logo
Published : 28/11/2021 03:10 IST

క్రైం వార్తలు

రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

చౌటుప్పల్‌గ్రామీణం: రహదారి ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పట్టణంలో శుక్రవారం రాత్రి జరిగింది. పట్టణ సీఐ ఎన్‌.శ్రీనివాస్‌ కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కృష్ణా జిల్లా గుడివాడలోని చౌదరిపేటకు చెందిన శ్రీ సత్యసాయి బాలాజీ(28) లింగోజిగూడెంలోని దివీస్‌ పరిశ్రమలో కొంతకాలం నుంచి ఉద్యోగం చేస్తున్నారు. పట్టణంలోని తంగడపల్లిలో నివాసం ఉంటున్నారు. ద్విచక్ర వాహనంపై వలిగొండ క్రాస్‌ రోడ్డు వద్ద యూటర్న్‌ తీసుకొని తంగడపల్లి వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఇతని ముందున్న లారీ డ్రైవర్‌ అకస్మాత్తుగా బ్రేక్‌ వేయడంతో అదుపు తప్పి లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. ప్రమాదంలో సత్యసాయి బాలాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. చౌటుప్పల్‌ ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడి భార్య లక్ష్మీదుర్గ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ సీఐ తెలిపారు.


ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

గుణదల, న్యూస్‌టుడే: ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం మాచవరం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అనంతపురానికి చెందిన విద్యార్థి(17) పీవీపీ మాల్‌ సమీపంలో ఒక ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆరోగ్యం బాగోలేదని శనివారం తరగతులకు హాజరవ్వకుండా హాస్టల్‌లోనే ఉండిపోయాడు. తోటి విద్యార్థులు మధ్యాహ్నం భోజనానికి వచ్చి చూసేసరికి అతను గదిలో ఉరివేసుకుని కనిపించాడు. వెంటనే కళశాల సిబ్బంది ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రభాకర్‌ తెలిపారు.  


బ్యానర్ల ఏర్పాటుపై ఫిర్యాదు

మోపిదేవి, న్యూస్‌టుడే: మోపిదేవి శ్రీవల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవాలయ రాజగోపురం ముందున్న ఫెన్సింగ్‌ బయట అనుమతి లేకుండా రాజకీయ పరమైన ఆహ్వాన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చల్లపల్లి ఎస్టేట్‌ దేవాలయాల సహాయ కమిషనర్‌ లీలాకుమార్‌ అవనిగడ్డ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. శుక్రవారం రాత్రి చిత్తూరు జిల్లా నగరి శాసనసభ్యురాలు ఆర్‌కే రోజా మోపిదేవి దేవాలయానికి వచ్చారు. ఆ సందర్భంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆలయ ముందు మూడు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దేవాలయ ప్రాముఖ్యత, ప్రాశస్త్యం, విశిష్ఠతకు విఘాతం కలిగే చర్యలుగా భావించి కొంతమంది భక్తులు మౌఖికంగా ఆలయ అధికారుల దృష్టికి తెచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఆలయ ఏసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


లైన్‌మెన్‌ విద్యుత్తు చౌర్యం

సూర్యారావుపేట, న్యూస్‌టుడే : విద్యుత్తును అక్రమంగా వినియోగిస్తున్న ఒక విద్యుత్తు ఉద్యోగితో పాటు మరో వ్యాపారవేత్తపై సంబంధిత శాఖ అధికారులు శనివారం కేసులు నమోదు చేశారు. రింగ్‌రోడ్డు విద్యుత్తు సెక్షన్‌లోని పనిచేసే లైన్‌మెన్‌ చట్టు నాగేశ్వరరావు తన ఇంటి సర్వీసు వైరును బైపాస్‌ చేసి, విద్యుత్తు చౌర్యం చేస్తున్నట్లు గుర్తించారు. అతడిపై విద్యుత్తు చౌర్యం కేసు నమోదు చేసి, శాఖపరమైన చర్యలకు శ్రీకారం చుట్టారు. అదేవిధంగా మచిలీపట్నం డివిజన్‌కు చెందిన కొల్లాటి అరుణ్‌ తన చేపల చెరువుకు విద్యుత్తు మీటరును బైపాస్‌ చేసి, విద్యుత్తును అక్రమంగా వాడుతున్నాడు. అతడిపై కేసు నమోదు చేసి, రూ.14వేలు జరిమానా విధించారు. విద్యుత్తు విజిలెన్స్‌ ఎస్‌ఈ జి.రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ.. ఎవరైనా విద్యుత్తు చౌర్యం చేస్తే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తీసుకున్న కేటగిరి కంటే ఎక్కువ కేటగిరి వినియోగించినా కేసులు పెడతామన్నారు. విద్యుత్తు చౌర్యంపై టోల్‌ ఫ్రీ నెంబరు 1912కు సమాచారం అందించాలని ఆయన కోరారు.


సర్పంచే.. నేరాల ముఠా నాయకురాలు

యాదమరి, న్యూస్‌టుడే: భూమి తనఖా పెట్టుకుని అప్పు ఇస్తామని ఎర వేసి అమాయకులను నమ్మించి మోసం చేసిన కేసులో ముఠా నాయకురాలు ఉమామహేశ్వరి అలియాస్‌ షాలిని(47)ని చిత్తూరు జిల్లా యాదమరి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఎస్సై ప్రతాప్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడు రాష్ట్రం, రాణిపేటజిల్లా, అరక్కోణం, కైనూర్‌ పోస్టు, బంగారమ్మన్‌ కండిగైకు చెందిన జె.ఉమామహేశ్వరి అలియాస్‌ షాలిని కైనూర్‌ పంచాయతీ సర్పంచిగా ఉంటూ రవిశంకర్‌ అలియాస్‌ రమేష్‌ ప్రభాకర్‌, రాజేష్‌ అలియాస్‌ విజయ్‌, నరేష్‌ అలియాస్‌ కార్తీక్‌, శ్రీకాంత్‌, శ్రీనివాసన్‌, అయ్యప్పన్‌, రామరాజ్‌, దినకరన్‌, సయ్యద్‌ అలీతో ఒక ముఠా ఏర్పాటు చేసింది. అమాయకులను నమ్మించి భూమి తనఖా పెట్టుకుని డబ్బులు అప్పుగా ఇస్తామని ఈ ముఠా సభ్యులు నమ్మిస్తారు. ఒప్పందం కుదిరాక భూమి రిజిస్ట్రేషన్‌, స్టాంపు రుసుం చెల్లించడానికి ముందుగా కొంత నగదు ఇవ్వాలని చెబుతారు. తమకు అవసరానికి డబ్బు అందుతుందని నమ్మి వారడిగిన నగదు ఇచ్చే సమయానికే సరిగ్గా పోలీసు దుస్తుల్లో ఉన్న కొందరు నకిలీ పోలీసులు.. వాహనంలో అక్కడికొచ్చి, వారిని బెదిరించి నగదు అపహరిస్తారు. ఇలా రూ.10 లక్షలు మోసం చేసి ముద్దాయిలు పారిపోయారని యాదమరి పోలీస్‌ స్టేషన్‌లో కృష్ణాజిల్లా వత్సవాయి మండలం పాలంపల్లికి చెందిన సూర్యనారాయణ గతంలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన యాదమరి పోలీసులు ఇలా ఎందరో అమాయకులను దోచుకున్న వారిని మాటువేసి ముఠా నాయకురాలు షాలిని మినహా మిగిలిన వారిని ఈ ఏడాది జులై 17న అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ఉమామహేశ్వరిని(షాలిని) శనివారం తమిళనాడులో అరెస్టు చేసి, రిమాండుకు తరలించామని’ ఎస్సై చెప్పారు.


వేధింపుల కేసులో యువకుడికి జైలు

గుంటూరు లీగల్‌, న్యూస్‌టుడే: యువతిని ప్రేమ పేరుతో వేధించిన యువకుడికి జైలుశిక్ష, జరిమానా విధిస్తూ గుంటూరు పోక్సో కోర్టు ఇన్‌ఛార్జి జడ్జి ఆర్‌.శ్రీలత శనివారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తరెడ్డిపాలేనికి చెందిన తూమాటి సురేష్‌బాబు విద్యుత్తు పనులు చేసేవాడు. అతను ఇంటర్‌ చదువుతున్న విద్యార్థినిని ప్రేమిస్తున్నట్లు వేధింపులకు గురిచేసేవాడు. యువతి అతడిని పట్టించుకోకపోవడంతో ఒకసారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయినప్పటికీ అతనిలో ఎలాంటి మార్పు రాలేదు. కొద్ది రోజుల తరువాత మళ్లీ ఆమె వెంటపడి ప్రేమిస్తున్నట్లు చెప్పి...కాదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో యువతి 2018 మే 15న అతని కోరిక మేరకు చందోలు వెళ్లింది. అక్కడ నుంచి అతను ఆమెను గుంటూరు తీసుకువెళ్లాడు. అక్కడ నుంచి ఇంటికి చేరుకున్న విద్యార్థిని తన కుటుంబ సభ్యులకు జరిగిన సంగతి తెలపడంతో పొలీసులకు ఫిర్యాదు చేశారు. పొలీసులు కేసు నమోదు చేసి అతనిపై ఛార్జిషీటు దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్‌ నేరం రుజువు చేయడంతో మూడేళ్ల జైలుశిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ జడ్జి శ్రీలత తీర్పు చెప్పారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కె.శ్యామల ప్రాసిక్యూషన్‌ నిర్వహించారు.


భార్య ఆత్మహత్య కేసులో భర్తకు..

తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే: పట్టణంలోని షరాఫ్‌బజార్‌లో 2019 నవంబరులో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న కేసులో నిందితుడిగా ఉన్న భర్త వెంకటరమణకు తెనాలి న్యాయస్థానం 5 సంవత్సరాల జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధించిందని వన్‌టౌన్‌ పోలీసులు శనివారం తెలిపారు. శుక్రవారం న్యాయమూర్తి టి.రామచంద్రుడు తీర్పు వెలువరించారని, రెండు సెక్షన్లలో వరుసగా 5, 2 సంవత్సరాల శిక్ష విధించారని, వీటిలో ఏది ఎక్కువగా ఉంటే అదే (5 సంవత్సరాలు) పరిగణలోకి తీసుకుంటారని చెప్పారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని