Crime news: డ్రగ్స్ బానిస వల్లే.. కేరళ మోడల్స్ మృతి చెందారు..!

నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో కేరళ మోడల్స్ మృతిచెందిన ఘటనలో బుధవారం పోలీసులు కీలక విషయం వెల్లడించారు. డ్రగ్స్‌కు బానిసైన సైజు అనే వ్యక్తే ప్రధాని నిందితుడని తెలిపారు.

Published : 02 Dec 2021 13:13 IST

కీలక విషయం వెల్లడించిన పోలీసులు 

తిరువనంతపురం: నెల రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో కేరళ మోడల్స్ మృతిచెందిన ఘటనకు సంబంధించి బుధవారం పోలీసులు కీలక విషయం వెల్లడించారు. డ్రగ్స్‌కు బానిసైన సాయిజు థంకచన్‌ అనే వ్యక్తే ఈ కేసులో ప్రధాన నిందితుడని తెలిపారు. అక్టోబర్ 31 రాత్రి జరిగిన కారు ప్రమాదంలో మాజీ మిస్ కేరళ అన్సీ కబీర్‌ (24), అదే పోటీలో రన్నరప్‌గా నిలిచిన అంజనా షాజన్ (25) దుర్మరణం చెందారు. కోచికి సమీపంలోని వైటిల్లా వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఓ ద్విచక్రవాహనాన్ని తప్పించే క్రమంలో బోల్తా కొట్టింది. ఘటనాస్థలంలోనే వారిద్దరు మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన మరోవ్యక్తి వారం వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయాడు. డ్రైవింగ్‌ చేస్తున్న వారి స్నేహితుడికి మాత్రం ప్రాణాపాయం తప్పింది. 

అసలేం జరిగిందంటే..

అన్సీ, అంజనా తన స్నేహితులతో కలిసి అక్టోబర్ 31న ఒక పార్టీకి వెళ్లగా.. అక్కడే సాయిజు థంకచన్‌ కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో నిందితుడు మోడల్స్‌తో అభ్యంతరకరంగా ప్రవర్తించాడని, రాత్రి పూట హోటల్‌లో బస చేసేందుకు ఏర్పాటు చేయగలనని వారితో మాట్లాడినట్లు పేర్కొన్నారు. దాంతో ఈ ఇద్దరు మోడల్స్ వారి స్నేహితులతో కలిసి హోటల్‌ నుంచి బయటకు వచ్చి కారులో ఇళ్లకు వెళ్లిపోతుండగా.. సాయిజు కూడా వారిని అనుసరించాడు.  డ్రైవింగ్‌ చేస్తున్న వ్యక్తి దీన్ని గమనించి వేగంగా కారు నడపడం ప్రారంభించారని చెప్పారు. అదే ఘోర ప్రమాదానికి దారితీసింది. అయితే, ఈ ఘటనలో సాక్ష్యాలను ధ్వంసం చేశారని, హోటల్ యజమాని భయపడుతున్నారని అంజన సోదరుడు అర్జున్‌ ఆరోపించారు. దీనిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని బాధిత కుటుంబం డిమాండ్ చేసింది. ఇదిలా ఉండగా నిందితుడిని పోలీసులు కోర్టు ముందు హాజరుపర్చనున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని