logo

నీటి నిల్వ కేంద్రాల్లో ఇష్టారాజ్యం

 కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో తాగునీటిని సరఫరా చేసే సురక్షిత నీటి కేంద్రాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిరంతరంగా పర్యవేక్షణ చేయాల్సిన సిబ్బంది పట్టించుకోవడం లేదు. రాత్రింబవళ్లు నీటిని శుద్ధి చేసి పంపిస్తుండగా..

Published : 07 Dec 2021 05:48 IST
రిజర్వాయర్ల వారీగా పర్యవేక్షణ కరవు
ప్రైవేటు వ్యక్తులకు అడ్డాలు
జ్యోతినగర్‌ రిజర్వాయర్‌

న్యూస్‌టుడే-కరీంనగర్‌ కార్పొరేషన్‌: కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో తాగునీటిని సరఫరా చేసే సురక్షిత నీటి కేంద్రాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిరంతరంగా పర్యవేక్షణ చేయాల్సిన సిబ్బంది పట్టించుకోవడం లేదు. రాత్రింబవళ్లు నీటిని శుద్ధి చేసి పంపిస్తుండగా..ఆ శుద్ధినీరు వృథా చేయకుండా రిజర్వాయర్లు సకాలంలో నింపుకోవాల్సి ఉంటుంది. నీరు నిండిన తర్వాత పంపులు నిలిపి వేయాల్సి ఉండగా చూడకపోవడంతో మురుగుకాల్వల్లోకి ప్రవహిస్తోంది. పంపు ఆపరేటర్లు, లైన్‌మెన్లు, ఫిట్టర్లు, లీకేజీ కార్మికులు ఎవరికి వారే అన్నట్లుగా ఉండటం, ట్యాంకులు అప్పగించిన ఏఈలు కూడా కనిపించకుండా పోతుండటంతో నీటి విభాగం గాడి తప్పిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రక్షణ లేక అవస్థలు

తాగునీటి రిజర్వాయర్లు, నీటిశుద్ధి కేంద్రాలు నిషేధిత ప్రాంతాలు. ఆవరణలోకి ఇతరులకు ప్రవేశం ఉండదు.. నగరంలో నిబంధనలు అమలు కావడం లేదు. సిబ్బంది కూడా చూసి చూడనట్లుగా ఉంటున్నారు. కొన్ని రిజర్వాయర్ల దగ్గర అయితే బయట వ్యక్తులు వచ్చి అడ్డాలు పెట్టడం, అందులోనే పంచాయతీలు పెడుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో వాహనాలు పార్కింగ్‌ చేస్తున్నారు. రాత్రి వేళలో అసాంఘిక కార్య కలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కట్టడి చేయకపోవడంతో ఇతరులు నేరుగా లోపలికి వస్తున్నారు. ఇదిలా ఉండగా రెండు ప్రధాన రిజర్వాయర్లలో పని చేస్తున్న కొందరు కార్మికులు మద్యం మత్తులోనే విధులకు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి ఉన్నతాధికారులు మందలిస్తే కార్పొరేటర్ల దగ్గరికి పరుగులు పెట్టి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దాంతో అధికారులు సైతం పట్టనట్లు ఉంటున్నట్లు సమాచారం.

అడ్డగోలుగా నీటి తరలింపు

ప్రజావసరాలకు బల్దియా ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తుండగా, ఇందులోనే ప్రైవేటు ట్యాంకర్లు కలిసిపోయి అడ్డగోలుగా నీటిని తరలిస్తున్నారు. హరితహారంలో నాటిన మొక్కలకు క్లోరినేషన్‌ వాడకూడదని తెలిసినా నగరపాలికతో పాటు ఇతర ట్యాంకర్లు కూడా ఈ నీటినే చెట్లకు పోయడానికి తీసుకెళ్తున్నారు. ప్రైవేటు ట్యాంకర్‌ ఏ ఒక్కటీ కూడా ఉచితంగా నీటిని నింపుకొని తీసుకెళ్లడానికి వీల్లేదని అధికారులు చెబుతున్నా రాజకీయ ఒత్తిళ్లతో దర్జాగా ట్యాంకర్ల నీటిని ఉచితంగా తీసుకెళ్తున్నట్లు అక్కడికీ వచ్చే ట్యాంకర్లను పరిశీలిస్తేనే తెలుస్తోంది.


క్షేత్రస్థాయిలో అధికారి ఉన్నా..లేనట్లేనా?

నగరంలోని 16 రిజర్వాయర్లతో పాటు విలీన కాలనీల్లో ఉన్న రిజర్వాయర్లకు క్షేత్రస్థాయి అధికారి పర్యవేక్షణకు నియమించారు. కొందరికి రెండు, మూడు ట్యాంకులకు ఒక్కరిని నియమించారు. వీరంతా ప్రతిరోజు షిఫ్టుల వారీగా తనిఖీ చేయాల్సి ఉండగా కొందరైతే కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు లేకపోలేదు. ఆయా ట్యాంకుల వారీగా లీకేజీల పరిశీలన, తాగునీటి సరఫరా సమయసారిణి, కొత్త నల్లా కనెక్షన్లు, చేతిపంపుల మరమ్మతులు, విడిభాగాల భద్రత, తొలగించిన పాత వస్తువుల రికవరీ వంటివి ఎప్పటికప్పుడూ చూసుకోవాల్సి ఉంటుంది. కొందరు తప్ప మిగతా వారు ట్యాంకుల ఇన్‌ఛార్జులు ఉన్నా లేనట్లేనని స్వయంగా సిబ్బందే చెప్పడం గమనార్హం.


తనిఖీలు చేసేలా ఆదేశాలు - పి.వి.రామన్‌, ఈఈ, నగరపాలిక

నీటి ట్యాంకులు, ఫిల్టర్‌బెడ్‌ను నిరంతరం తనిఖీలు చేసేలా ఇంజినీరింగ్‌ అధికారులకు ఆదేశాలు ఇస్తాం. అర్ధరాత్రి కూడా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని