Uttar Pradesh: యూపీలోని కారాగారంలో తీవ్ర ఉద్రిక్తత.. రాళ్లు రువ్విన ఖైదీలు

ఉత్తర్‌ప్రదేశ్‌ ఫరూకాబాద్‌లోని ఫతేహ్‌గఢ్‌ జిల్లా కారాగారంలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ ఖైదీ మృతితో ఆగ్రహం చెందిన మిగతావారు అధికారులపై రాళ్లు రువ్వుతూ ఆందోళనకు దిగారు. జైలు ప్రాంగణంలోని కొత భాగానికి నిప్పంటించారు. మొత్తం ప్రాంగణాన్ని...

Published : 07 Nov 2021 23:50 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ ఫరూకాబాద్‌లోని ఫతేహ్‌గఢ్‌ జిల్లా కారాగారంలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ ఖైదీ మృతితో ఆగ్రహం చెందిన మిగతా ఖైదీలు అధికారులపై రాళ్లు రువ్వుతూ ఆందోళనకు దిగారు. జైలు ప్రాంగణంలోని కొంత భాగానికి నిప్పంటించారు. మొత్తం ప్రాంగణాన్ని స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. ఈ క్రమంలో డిప్యూటీ జైలర్లు అఖిలేష్ కుమార్, శైలేష్ కుమార్‌ను బందీలుగా ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనలో ఓ సిబ్బందికి, ఖైదీకి తీవ్ర గాయాలైనట్లు తెలిపారు. పలువురు స్వల్పంగా గాయపడినట్లు చెప్పారు. అంతకుముందు ఖైదీలను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించినా.. ఫలితం లేకపోయిందని వివరించారు.

‘ఆలస్యంగా చికిత్స అందించడంతోనే..’

అనారోగ్యంతో ఉన్న సందీప్ కుమార్ అనే అండర్ ట్రయల్ ఖైదీ చికిత్స పొందుతూ మృతి చెందడంతో.. ఖైదీలు ఆగ్రహంతో ఉన్నారని అధికారి తెలిపారు. అతనికి ఆలస్యంగా చికిత్స అందించడంతోనే మృతి చెందినట్లు వారు ఆరోపిస్తున్నారన్నారు. మరోవైపు ఈ విషయంపై జైలు అధికారులు ఇంతవరకు స్పందించలేదు. సీనియర్ ఎస్పీ, జిల్లా మేజిస్ట్రేట్.. సదరు ఖైదీలను శాంతింపజేసే పనిలో నిమగ్నమై ఉన్నారని ఫరూకాబాద్ అదనపు ఎస్పీ అజయ్‌పాల్ సింగ్ తెలిపారు. మరోవైపు జైళ్లశాఖ ఉన్నతాధికారులు ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లు చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని