logo
Published : 07/12/2021 06:15 IST

బూడిద తరలింపు సాగేనా..!

దళారుల ప్రవేశంతో సమస్యలు

ఎన్టీపీసీలో బూడిద రవాణా (పాతచిత్రం)

ఈనాడు డిజిటల్‌, పెద్దపల్లి: ఎన్టీపీసీలో బొగ్గు వినియోగం తర్వాత వెలువడే బూడిదకు డిమాండ్‌ పెరిగింది. మరోవైపు బూడిద వినియోగించే పరిశ్రమలు కచ్చితంగా ఆన్‌లైన్‌లో ఈ-వేలంలో పాల్గొని తమ పేర్లు నమోదు చేసుకోవాలని కేంద్రం సూచించింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ, శక్తి వనరుల శాఖలు సంయుక్తంగా ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వుల మూలంగా చిన్నతరహా పరిశ్రమలకు బూడిద తరలింపు అవరోధంగా మారింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 400కు పైగా ఇటుకబట్టీలున్నాయి. వీటిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది జీవిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు సైతం రామగుండంలోని ఎన్టీపీసీలోని బూడిద అవసరమవుతుంది. కాగా ఈ బూడిదను ఆన్‌లైన్‌లో ఈ-వేలం పాట నిర్వహించి అత్యధిక ధర కోట్‌ అయిన తర్వాత ఆ ధరకే కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఆన్‌లైన్‌లో నోటిఫికేషన్‌ సైతం విడుదల చేసింది. కేవలం వారం రోజుల గడువు మాత్రమే ఇచ్చి వేలం ప్రక్రియ ముగిసినట్లు ప్రకటించింది. ఆన్‌లైన్‌లో వేలం గురించి ఇటుకబట్టీల నిర్వాహకులకు పూర్తిస్థాయిలో తెలియకపోవడంతో టెండర్లు వేయలేకపోయారు. ఇదే క్రమంలో బడావ్యాపారులు, దళారులు, రాజకీయ నాయకులు బినామీ పేర్లతో టెండర్లు దక్కించుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాము చెప్పిన ధరకే కొనుగోలు చేయాలని ఆంక్షలు విధిస్తుండంతో బట్టీల యజమానులకు భారంగా మారింది. ఒక్కోలారీ బూడిదకు గతంలో రూ.4వేలు చెల్లించేవారు. ప్రస్తుతం అదే బూడిదకు రూ.18వేల వరకు చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. ప్రస్తుతం ఒక్కో ఇటుక రూ.6కు హోల్‌సేల్‌గా లభిస్తుండగా వేలం పాట తర్వాత కొనుగోలు చేసిన బూడిదతో ఇటుకలు తయారు చేస్తే దాదాపు ఒక్కో ఇటుక రూ.15 వరకు పలికే అవకాశం ఉంది. దీంతో ప్రజలపై, భవన నిర్మాణ రంగంపై ఆర్థిక భారం పడనుంది. ఇదంతా ఎందుకు వచ్చిన తంటా అనుకుంటూ కొందరు ఇటుక బట్టీల నిర్వాహకులు తయారీని నిలిపివేసేందుకు సిద్ధమవుతున్నారు.

మూసివేత దిశగా ఇటుకబట్టీలు

ఎన్టీపీసీ నుంచి వచ్చే బూడిద తెలంగాణవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లోని ఇటుక బట్టీలకు తరలివెళుతోంది. దీని ద్వారా దాదాపు 6 లక్షల పైచిలుకు మందికి ఉపాధి దొరుకుతుంది. కాగా గత సెప్టెంబర్‌ నెలలో పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఉత్తర్వు ప్రకారం బూడిదను ఉచితంగా ఇవ్వవద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో అక్టోబర్‌ 29న ఎన్టీపీసీ నుంచి బూడిద కొనుగోలు చేసేందుకు ఔత్సాహికులు ఆన్‌లైన్‌లో వేలం పాటలో పాల్గొనాలని పేర్కొంది. ఈ వేలం పాటలో కొందరు రాజకీయ నాయకులు, దళారులు రంగప్రవేశం చేసి ఎక్కువ ధరకు బూడిద తరలింపు కాంట్రాక్టు దక్కించుకున్నారు. చెప్పిన ధరకే కొనుగోలు చేయాలని తమపై జులం ప్రదర్శిస్తున్నారని పలువురు చిన్నతరహా పరిశ్రమల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళారుల రంగప్రవేశం వల్ల టన్ను బూడిదకు రూ.404 ధర పలుకుతుంది. దీంతో ఇటుకబట్టీల యజమానులపై భారం పడుతుంది. దీనికి తోడు పెట్రోల్‌, డీజిల్‌, జీఎస్టీ, ఇతరత్రా రవాణా ఖర్చులు భరించలేని స్థితికి చేరుకోవడంతో కొన్ని బట్టీలు మూసివేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికైనా ఎన్టీపీసీ అధికారులు అనర్హులైన దళారులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

పోటీవల్లే ఈ దుస్థితి

ఎన్టీపీసీలో వెలువడే 40 లక్షల టన్నుల బూడిదకు టెండర్లు పిలవడంతో ఇటుకబట్టీల వ్యాపారులు, కొందరు దళారులు కలిసి 26లక్షల టన్నుల బూడిదకు రూ.404 చొప్పున టెండర్లు దక్కించుకున్నారు. ఎన్టీపీసీ అమ్ముకునే బూడిదకు సంవత్సరానికి దాదాపు రూ.165 కోట్ల ఆదాయం రానుంది. వీళ్లు టెండర్లు దక్కించుకున్నప్పటికీ వర్క్‌ ఆర్డర్‌ పొందకుండా జాప్యం చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వీరు అనుమతులు పొందితే సంవత్సరానికి ఎన్టీపీసీకి రూ.120 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇంత మొత్తంలో చెల్లించేందుకు సుముఖంగా లేకపోవడంతో టెండర్లు, దళారులు లేకుండా బూడిద సరఫరా చేసేలా ఎన్టీపీసీ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


పెరిగిన వినియోగం

రామగుండం ఎన్టీపీసీలో బొగ్గు వినియోగంతో ఏడాదికి 40లక్షల టన్నుల బూడిద వెలువడుతుంది. ఇందులో 20 లక్షల టన్నులు సింగరేణి సంస్థ, 15 లక్షల టన్నులు ఇటుక బట్టీ పరిశ్రమలు, 5 లక్షల టన్నులు ఇతరత్రా పరిశ్రమలకు సరఫరా అవుతుంది. ఈ బూడిద రెండు రకాలుగా వెలువడుతుంది. పొడిబూడిద(ఫ్లైయాష్‌)ను సిమెంట్‌ పరిశ్రమలకు ఉపయోగిస్తున్నారు. తడిబూడిద(బాటమ్‌ యాష్‌)ను ఇటుక బట్టీలకు వాడుతున్నారు. 1999 సంవత్సరంలో గోదావరి నది, వాగుల ఒడ్డున ఉన్న బంకమట్టితో ఇటుకలు తయారీ చేసేవారు. అపరిమితంగా జలాశయాల వద్ద బంకమట్టి తరలించుకుపోవడం వల్ల సారవంతమైన భూములు నిస్తేజంగా మారుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. మరోవైపు ఇదే సంవత్సరంలో పర్యావరణ మంత్రిత్వ శాఖ రామగుండం ఎన్టీపీసీకి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇటుక బట్టీలు ఇతరత్రా చిన్నతరహా పరిశ్రమలకు బాటమ్‌ యాష్‌ను మిక్స్‌ను ఉచితంగా ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో 2000 సంవత్సరం నుంచి ఇటుకల తయారీలో బంకమట్టి వినియోగం కంటే బాటమ్‌ యాష్‌ వినియోగం పెరిగింది.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని