logo

వీధి కుక్కల మృతితో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌పై కేసు

పిల్లలు పుట్టకుండా శునకాలకు చేస్తున్న శస్త్రచికిత్సలు వికటించి.. 50 శాతానికిపైగా వీధి కుక్కలు మృత్యువాత పడ్డాయన్న ఫిర్యాదుతో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డి.ఎస్‌.లోకేష్‌కుమార్‌తో పాటు.....

Updated : 25 Jan 2022 02:46 IST

ఈనాడు, హైదరాబాద్‌: పిల్లలు పుట్టకుండా శునకాలకు చేస్తున్న శస్త్రచికిత్సలు వికటించి.. 50 శాతానికిపైగా వీధి కుక్కలు మృత్యువాత పడ్డాయన్న ఫిర్యాదుతో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డి.ఎస్‌.లోకేష్‌కుమార్‌తో పాటు మరో ముగ్గురిపై కుషాయిగూడ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. స్థానిక వలంటీరు శ్రావ్యనందిని, ఎర్త్‌ కోశంట్‌ అనే ఎన్జీవో సభ్యురాలు డా||శశికళ ఫిర్యాదుతో పోలీసులు వీరిపై కేసు నమోదు చేశారు. నగరంలో వీధి కుక్కలను పట్టుకుని, వాటికి పిల్లలు పుట్టకుండా శస్త్రచికిత్స చేసే ప్రక్రియపై గతంలో చాలా విమర్శలొచ్చాయి. దాంతో జీహెచ్‌ఎంసీ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. శస్త్రచికిత్సలు, రేబిస్‌ టీకాలు వేసే పనులను పలు జంతు సంరక్షణ, స్వచ్ఛంద సంస్థలకు అప్పగించింది. అందులో ఒకటైన పీపుల్స్‌ ఫర్‌ అనిమల్‌ (పీ ఎఫ్‌ ఏ) సంస్థ సైతం వీధి కుక్కల విషయంలో క్రూరంగా వ్యవహరిస్తోందని పోలీసులకు శ్రావ్యనందిని ఫిర్యాదు చేశారు. సైనిక్‌పురి, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆరోగ్యంగా తిరుగుతున్న శునకాలను ఎన్జీవో సభ్యులు తీసుకెళ్లారని, అందులో సగం చనిపోయాయని పేర్కొన్నారు. ఆమేరకు పోలీసులు కమిషనర్‌తో పాటు పీ ఎఫ్‌ ఏ నిర్వాహకురాలు వాసంతి వాడి, దత్తాత్రేయ, జీహెచ్‌ఎంసీకి చెందిన మరో అధికారి మంజీరసేన్‌ పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని