Crime News: మధుమేహం మందు పేరిట ఆన్‌లైన్‌లో గంజాయి

మధుమేహ నియంత్రణకు ఉపయోగపడే ఆయుర్వేద ఆకుల పేరుతో గంజాయిని అమెజాన్‌ ద్వారా తరలిస్తున్న ముఠాను ఏపీ పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయాన్ని విశాఖపట్నం సెబ్‌(స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో) జేడీ సతీష్‌కుమార్‌ మీడియాకు శనివారం తెలిపారు.

Published : 28 Nov 2021 07:29 IST

అయిదుగురు నిందితుల అరెస్టు

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: మధుమేహ నియంత్రణకు ఉపయోగపడే ఆయుర్వేద ఆకుల పేరుతో గంజాయిని అమెజాన్‌ ద్వారా తరలిస్తున్న ముఠాను ఏపీ పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయాన్ని విశాఖపట్నం సెబ్‌(స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో) జేడీ సతీష్‌కుమార్‌ మీడియాకు శనివారం తెలిపారు. ఆయన చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి... ఎండు గంజాయిని ‘సూపర్‌ నేచురల్‌ స్టివియా లీవ్స్‌’ పేరుతో మధుమేహ నియంత్రణకు ఉపయోగపడే ఆయుర్వేద ఆకులని చెప్పి.. విశాఖ నుంచి మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లకు అమెజాన్‌లో పంపుతున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్‌లో పట్టుబడిన నిందితులను విచారించగా ఈ విషయం తెలిసింది. అక్కడి సమాచారంతో విశాఖలో సెబ్‌ పోలీసులు తనిఖీలు చేపట్టారు. వారం క్రితం చిలకపాటి శ్రీనివాసరావు అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతన్ని విచారించగా కంచరపాలెంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఈ వ్యాపారం చేస్తున్నట్లు చెప్పాడు. ఆ ఇంట్లో 48 కేజీల ఎండు గంజాయితో పాటు అమెజాన్‌ ప్యాకింగ్‌ కవర్లు, అట్టపెట్టెలు, టేపులు, తూనిక యంత్రం దొరికాయి. వాటిని స్వాధీనం చేసుకుని, నిందితున్ని విచారించగా మధ్యప్రదేశ్‌కు చెందిన సూరజ్‌ పవయ, ముకుల్‌ జైశ్వాల్‌తో కలిపి గంజాయిని అమెజాన్‌ ద్వారా పంపిస్తున్నట్లు పోలీసులకు తెలిపాడు. గత 8 నెలలుగా సుమారు 800 కేజీల గంజాయిని మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌, గ్వాలియర్లకు పంపించినట్లు పోలీసులు గుర్తించారు. అమెజాన్‌లో పనిచేస్తున్న ఇద్దరు పికప్‌ అసోసియేట్లు జీరు కుమారస్వామి, బిజ్జం కృష్ణంరాజు, పికప్‌ వ్యాన్‌ డ్రైవర్‌ చీపురుపల్లి వెంకటేశ్వరరావు, చిలకపాటి శ్రీనివాసరావు కుమారుడు మోహన్‌రాజును ఇప్పటికే అరెస్టు చేశారు. తనిఖీలు చేయకుండా సరకు రవాణా చేస్తున్నందుకు అమెజాన్‌ సంస్థకు నోటీసులు జారీచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని