వద్దు నాన్నా.. అంటున్నా వినకుండా..!

మీరు కోటీశ్వర్లు అయ్యారు. మేం తీసిన లాటరీలో మీకు బంపర్‌ ఆఫర్‌ వచ్చింది. అక్షరాలా రూ.కోటి గెలుచుకున్నారు

Published : 25 Jan 2021 01:04 IST

కుమారులు ఎంత వేడుకున్నా నిర్ణయం మార్చుకోలేదు
వీడియోకాల్‌ చేసి ఉరివేసుకున్న తండ్రి

రామారెడ్డి: ‘‘మీరు కోటీశ్వర్లు అయ్యారు. మేం తీసిన లాటరీలో మీకు బంపర్‌ ఆఫర్‌ వచ్చింది. అక్షరాలా రూ.కోటి గెలుచుకున్నారు. ఆ నగదు మీ వద్దకు చేరాలంటే సర్వీస్‌ ఛార్జీలు చెల్లించాలి’’ ఇదీ నయా మోసగాళ్లు ప్రస్తుతం అనుసరిస్తున్న ట్రెండ్‌. సరిగ్గా ఇటువంటి మోసమే ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. చనిపోతున్నానంటూ కన్న కుమారులకు వీడియో కాల్‌ చేసి ఓ తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆ కుటుంబంలో అంతులేని వేదనను మిగిల్చింది.  ‘వద్దు నాన్నా.. వద్దు’ అంటూ చిన్నారులు విలపిస్తూ ఎంత వేడుకున్నా ఆ తండ్రి నిర్ణయాన్ని మార్చుకోలేదు. వీడియోకాల్‌లో మాట్లాడుతూనే తనువు చాలించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ హృదయ విదారకమైన ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. రామారెడ్డి మండలం పోసానిపేట్‌కు చెందిన మంగళపల్లి లక్ష్మణ్ ‌(35) కుటుంబ సభ్యులతో కలిసి కామారెడ్డి జిల్లా కేంద్రంలో నివాసముంటున్నాడు. ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న లక్ష్మణ్‌కు ఆరు నెలల క్రితం ‘కరోడ్‌పతి’ అయ్యారంటూ మొబైల్‌కు ఓ మెసేజ్‌ వచ్చింది. ‘మీరు రూ.కోటి గెలుచుకున్నారు.. ముందుగా కొంత డబ్బు చెల్లిస్తే గెలుచుకున్న మొత్తం మీ ఇంటికి చేరుతుంది’ అని చెప్పడంతో లక్ష్మణ్‌ అప్పు చేసి మరీ ఆన్‌లైన్‌లో రూ.2.65 లక్షలు చెల్లించాడు. మరో గొలుసుకట్టు సంస్థకూ రూ.2 లక్షలకు పైగా కట్టాడు. తీరా డబ్బు రాకపోవడంతో మోసపోయానని గ్రహించి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. గురువారం స్వగ్రామం పోసానిపేట్‌కు వెళ్లి చనిపోతున్నానంటూ కామారెడ్డిలో ఉన్న కుటుంబసభ్యులకు వీడియో కాల్‌ చేశాడు. ఆ సమయంలో తన ఇద్దరు కుమారులు వద్దని ఎంత చెబుతున్నా.. వినకుండా ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రామారెడ్డి ఎస్సై రాజు తెలిపారు.

ఇవీ చదవండి..

ఉద్యోగ సంఘాలతో చర్చలు ప్రారంభించండి: కేసీఆర్‌

ప్రభుత్వం టార్గెట్లు పెట్టడం సరికాదు: కిషన్‌రెడ్డి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని