logo
Published : 28/11/2021 03:38 IST

నీకు నువ్వే పోటీ..

అత్యున్నత స్థానాల్లో గ్రామీణులు

న్యూస్‌టుడే, అమరావతి ఫీచర్స్‌

ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌, ఘట్టమనేని కృష్ణ, బ్రహ్మానందం, కె.రాఘవేంద్రరావులతోపాటు నేటి తరంలో యువ దర్శకులు క్రిష్‌, బోయపాటి శ్రీనులది గ్రామీణ నేపథ్యమే. మారుమూల గ్రామాల నుంచి పట్టుదలతో ఉన్నతస్థితికి చేరుకున్నారు.

* నగర, పట్టణ ప్రాంత విద్యార్థులకంటే గ్రామీణ ప్రాంతం వారే శారీరకంగా.. మానసికంగా ఎంతో దృఢంగా ఉంటారని పలు పరిశోధనల్లో తేలింది.

* గత దశాబ్దకాలంగా సివిల్స్‌ ఫలితాల్ని చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో అతి సామాన్య కుటుంబాలకు చెందిన యువత అగ్రస్థానాల్లో నిలుస్తున్నారు.

నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థులు మొత్తం 6000
వారిలో గ్రామీణ ప్రాంత విద్యార్థులు 70% సుమారు


జీవితంపట్ల పరిపూర్ణమైన అవగాహనతో యువత జీవించాలి. చిన్నచిన్న కుంగుబాట్లు, ఆటుపోట్లు, గెలుపోటములు, పరిహాసాలు సహజ సామాన్యమైన అవాంతరాలు. ఒకవిధంగా చెప్పాలంటే అవి మన జీవితానికి పూలబాటలు. అలాంటివే నా జీవితాన్ని మంచివైపు.. అత్యున్నత లక్ష్యాల్ని చేరుకునేలా ముందుకు నడిపించాయి.

- ఏపీజే అబ్దుల్‌ కలాం, మిసైల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది ఇండియా.


కొత్త వాతావరణం.. ఆత్మన్యూనతాభావం.. ఉద్ధేశపూర్వకంగా కొందరు చూపించే చులకన భావాన్ని తట్టుకోలేక ట్రిపుల్‌ ఐటీతోపాటు ఇంటర్‌, డిగ్రీ, పీజీ చదువులకు ఎన్నో ఆశల్ని మోసుకుంటూ వెళ్తున్న గ్రామీణ విద్యార్థుల్లో కొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. రెండు జిల్లాల్లోని విద్యాసంస్థల్లో గడచిన కొన్ని సంవత్సరాలు విద్యార్థుల ఆత్మహత్యలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి.


గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని కుగ్రామాల నుంచి ఎంతోమంది దేశస్థాయిలో అత్యున్నత శిఖరాలు అధిరోహించారు. వారే నేటితరం విద్యార్థులకు స్ఫూర్తి, ప్రేరణగా ఉన్నారు. అలాంటి వారిలో కొందరు..

దేశ సర్వోన్నత న్యాయస్థానం ఛీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వీ రమణ కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామం నుంచి ఉన్నతస్థాయికి ఎదిగారు. ఎనిమిదో తరగతి వరకు తెలుగు మాధ్యమంలోనే చదివినట్లు ఆయన పలుమార్లు వెల్లడించారు. ఆ తరువాత ఆంగ్లంతోపాటు బహుభాషలపై పట్టు సాధించారు.

గుంటూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అజయ్‌కల్లం బాపట్ల మండలం నరసాయపాలెంకు చెందినవారు.

బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా కొంతకాలం వ్యవహరించిన క్రికెట్‌ క్రీడాకారుడు ఎంఎస్‌కే ప్రసాద్‌ మేడికొండూరుకు చెందినవారు. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం ప్రభుత్వ బడుల్లోనే సాగింది. చెస్‌లో అంతర్జాతీయంగా రాణించిన ద్రోణవల్లి హారికది గుంటూరు సమీపంలోని గోరంట్ల.

బాపట్ల సమీపంలోని స్టూవర్టుపురం గ్రామం నుంచి ఐఏఎస్‌.. ఐపీఎస్‌లు 11 మంది దేశవ్యాప్తంగా సేవలందిస్తున్నారు. నరసాయపాలెంలోనూ ఎక్కువమంది ఐఏఎస్‌.. ఐపీఎస్‌లు ఉన్నారు.


గ్రామీణ ప్రాంత నేపథ్యం.. ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చి ట్రిపుల్‌ ఐటీలో చదువుతున్న విద్యార్థుల్ని తక్కువచేసి ఎవ్వరూ చూడవద్దు. అధ్యాపక బృందం ఎలాంటి తేడాలు లేకుండా బోధన చేయాలి. ఇటీవల బలవన్మరణం చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య లేఖ చదివితే మనపరంగా దిద్దుకోవాల్సినవి కొన్ని ఉన్నాయని అర్ధమైంది. ప్రతిఒక్కరికి జీవితం విలువైందని తనలా ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోవద్దని ఆ విద్యార్థి లేఖలో రాశారు.అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి.

- ప్రత్యేక సమావేశంలో నూజివీడు ఆర్జీయూకేటీ ఛాన్సలర్‌ కేసీ రెడ్డి వ్యాఖ్యలు


పిల్లలందరూ ఒకటే అనే భావన పెంపొందించాలి..

డాదిపాటు అదరక.. బెదరక.. తొందరపడకుండా విద్యాభ్యాసం పూర్తిచేస్తే తరువాత పరిస్థితులకు విద్యార్థులు అలవాటవుతారు. కళాశాలల్లో కొత్తగా చేరిన విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, అభ్యసన సామర్థ్యాలు మెరుగయ్యేలా కౌన్సెలింగ్‌ ఇవ్వాలి. పిల్లలందరూ ఒకటే అనే భావన పెంపొందించాలి. ఆత్మనూన్యతా భావం, ఒత్తిడిలాంటి సమస్యల్ని ఎదుర్కొనే వారిని గుర్తించి వారి చదువులపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తే ఆత్మహత్యలకు అవకాశం ఉండదు.

- డాక్టర్‌ టీఎస్‌ రావు, సైకాలజిస్టు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని