logo

తల్లి హృదయంతల్లడిల్లుతోంది..

‘ఓ మానవ మృగం అభంశుభం తెలియని నా బిడ్డను అత్యంత దారుణంగా హతమార్చింది.. ఇదే సంఘటన ఓ సంపన్న కుటుంబంలో జరిగితే.. ఏ నాయకుని ఇంట్లో జరిగితే వారికి స్థానిక నాయకులు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలా ఎంతో మంది అండగా ఉండి

Published : 07 Dec 2021 06:15 IST


బిడ్డ ఫొటోను చూసి విలపిస్తున్న తల్లి లక్ష్మి

‘ఓ మానవ మృగం అభంశుభం తెలియని నా బిడ్డను అత్యంత దారుణంగా హతమార్చింది.. ఇదే సంఘటన ఓ సంపన్న కుటుంబంలో జరిగితే.. ఏ నాయకుని ఇంట్లో జరిగితే వారికి స్థానిక నాయకులు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలా ఎంతో మంది అండగా ఉండి వారింటికి వచ్చి పరామర్శించి ప్రభుత్వపరంగా ఆదుకుంటామని.. నిందితునికి కఠినశిక్ష పడేలా చూస్తామని భరోసా ఇచ్చేవారు. నేను సామాన్యురాలిని కదా.. నాలాంటి వారికి ఏ కష్టం వచ్చినా ఎవరు ఎందుకు వస్తారులే..? మాలాంటివారి బతుకులు ఇట్లానే ఉంటాయని నాకు అర్థమైంది..

- గత నెల 9న హత్యకు గురైన గొడుగు అంజలి తల్లి లక్ష్మి ఆవేదనతో అన్నమాటలివీ.

రామగిరి మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో గత నెల 9న గొడుగు అంజలిని చాట్ల రాజు అనే యువకుడు అత్యంత కిరాతకంగా 32 సార్లు కత్తితో పొడిచి హతమార్చిన సంఘటన విధితమే.. కుమార్తె మరణించి నెల రోజులు కావస్తున్నా అంజలి తల్లి ఆ విషాద సంఘటన నుంచి తేరుకోవడంలేదు. అంజలి పుట్టిన రెండేళ్లకే ఆమె తండ్రి కిష్టయ్య క్యాన్సర్‌తో మృతిచెందాడు. అప్పటి నుంచి లక్ష్మి తన కుమార్తెను కంటికి రెప్పలా చూసుకుంటోంది. ప్రభుత్వం ఇచ్చే వితంతు పింఛనుకు తోడుగా తాపీ మేస్త్రీల వద్ద కూలీ పనులకు వెళ్లగా వచ్చే సొమ్ముతో తన కుమార్తెను సాకుతూ వస్తోంది. పదేళ్లుగా పూరి గుడిసెలోనే ఉన్న తల్లీబిడ్డలు 2019లో పోగు చేసుకున్న డబ్బుతో చిన్నపాటి రేకుల షెడ్డు వేసుకున్నారు. ఈ ఇంటికి ఇంకా ప్లాస్టింగ్‌ పనులు పూర్తికాలేదు.. దీంతో గతేడాది కురిసిన వర్షాలకు ఇల్లు ఓ వైపు కూలడంతో మళ్లీ మరమ్మతులు చేసుకున్నారు. ఎంతో కష్టంతో ఇష్టంగా నిర్మించుకున్న తమ కళల సౌధంలో కన్నబిడ్డ అత్యంత కర్కశంగా హతమవ్వడంతో దేవుడా.. నీకేం పాపం చేశానంటూ బిడ్డ ఫొటోను పట్టుకొని లక్ష్మి బోరున విలపిస్తున్న తీరును చూసి స్థానికులు అయ్యో పాపం అంటున్నారు.

-న్యూస్‌టుడే, యైటింక్లయిన్‌కాలనీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు