logo
Published : 03/12/2021 02:47 IST

వసతులకు దారిచ్చారు!

నిజాంపేట కార్పొరేషన్‌కు నాలుగెకరాల తెలుగు వర్సిటీ భూములు

బాచుపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయ భవనం

ఈనాడు, హైదరాబాద్‌: నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయాన్ని మేడ్చల్‌ జిల్లాలోని బాచుపల్లికి తరలించేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. బాచుపల్లి ప్రాంగణంలో అవసరమైన సదుపాయాల కల్పనపై అధికారులు దృష్టి సారించారు. నిజాంపేట కార్పొరేషన్‌తో సమన్వయం చేసుకుని అవసరమైన వసతులు కల్పించేందుకు నిర్ణయించారు. తెలుగు వర్సిటీ ఉపకులపతిగా టి.కిషన్‌రావు బాధ్యతలు చేపట్టాక బాచుపల్లికి వర్సిటీకి తరలించేందుకు కసరత్తు చేపట్టారు.

స్థలం ఇస్తే.. సౌకర్యాలు కల్పించేలా..
నిజాంపేట రోడ్డు నుంచి బాచుపల్లి వరకు 30 మీటర్ల వెడల్పుతో రహదారి నిర్మించాలని నిజాంపేట కార్పొరేషన్‌ నిర్ణయించింది. రెండు పడక గదుల ఇళ్ల సముదాయం, తెలుగు వర్సిటీ ప్రాంగణంలోంచి మార్గం నిర్మించాలి. ఇందుకు వర్సిటీకి చెందిన 4.56 ఎకరాల భూమిని రహదారికి కేటాయించాల్సి ఉంటుంది. దీనిపై గత ఆగస్టులోనే వర్సిటీ అధికారులు, రెవెన్యూ అధికారులు సమావేశమై చర్చించారు. ఈ మేరకు రహదారికి అవసరమైన భూమిని ఇస్తే.. వర్సిటీకి అవసరమైన వసతులు కల్పించేలా ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో వర్సిటీకి అవసరమైన సదుపాయాలను నిజాంపేట కార్పొరేషన్‌ తరఫున కేటాయించనున్నారు. రూ.60 లక్షలతో రహదారి నిర్మాణంతో తొలగించాల్సిన ప్రహరీని తిరిగి నిర్మించడం, వర్సిటీ ప్రవేశ ద్వారం, గేటు తిరిగి నిర్మించనున్నారు. రూ.1.20 కోట్లతో హాస్టళ్లను చేరుకునేందుకు సిమెంట్‌ రోడ్డు నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు, ప్రవేశ ద్వారం నుంచి ఫైన్‌ ఆర్ట్స్‌ భవనానికి రహదారి, డ్రైనేజీ నిర్మాణం చేయనున్నారు.

వచ్చే విద్యా సంవత్సరం నుంచే
ప్రస్తుతం రూసా నిధులతో బాచుపల్లిలోని వర్సిటీ భవనాలను ఆధునికీకరిస్తున్నారు. నెలాఖరు లేదా జనవరి చివరికి పనులు పూర్తి కానున్నాయి. అనంతరం నాంపల్లి నుంచి వర్సిటీని తరలించే అవకాశం ఉంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి బాచుపల్లిలో తరగతులు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నాంపల్లిలోని ప్రాంగణంలో కొత్త కోర్సులు తీసుకువచ్చి నిర్వహించేందుకు అధికారులు యోచన చేస్తున్నారు. థియేటర్‌ ఆర్ట్స్‌, డాన్స్‌, సంగీతం తదితర కోర్సులు ప్రవేశపెట్టాలనుకుంటున్నారు.

నీటి సమస్యకు పరిష్కారం
బాచుపల్లికి వెళ్లేందుకు నీటి సమస్య పెద్ద ఆటంకంగా మారింది. ఈ సమస్యకు పరిష్కారం లభించనుంది. నిజాంపేట కార్పొరేషన్‌ తరఫున యూనివర్సిటీ, హాస్టల్‌కు మున్సిపల్‌ నీటి కనెక్షన్‌ ఇవ్వనున్నారు. కార్పొరేషన్‌ తరఫున చేపట్టనున్న ఆయా పనులన్నీ వీలైనంత త్వరగా చేపట్టి పూర్తి చేస్తామని ఇటీవల మన్సిపల్‌ అధికారులు తెలుగు వర్సిటీకి లేఖ రాశారు.

బాలురు, బాలికలకు విడిగా వసతి
బాచుపల్లి ప్రాంగణంలో వినియోగంలో ఉన్న బాలుర హాస్టల్‌ను బాలికలకు కేటాయిస్తారు. ఇక్కడ 100 మంది ఉండేందుకు వీలుగా వసతి అందుబాటులోకి రానుంది. మరో భవనంలో బాలురకు వసతి కల్పించనున్నారు. 300 మంది ఉండేందుకు వీలుగా హాస్టల్‌ను నిర్మించారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని