logo

మోసాలను అరికట్టాలంటూ ధర్నా

అదనపు ధాన్యం పేరిట తీవ్రంగా నష్టపరుస్తున్నారంటూ రైతులు రోడ్డెక్కారు. సోమవారం కోరుట్ల మున్సిపల్‌ పరిధిలోని ఏఖీన్‌పూర్‌ ఎస్సారెస్పీ ప్రధాన కాలువ వంతెనపై ధర్నాకు దిగారు. ఏఖీన్‌పూర్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం

Published : 07 Dec 2021 06:15 IST


కథలాపూర్‌లో ధర్నా చేస్తున్న రైతులు

కోరుట్ల, న్యూస్‌టుడే: అదనపు ధాన్యం పేరిట తీవ్రంగా నష్టపరుస్తున్నారంటూ రైతులు రోడ్డెక్కారు. సోమవారం కోరుట్ల మున్సిపల్‌ పరిధిలోని ఏఖీన్‌పూర్‌ ఎస్సారెస్పీ ప్రధాన కాలువ వంతెనపై ధర్నాకు దిగారు. ఏఖీన్‌పూర్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో చుట్టు పక్కల గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నారు. రైస్‌మిల్లర్లు క్వింటాలుకు 6 కిలోల ధాన్యంను అదనంగా తూకం వేసి పంపిస్తేనే దించుకుంటామని తెలపడంతో నాలుగు రోజులుగా కేంద్రాల్లో కొనుగోళ్లు నిలిపివేశారు. అన్నదాతలు రోడ్డుపై బైఠాయించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్సై సతీష్‌ సంఘటన స్థలానికి చేరుకుని రైతులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయనప్పటికి రైతులు ఆందోళనను విరమించకుండా బైఠాయించారు. తహసీల్దార్‌ సత్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకుని అదనపు ధాన్యం తూకం వేయకుండా చర్యలు తీసుకుంటామని, రైస్‌మిల్లర్లు ఇబ్బందులకు గురి చేస్తే తన దృష్టికి తెస్తే కఠిన చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

కోరుట్లగ్రామీణం: కొనుగోలు కేంద్రాల్లో నాణ్యత చూసి తూకం వేసిన ధాన్యానికి మిల్లు యజమానులు కోతలు విధిస్తున్నారని కథలాపూర్‌లో సోమవారం రహదారిపై రైతులు ధర్నా చేపట్టారు. మండలంలోని భూషణ్‌రావుపేట గ్రామంలో సెర్ప్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన ధాన్యానికి రైసుమిల్లు యజమానులు క్వింటాలుకు ఏడు కిలోల తరుగు విధిస్తున్నారని తెలిపారు. 15 రోజులుగా ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయని కేంద్రంలో 5 వేలకు పైగా బస్తాలు ఉన్నా లారీలు లేక తీసుకెళ్లడం లేదన్నారు. తహసీల్దార్‌ రవీందర్‌ సమస్య పరిష్కారిస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. తహసీల్దార్‌ కొనుగోలు కేంద్రానికి వెళ్లి రైతులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు గడ్డం రాజేశ్వర్‌రెడ్డి, గడ్డం రాజారెడ్డి, గుగ్లోత్‌ రవినాయక్‌, బైర రాజేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని