logo
Published : 03/12/2021 03:32 IST

సంకల్పమే దివ్య ఆయుధం!

వైకల్యాన్ని అధిగమించి ముందడుగు వేసి

ఈనాడు డిజిటల్‌, సిద్దిపేట, న్యూస్‌టుడే, మెదక్‌, సంగారెడ్డి టౌన్‌, వికారాబాద్‌ టౌన్‌

శరీరానికే వైకల్యం కానీ.. మనసుకు కాదు.
అంగవైకల్యం.. ఆలోచనలకు,  ప్రతిభకు ఎప్పుడూ అడ్డు కాదు.
మనిషిని చూడు.. మనిషిలోని అవిటితనాన్ని కాదు..

రీరంలో ఏ అవయవానికైనా.. చిన్నగాయమైతే తట్టుకోలేం. అలాంటిది పుట్టుకతోనో.. విధి వక్రీకరించో.. దివ్యమైన జీవితాల్లో శాశ్వత వైకల్యం వచ్చి చేరితే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది. కనీసం తమ పనులు చేసుకోలేని సందర్భాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఆ వైకల్యం.. లక్ష్యసాధనకు ఏ మాత్రం అడ్డుకాదని నిరూపిస్తున్నారు పలువురు దివ్యాంగులు. విధికి ఎదురేగి.. విజేతలుగా నిలుస్తూ తమలాంటి వారికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఉమ్మడి మెదక్‌, వికారాబాద్‌ జిల్లాలకు చెందిన ఎంతోమంది తమదైన బాటలో నడుస్తున్నారు. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వారి సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నాయి. నేడు ‘అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం’ సందర్భంగా పలువురు సాధించిన ఘనతపై ప్రత్యేక కథనం.


బృందంగా అడుగేసి..

ర్సాపూర్‌ పట్టణానికి చెందిన వర్షిత్‌, ప్రవీణ్‌కుమార్‌, సమద్‌ఖాన్‌, హరీశ్‌, ఫాతీమా బేగం వైకల్యంతో బాధపడుతున్నారు. చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలు పడుతూ ముందడుగు వేశారు. చదువుకునే సమయంలో ఎన్నో రకాలుగా అవమానాలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో వాళ్లంతా ఏడేళ్ల కిందట కలుసుకొని ఓ బృందంగా ఏర్పడ్డారు. మిల్కీ దివ్యాంగుల సంఘాన్ని ఏర్పాటుచేసుకున్నారు. ఈ ఐదుగురు మొదటి నుంచి నెలకు రూ.వేయి చొప్పున జమ చేసుకున్నారు. అలా జమయిన మొత్తంతో పాటు ఐకేపీ ద్వారా ఒకొక్కరూ వేర్వేరుగా రుణాలు పొంది చెప్పుల దుకాణం, ఆటో, డీసీఎం, కుట్టుమిషన్‌ ఇలా పలు వ్యాపారాల్లో అడుగుపెట్టారు. ఒక్కొక్కరూ ఒక్కో వ్యాపారం నిర్వహిస్తూ ఆదాయం గడిస్తున్నారు. ప్రతి నెలా రూ.15 వేల వరకు సంపాదిస్తూ.. కుటుంబానికి ఆర్థిక భరోసా అందిస్తున్నారు. తమలాంటి వారికి    ఆదర్శంగా నిలిచారు.

- న్యూస్‌టుడే, నర్సాపూర్‌


కలత చెందక..

దివ్యాంగులైనా, అన్ని అవయవాలు సరిగా ఉన్నవారైనా మనోధైర్యం కోల్పోకుండా నిశ్చింతగా జీవనాన్ని వెళ్లదీయొచ్చని ఈ వృద్ధుడిని చూసి నేర్చుకోవాల్సిందే. వెల్దుర్తి మండలం చెర్లపల్లి గ్రామానికి చెందిన కర్రోల్ల బిక్షపతి 20 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లోని లాలాగూడ వద్ద రైలు ఎక్కుతుండగా జారి రైలు కింద పడటంతో ఎడమ కాలును కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత దాతల సహకారంతో పైబర్‌తో తయారైన కాలుతోనే నడక ప్రారంభించారు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబానికి ఆసరాగా నిలిచారు. తాను వికలాంగుడినని ఏనాడు చింతించకుండా మనోధైర్యంతో అడుగేస్తుండటం గమనార్హం. లేచింది మొదలు సాయంత్రం వరకు ఏ ఓ పనిలో నిమగ్నమై కనిపిస్తారు. ఇతడి భార్య మైసమ్మ 8 ఏళ్ల క్రితమే మృతి చెందగా కుమారుడు శంకర్‌, కొడలు శేకమ్మ బాగోగులు చూసుకుంటున్నారు.

- న్యూస్‌టుడే, వెల్దుర్తి


ఒక్కటై కదిలారు..

మిరుదొడ్డి మండలం అందె గ్రామంలో పలువురు దివ్యాంగులు ఓ సంఘంగా ఏర్పడి.. అగరుబత్తీల తయారీ వ్యాపారం చేస్తూ ఆదర్శంగా నిలిచారు. సుకన్య, బాలమణి, తార, కుమార్‌, రాజశేఖర్‌, సాజిద్‌పాషా, రాజులు పుట్టుకతో దివ్యాంగులు. చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలు అనుభవించారు. వారంతా ఒక్కటై 2015లో రేణుక దివ్యాంగుల సంఘంగా ఏర్పడ్డారు. 2019లో మిరుదొడ్డిలోని దివ్యాంగుల పునరావాస కేంద్రంలో అగరుబత్తీల తయారీపై పది రోజుల పాటు శిక్షణ తీసుకున్నారు. రూ.2.50 లక్షల రుణం తీసుకొని సొంతూరిలోనే చిన్న పరిశ్రమ స్థాపించారు. మండలవ్యాప్తంగా ఉన్న మహిళాసంఘాల సభ్యులతో పాటు కిరాణాదుకాణాలలో విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నారు. రుణ వాయిదాలను పక్కాగా చెల్లిస్తున్నారు. కరోనా సమయంలో కొనిన ఒడిదొడుకులు ఎదురైనా మూడు నెలల క్రితం మళ్లీ ప్రారంభించారు. అగరుబత్తీల తయారీని యంత్రం ద్వారా చేస్తే.. వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లొచ్చనే ఉద్దేశంతో సంఘంలో మరో రూ.లక్ష వరకు రుణానికి దరఖాస్తు చేసుకున్నారు.

- న్యూస్‌టుడే, మిరుదొడ్డి


కుటుంబ భారాన్ని మోస్తూ..

నంగునూరు మండలం ఖాతా గ్రామానికి చెందిన కట్కూరి నర్సయ్య, కొమురవ్వలకు యాదగిరి, కమల ఇద్దరు సంతానం. పుట్టుకతోనే యాదగిరి దివ్యాంగుడు. 1985లో పదో తరగతి పూర్తయ్యాక ఏ పని చేద్దామన్నా వైకల్యం అడ్డుగా మారింది. తల్లిదండ్రులకు భారం కావొద్దన్న ఆలోచనతో 19 ఏళ్ల వయసులో హైదరాబాద్‌కు వెళ్లారు. అక్కడ ఏ పని దొరక్క యాచకుడిగా మారారు. కొంతకాలం తర్వాత నగరంలోని ఓ సైకిల్‌ మెకానిక్‌ దుకాణంలో పని కుదరగా.. నైపుణ్యం సాధించాక సొంత కాళ్ల మీద నిలబడాలన్న సంకల్పంతో ఊరి బాటపట్టాడు. మిత్రుల సహకారంతో సొంతంగా వ్యాపారం ఏర్పాటు చేయగా సరైన ఆదాయం రాలేదు. అదే సమయంలో తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యత తనపైనే పడింది. విషయం తెలుసుకున్న అప్పటి సిద్దిపేట ఎమ్మెల్యే, ప్రస్తుత సీఎం కేసీఆర్‌.. స్థానిక ఉన్నత పాఠశాలలో తాత్కాలిక స్వీపర్‌గా నియమించారు. ఆ సమయంలోనే మల్యాలకు చెందిన కమలతో పెళ్లి జరిగింది. ఓ వైపు విధులు నిర్వర్తిస్తూనే, తమకున్న మూడెకరాలను సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకున్నారు. తన ఇద్దరి కుమారులకు పెళ్లిళ్లు చేశారు. ఇటీవల సిద్దిపేట జిల్లా వికలాంగుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఎవరికి ఏ సమస్య వచ్చినా అండగా నిలుస్తున్నారు.


అండగా నిలుస్తూ..

సిద్దిపేటలోని శివాజీనగర్‌కు చెందిన బొంగోని శ్రీశైలం.. పుట్టిన ఏడాదికి పోలియో కారణంగా రెండు కాళ్లు పని చేయకుండా పోయాయి. తను ఐదో తరగతిలో ఉండగా తండ్రి మృతిచెందాడు. కష్టపడి ఇంటర్‌ పూర్తిచేశారు. ఈ తరుణంలో అమ్మ కూడా దూరమైంది. తల్లిదండ్రుల మృతి.. వైకల్యం ఆయన్ను మరిన్ని కష్టాల్లోకి నెట్టింది. అయినా ముగ్గురు సోదరుల సహకారంతో 2005లో బీఎడ్‌ పూర్తిచేశారు. 2006 నుంచి 2010 నంగునూరు మండలం అంక్షాపూర్‌ ప్రభుత్వ పాఠశాలలో విద్యా వాలంటీర్‌గా పని చేశారు. 2010 - 17 వరకు సిద్దిపేటలోని రెండు ప్రైవేటు కళాశాలల్లో క్లర్కుగా, ఆంగ్ల బోధకుడిగా పని చేశారు. అదే సమయంలో ఓవైపు బాలుర వసతిగృహాన్ని నిర్వహించారు. ఆ తర్వాత కర్రీ పాయింట్‌ పెట్టారు. 2020లో కరోనా రాకతో నష్టపోయారు. అయినా కుంగిపోకుండా అదే ఏడాది పుస్తక విక్రయ దుకాణాన్ని ఏర్పాటుచేసుకొని ముందడుగు వేశారు. మరోవైపు 2019లో 20 మంది సభ్యులతో దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి సంఘాన్ని ఏర్పాటుచేసి దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.

- న్యూస్‌టుడే, సిద్దిపేట టౌన్‌

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని