Maoist Sharadakka: పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు నేత శారదక్క

మావోయిస్టు నేత సమ్మక్క అలియాస్ శారదక్క పోలీసుల ఎదుట లొంగిపోయారు

Updated : 17 Sep 2021 15:38 IST

హైదరాబాద్‌: మావోయిస్టు నేత సమ్మక్క అలియాస్ శారదక్క పోలీసుల ఎదుట లొంగిపోయారు. 1994లో దళంలో చేరిన ఆమె అప్పటి కమాండర్‌ హరిభూషణ్‌ను వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఆమె మావోయిస్టు కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. ప్లాటూన్ కమాండర్‌గా, సెంట్రల్ కమిటీ కమాండర్‌గానూ శారదక్క పని చేశారు. 2006లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో బుల్లెట్ తగిలి ఒక కన్ను కోల్పోయారు. 2007లో ఎస్పీ ఎదుట లొంగిపోయిన ఆమె, 2011లో మరోసారి హరిభూషణ్‌తో కలిసి మావోయిస్ట్ పార్టీలో చేరారు. హరిభూషణ్‌ బతికి ఉన్నన్ని రోజులు శారదక్కకు పార్టీలో తగిన ప్రాధాన్యం ఉండేది. అతని మరణం తర్వాత మావోయిస్ట్ సిద్ధాంతాల పట్ల ఆమె అనాసక్తిగా ఉన్నారు. ఈ క్రమంలో దళాన్ని వీడాలని నిర్ణయించుకుని, తాజాగా పోలీసుల ఎదుట లొంగిపోయారు. గత ఆరు నెలల్లో 20 మంది మావోయిస్టులు మావోయిస్ట్ పార్టీని వీడి జన జీవన స్రవంతిలో కలిసినట్లు శారద చెప్పారు. హింస ద్వారా ఏమీ సాధించలేమని, మిగతా మావోయిస్టులు కూడా లొంగి పోవాలని పోలీసుల ద్వారా విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘తెలంగాణా మావోయిస్ట్ రాష్ట్ర కమిటీలో 115 మంది ఉన్నారు. వీళ్లలో తెలంగాణకు చెందిన వాళ్లు కేవలం 15 మంది. మిగతా వాళ్లంతా గోతికోయలే. కేంద్ర కమిటీ సభ్యులైన ఆజాద్, రాజీరెడ్డి లొంగిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ, మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలు అడ్డుకుంటున్నారు. అనారోగ్యంతో బాధపడే మావోయిస్టులందరూ లొంగిపోండి. శారద జనజీవన స్రవంతిలోకి వచ్చినందుకు 5 లక్షల రివార్డ్‌తో పాటు తాత్కాలిక సాయంగా రూ.5 వేల నగదు ఇస్తున్నాము’’ అని అన్నారు.

మరోవైపు మావోయిస్ట్ పార్టీ ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది.  చాలా మంది మావోయిస్టులకు కరోనా సోకింది. అడవుల్లో సరైన వైద్య సదుపాయాలు అందక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం దామోదర్ మావోయిస్ట్ తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ నుంచి మావోయిస్ట్‌ దళంలోకి నూతనంగా ఎవరూ చేరడం లేదు. కేంద్ర కమిటీలో 25 మంది ఉన్నారు. వారిలో 11 మంది తెలంగాణ, ముగ్గురు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు.  మిగతా 11 మంది ఇతర రాష్ట్రాల వాళ్లు. కేంద్ర కమిటీ కార్యదర్శిగా నంబాల కేశవరావు వ్యవహరిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని