాయో తెలియని పరిస్థితి ఉంది. పట్టణంలో ఇప్పటికే చాలా మంది నిరుపేదలు తమకు రెండు పడకగదుల ఇళ్లు వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నారు. గతంలో అనేక సందర్భాల్లో రెండు పడకగదుల ఇళ్లు మంజూరు చేయాలని చాలా మంది నిరుపేదలు రెవెన్యూ అధికారులకు, మున్సిపల్‌ అధికారులకు వేలల్లో దరఖాస్తులు సమర్పించుకున్న వారు రెండు పడక గదుల ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. వారి కల ఎప్పుటికీ నెరవేరుతుందో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

పనులు మొదలు పెట్టేందుకు చర్యలు -సతీష్‌, ఏఈ, ఆర్‌అండ్‌బీ వేములవాడ

రెండు పడకగదుల ఇళ్లు నిర్మాణం చేసే ప్రాంతం నల్లరేగడి నేల కావడంతో భారీ వర్షాల కారణంగా పనులు సాగక నిలిచిపోయాయి. తిరిగి పనులు మొదలు పెట్టేందుకు చర్యలు తీసుకుంటాం. పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నాం. స్లాబ్‌ నిర్మాణం సమయంలో గదుల్లో సపోర్టు పైపుల కోసం వేసిన ఫ్లోరింగ్‌ ఇటీవల వర్షాలకు కుంగిపోయింది. దానికి ఫ్లోరింగ్‌కు సంబంధం లేదు. అందులో సిమెంట్‌ కంకరతో ఫ్లోరింగ్‌ చేయడం జరుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని