logo
Published : 28/11/2021 03:10 IST

సంక్షిప్త వార్తలు

జాతీయ విపత్తుగా ప్రకటించండి : సీపీఐ

విజయవాడ(అలంకార్‌కూడలి), న్యూస్‌టుడే : ఆంధ్రప్రదేశ్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని, ఈ ప్రకృతి ఉగ్రతను జాతీయ విపత్తుగా ప్రకటించి ఆదుకోవాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఓ లేఖ రాశారు. రాయలసీమ జిల్లాలు, నెల్లూరు జిల్లా ప్రజలు వరదలతో తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారని, కుటుంబాలను సైతం పోగొట్టుకున్నారని వివరించారు. రాష్ట్రానికి తక్షణ సాయం అందించాలని తన లేఖ ద్వారా రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.


ట్రాన్స్‌ జెండర్లకు గుర్తింపు కార్డులు

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : ట్రాన్స్‌ జెండర్ల గుర్తింపు, నమోదు కోసం కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ ఒక జాతీయ పోర్టల్‌ను ప్రారంభించినట్టు జేసీ (ఆసరా) కె.మోహన్‌కుమార్‌ తెలిపారు. నగరంలోని విడిది కార్యాలయంలో 60 మంది ట్రాన్స్‌ జెండర్లకు ధ్రువీకరణ పత్రాలు, గుర్తింపు కార్డులను శనివారం అందజేశారు. మిగతా వారు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. పూర్తి వివరాల కోసం విభిన్న ప్రతిభావంతుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకుల కార్యాలయ ఫోన్‌ నంబర్‌ 08672-252637లో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ బి.రామ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


13లోగా ఇంటర్‌ పరీక్ష ఫీజు చెల్లించాలి

పెడన గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లాలో ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ రెగ్యులర్‌, ఫెయిలైన విద్యార్థులు వచ్చే నెల 13వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలని ఆరైవో పి.రవికుమార్‌ తెలిపారు. రూ.120 అపరాధ రుసుముతో డిసెంబరు 23 వరకు, రూ.500తో 30వ తేదీ వరకు, రూ. 1000తో వచ్చే ఏడాది జనవరి 4 వరకు, రూ.2000 అపరాధ రుసుముతో 10 వరకు, రూ.3000తో 17 వరకు, రూ.5000 అపరాధ రుసుముతో జనవరి 20వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు గడువుందన్నారు. విద్యార్థుల నుంచి వసూలు చేసిన పరీక్ష ఫీజును కళాశాలలు నిర్ణీత బ్యాంకుల ద్వారా చెల్లించాలని సూచించారు.


విద్యుత్తు ఈఈ కార్యాలయంలో స్పందన రేపు

సూర్యారావుపేట, న్యూస్‌టుడే : విద్యుత్తు మీటరులో లోపాలు, విద్యుత్తు బిల్లుల్లో తప్పులు, ఓల్టేజీ హెచ్చుతగ్గులు తదితర సమస్యలపై సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విద్యుత్తు ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ బి.వి.సుధాకర్‌ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. వినియోగదారులు స్వరాజ్యమైదానం ఎదురుగా ఉన్న విద్యుత్తు ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ కార్యాలయంలో సంప్రదించి, తమ సమస్యలకు పరిష్కారం పొందాలని ఆయన సూచించారు.


వసతి గృహాల్లో సమూల మార్పు

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌,  న్యూస్‌టుడే :  జిల్లాలోని 131 సంక్షేమ వసతి గృహాలను పూర్తి స్థాయిలో మెరుగుపరిచే ‘మార్పు’ కార్యక్రమానికి కలెక్టర్‌ జె.నివాస్‌ శ్రీకారం చుట్టారు. ఇందులో సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన వసతి గృహాలు 84, బీసీ సంక్షేమ పరిధిలో 45, గిరిజన సంక్షేమ వసతి గృహాలు 2 ఉన్నాయి. నగరంలోని జలవనరుల శాఖ ఆవరణలోని రైతు శిక్షణ కేంద్ర భవనంలో శనివారం వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. గృహ నిర్మాణ శాఖ తప్ప, మిగతా శాఖల ఇంజినీర్‌లు ఒక్కొక్క వసతి గృహాన్ని దత్తత తీసుకుని, అభివృద్ధి చేయాలని సూచించారు. శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన ‘మార్పు’ ప్రగతిని పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా ఆయన వివరించారు. సమావేశంలో జేసీ (ఆసరా, సంక్షేమం) కె.మోహన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


17 నుంచి ఏపీ అగ్రిటెక్‌ ఎగ్జిబిషన్‌

గుంటూరు (జిల్లాపరిషత్‌), న్యూస్‌టుడే: ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ఆంగ్రూ), వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఏపీ అగ్రిటెక్‌ ఎగ్జిబిషన్‌ను వచ్చే నెల 17 నుంచి 19వ తేదీ వరకు గుంటూరు సమీపంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాంఫాంలో నిర్వహించనున్నట్లు వర్శిటీ పరిశోధన సంచాలకుడు ఎన్‌.త్రిమూర్తులు తెలిపారు. లాంఫాం ఏడీఆర్‌ రత్నప్రసాద్‌తో కలిసి శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయంలో నూతన సాంకేతిక విధానాలకు అనుగుణంగా  150 కంపెనీలు రూపొందించిన యంత్ర సామగ్రిని ప్రదర్శన ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. దేశ వ్యాప్తంగా వివిధ కంపెనీలను ఆహ్వానించి వారి ఉత్పత్తులను రైతులు తెలుసుకుని తక్కువ ఖర్చుతో సేద్యం చేసేలా ప్రోత్సహించటమే ఎగ్జిబిషన్‌ లక్ష్యమన్నారు. రాష్ట్రంలోని రైతులు ఏపీ అగ్రిటెక్‌ ఎగ్జిబిషన్‌కు హాజరై విజయవంతం చేయాలని కోరారు. మూడు రోజుల పాటు జరిగే సదస్సులో వరికి ప్రత్యామ్నాయంగా పంటల సేద్యం, సేంద్రియ వ్యవసాయం అనువుగా మార్చడం, యంత్ర సామగ్రి వినియోగంపై చర్చలు నిర్వహిస్తామన్నారు. ఆంగ్రూ ఉపకులపతి డాక్టర్‌ విష్ణువర్దన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని రైతులు సేద్యంలో అధునాతన విధానాలు, యంత్ర సామగ్రిని రైతులు వినియోగించేలా చూసేందుకు ప్రభుత్వంతో మాట్లాడి అగ్రిటెక్‌ను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు.


నేటి నుంచి ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభలు

గుంటూరు విద్య, న్యూస్‌టుడే: భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) 23వ రాష్ట్ర మహాసభలు ఈనెల 28, 29, 30వ తేదీల్లో విజయనగరంలో జరగనున్నాయని సమాఖ్య జిల్లా కార్యదర్శి పి.మనోజ్‌కుమార్‌ తెలిపారు. శనివారం బ్రాడీపేటలోని జిల్లా కార్యాలయంలో మనోజ్‌కుమార్‌ విలేకరులతో మాట్లాడుతూ మహాసభల్లో విద్యారంగంలో వస్తున్న మార్పులు, రాష్ట్రంలోని విద్యార్థుల సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణకు నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థల రద్దు కోసం తెచ్చిన జీవోలను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ఎం.కిరణ్‌, నగర అధ్యక్షులు పూర్ణమహేష్‌ తదితరులు పాల్గొన్నారు.


30న మౌఖిక పరీక్ష

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: వైద్య ఆరోగ్య శాఖలో ఒప్పంద విధానంలో ప్రత్యేక కేటగిరీ కింద వైద్యాధికారుల నియామకానికి డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఈ నెల 30న మౌఖిక పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి యాస్మిన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి, అర్హత ఉన్న వైద్యులు మంగళవారం ఉదయం 11 గంటలకు అసలు ధ్రువపత్రాలు, వాటి నకళ్లు తీసుకుని తమ కార్యాలయంలో హాజరు కావాలని సూచించారు.


రేపటి స్పందన కార్యక్రమం యథాతథం

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: సోమవారం నిర్వహించే డయల్‌ యువర్‌ కలెక్టర్‌, స్పందన కార్యక్రమం ఈ నెల 29వ తేదీ నుంచి యథాతథంగా జరగనున్నాయి. సోమవారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు డయల్‌ యువర్‌ కలెక్టర్‌, 11 గంటల నుంచి స్పందన కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి పి.కొండయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


ఎంఫిల్‌ పార్ట్‌ 1 పరీక్ష ఫలితాల విడుదల

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలో ఈ ఏడాది సెప్టెంబరులో నిర్వహించిన ఎంఫిల్‌, ప్రీ పీహెచ్‌డీ పార్ట్‌ 1 పరీక్షలను ఎఫ్‌ఏసీ వీసీ ఆచార్య రాజశేఖర్‌ శనివారం విడుదల చేశారు. మొత్తం 94శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని పరిశోధన విభాగం సమన్వయకర్త ఆచార్య ఉదయ్‌కుమార్‌ చెప్పారు. మరిన్ని వివరాలను విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో ఉంచామని ఉదయ్‌కుమార్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో రెక్టార్‌ ఆచార్య వరప్రసాదమూర్తి, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కరుణ తదితరులు పాల్గొన్నారు.


నియామకపత్రాల అందజేత  

గుంటూరు విద్య, న్యూస్‌టుడే: డీఎస్సీ- 2018 స్కూల్‌ అసిస్టెంట్‌ తెలుగు పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు శనివారం డీఈవో ఆర్‌.ఎస్‌.గంగాభవాని ఉపాధ్యాయ నియామకపత్రాలు అందజేశారు. ఈసందర్భంగా డీఈవో మాట్లాడుతూ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో నియామకం జరగడంతో కొంతవరకు ఉపాధ్యాయుల కొరత తీరిందన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ ఏడీ సంధాని, పర్యవేక్షకులు నరసింహారావు, ఉర్దూ పాఠశాలల ఉపతనిఖీ అధికారి ఎండీ ఖాసిం తదితరులు పాల్గొన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని