logo
Published : 07/12/2021 05:58 IST

లక్ష్యం కోసం ఇదేం పద్ధతి?

టీకా వేసుకున్నట్లు తప్పుడు సంక్షిప్త సందేశాలతో గందరగోళం

ఈటీవీ, కరీంనగర్‌: కరోనా విజృంభణ కేవలం టీకాలతోనే అడ్డుకోగలుగుతామని వైద్యశాఖ సూచిస్తోంది. దీంతో ప్రతి ఒక్కరికి రెండు మోతాదుల్లో పూర్తి చేయాలని ఆయా జిల్లా కలెక్టర్లు వైద్యశాఖను ఆదేశించారు. అయితే టీకాల పంపిణీ చేపట్టకుండానే లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. దీంతో కేవలం మొదటి టీకా తీసుకున్న వారికి గడువు పూర్తి కాగానే రెండో మోతాదు టీకా తీసుకున్నట్లు సంక్షిప్త సందేశాలు వస్తుండటంతో గందరగోళం నెలకొంది. తాము టీకా తీసుకోలేదని సంక్షిప్త సందేశం పంపిన వారికి ఫోన్‌ చేయడంతో పర్వాలేదు ఇప్పుడు వచ్చి తీసుకొమ్మని సలహా ఇస్తుండటం సిబ్బంది నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా విరివిగా టీకాల పంపిణీ చేయాలని ఉన్నతాధికారులు పట్టణాలు గ్రామాల వారీగా విభజించి దిశానిర్దేశం చేశారు. ఇదే అదనుగా లక్ష్యానికి అనుగుణంగా టీకాల పంపిణీ జరగక పోవడంతో ఆయా టీకా కేంద్రాల్లోని సిబ్బంది ఓటర్‌ లిస్టు ప్రకారం రెండో మోతాదు కూడా ఇచ్చేశామని సంక్షిప్త సందేశాలు పంపించి చేతులు దులుపుకొంటున్నారు. తమకు సందేశం రావడంతోటే సమీపంలోని టీకా కేంద్రానికి వెళ్లి టీకాల గురించి ఆరా తీస్తుండటంతో అసలు వ్యవహారం వెలుగులోకి వస్తోంది.

ఓటర్‌ జాబితాతో రెండో మోతాదు నమోదు

కరోనా టీకాకోసం ఏదైనా ఒక గుర్తింపు కార్డుతో రావాలని వైద్యశాఖ ప్రకటించింది. అయితే చాలా వరకు ప్రజలు ఆధార్‌ కార్డు ఆధారంగా టీకాల నమోదుకు వెళుతున్నారు. రెండో మోతాదు విషయంలో మాత్రం ఓటరు జాబితా ముందు పెట్టుకొని నమోదు చేస్తున్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. వాస్తవానికి ఏదైనా కేంద్రానికి ఎన్ని టీకా వాయిల్స్‌ సరఫరా చేస్తున్నారో..ఆ లెక్కలన్నీ సాయంత్రానికి అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. ఒకవేళ రెండో టీకా ఇవ్వకపోయినా ఆన్‌లైన్‌లో తీసుకున్నట్లు నమోదు చేస్తే ఆ టీకాలకు సంబంధించిన వాయిల్స్‌ ఏ లెక్కలో చూపుతున్నారనే అంశం ప్రశ్నార్థకంగా మారింది.


టీకా తీసుకోక ముందే సందేశం

కిరణ్‌కుమార్‌,హౌజింగ్‌ బోర్డు కాలనీ

హౌజింగ్‌ బోర్డు కాలనీలోని టీకా కేంద్రంలో జులై7న కొవాగ్జిన్‌ మొదటి టీకా తీసుకున్నాను. ఆ తర్వాత రెండో మోతాదు తీసుకోవాల్సి ఉండగా ఎక్కడ తిరిగినా కొవాగ్జిన్‌ టీకా దొరకలేదు. నవంబర్‌ 11న రెండో డోసు తీసుకున్నారు. మీకు వ్యాక్సినేషన్‌ పూర్తి అయ్యిందంటూ సందేశం రావడంతో షాక్‌కు గురయ్యాను. వాస్తవానికి అప్పటికి నేను ఇంకా రెండో టీకా కోసం తిరుగుతున్నా వ్యాక్సిన్‌ మాత్రం వేయించుకోలేదు.


రెండో టీకా తీసుకోక ముందే వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌

కె.మౌనిక.,కరీంనగర్‌

ఆర్టీసీ డిస్పెన్సరీ టీకా కేంద్రంలో ఆగస్టు 23న మొదటి టీకా తీసుకున్నాను.రెండో మోతాదు టీకా తీసుకోవాల్సి ఉండగా డిసంబర్‌ మొదటి తేదీ రెండో టీకా తీసుకున్నట్లు సంక్షిప్త సందేశం వచ్చింది. సమీపంలోని టీకా కేంద్రానికి వెళ్లితే ఇప్పటికే రెండు టీకాలు పూర్తి అయ్యాయని సమాధానం ఇచ్చారు. తనకు సందేశం పంపించిన నంబర్‌కు ఫోన్‌ చేస్తే పర్వాలేదు..ఇప్పుడు వచ్చి తీసుకోవచ్చని సమాధానం చెప్పారు. నాలాగే చాలా మందికి ఇలాంటి సందేశం వచ్చిందని ఫిర్యాదు చేస్తున్నారు.


పొరపాటుగా సందేశాలు వచ్చి ఉంటాయి

డాక్టర్‌ జువేరియా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కరీంనగర్‌

ఇలాంటి సందేశాలు వస్తే సమీపంలోని టీకా కేంద్రానికి వెళ్లి సరిచేసుకోవాలి. టీకా ఇవ్వక పోయినా ఆన్‌లైన్‌లో నమోదు చేయడం తప్పు అలా చేస్తే చర్యలు తప్పవు. కొన్నిసార్లు ఒకే ఫోన్‌ నంబర్‌ను కుటుంబంలోని వారంతా నమోదు చేయిస్తే అలా జరిగి ఉండవచ్ఛు లేదా సమాచార లోపం వల్ల జరిగే అవకాశం ఉంది. లక్ష్యం పూర్తి చేసేందుకు ఇలాంటి చర్యలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటాం..

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని