logo
Published : 07/12/2021 05:58 IST

చేతులశుభ్రతకు నీళ్లు లేవు..

బడుల్లో అధ్వానంగా వసతులు
ఉమ్మడి జిల్లాలో కనిపించని మార్పు

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌: కాలం మారుతున్నా.. సర్కారు బడుల్లో ఇంకా పాత సమస్యల్నే విద్యార్థులు వల్లెవేయాల్సిన దుస్థితి నెలకొంటోంది. కరోనా విపత్తు తరువాత బడులు తెరుచుకున్నప్పటికీ ఇంకా మూత్రశాలలు, మరుగుదొడ్ల వినియోగంలో మాత్రం అనుకున్న విధంగా సౌకర్యాలు ఒనగూరడంలేదు. అన్నింటికన్నా ముఖ్యంగా విద్యార్థులకు నీటి వసతి సక్రమంగా అందడంలేదు. ప్రతి విద్యాసంవత్సరం ముందర ముందుగా వీటి గురించే ఆరా తీసే యంత్రాంగం సమస్యను శాశ్వతంగా దూరం చేయడంలో మాత్రం విఫలం చెందుతోంది. రాజ్యసభలో ఓ సభ్యుడు విద్యార్థుల అవస్థలపై అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి మంత్రి ప్రహ్లాద్‌సింగ్‌ సమాధానమిస్తూ ఆయా జిల్లాల వారీగా సౌలభ్యాల తీరుని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆ జాబితాలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని నాలుగు జిల్లాల పరిధిలోని గణాంకాలు విస్తుగొలిపేలా ఉండటం గమనార్హం.!

కనీస అవసరం కరవే..!

ఒంటికి ఇంటికి వెళ్లే పరిస్థితిని మార్చాలనేలా ఏళ్ల తరబడి చేస్తున్న ప్రయత్నాలు అంతంతమాత్రమే సత్ఫలితాల్నిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జగిత్యాల జిల్లాలో 784, కరీంనగర్‌ 644, పెద్దపల్లి 551, సిరిసిల్ల 479 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిలో కొన్నాళ్లుగా సౌకర్యాల కల్పనలో కొంచెం మార్పు కనిపించింది. ఉపాధిహామీ పథకంతోపాటు సమగ్రశిక్ష అభియాన్‌ నిధులతో మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణాలు జరిగాయి. ఒకటి రెండు చోట్ల మినహాయిస్తే అన్నిచోట్ల ఇవి అందుబాటులోకి వచ్చాయి. అత్యున్నత న్యాయస్థానం గతంలో ప్రతి సర్కారు బడికి కచ్చితంగా విద్యార్థుల సంఖ్యను బట్టి మూత్రశాలలు ఉండాలనే నిబంధనతో ఒకింత మార్పు కనిపించింది. గణనీయంగా అన్నిచోట్ల వీటి సంఖ్య పెరిగినప్పటికీ వీటికి అవసరమైన నీటి వసతి విషయంలో మాత్రం ఇప్పటికీ నిర్లక్ష్యమే అన్నిచోట్ల కనిపిస్తోంది. చాలాచోట్ల ఇంకా వీటి నిర్మాణాల అవసరం కనిపిస్తోంది. ప్రతి 40 మందికి ఒకటి ఉండాలనే చోట ఉమ్మడి జిల్లాలో ప్రతి 60 నుంచి 80 మందికి ఒకటి చొప్పున ఇవి అందుబాటులో ఉన్నాయి. ఈ సంఖ్య పెరగడంతోపాటు వసతి మెరుగవ్వాలనే ప్రతిపాదన ప్రతి విద్యాసంవత్సరంలో వినిపిస్తోంది.

చెప్పలేని తరహాలో తిప్పలు

నాలుగు జిల్లాల పరిధిలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. సరైన నీటి వసతి లేకపోవడంతో నిర్మించినవి నిరుపయోగంగానే ఉంటున్నాయి. దీంతో ఉన్న ఒకటిరెండింటిని కొన్ని చోట్ల ఉపాధ్యాయులే ఉపయోగించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. దీంతో విద్యార్థులు ఆరుబయటకు లేదా సమీపంలోని ఇళ్లకు వెళ్లాల్సిన దుస్థితి కొన్నిచోట్ల ఎదురవుతోంది. ముఖ్యంగా బాలికల పాఠశాల్లో ఈ సమస్య చాలామందిని ఇబ్బందుల్లో పడేస్తోంది. సౌకర్యాలు లేవనే సాకుతో సరైన విధంగా నీళ్లను తాగడం లేదు. దీంతో కొత్తరకమైన అనారోగ్య సమస్యను విద్యార్థులు కోరి తెచ్చుకుంటున్నారు. కరోనా విపత్తు ఇంకా పొంచి ఉన్న తరుణంలో చేతుల శుభ్రత అనివార్యంగా మారింది. చాలాచోట్ల ఎవరికి వారే విద్యార్థులు తాగునీటి సీసాలను తెచ్చుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నీటి సమస్య లేని బడులే దాదాపుగా 32శాతాన్ని దాటి ఉండటం బాధాకరమైన విషయం. ఈ తీరులో మార్పుని తీసుకొచ్చేలా.. నీటి వసతిని కల్పించేలా ప్రజాప్రతినిధులు, అధికారుల బాధ్యత మరింతగా పెరగాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని