జల్‌పల్లి కమిషనర్‌కు రూ.కోట్లలో అక్రమాస్తులు!

ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలపై హైదరాబాద్‌ శివారులోని జల్‌పల్లి పురపాలిక కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌పై అవినీతి నిరోధకశాఖ(అనిశా)  అధికారులు గురిపెట్టారు.

Updated : 01 Jul 2022 05:58 IST

మున్సిపల్‌ కార్యాలయం, ఇళ్లల్లో అనిశా తనిఖీలు

ఈనాడు,హైదరాబాద్‌: ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలపై హైదరాబాద్‌ శివారులోని జల్‌పల్లి పురపాలిక కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌పై అవినీతి నిరోధకశాఖ(అనిశా)  అధికారులు గురిపెట్టారు. ఆయన కార్యాలయం, రెండు ఇళ్లు, హిమాయత్‌నగర్‌లోని ఓ ప్రైవేటు కార్యాలయంలో ఏక కాలంలో తనిఖీలు నిర్వహించారు. గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి 11గంటల వరకూ సోదాలు కొనసాగాయి. అనిశా కేంద్ర పరిశోధన విభాగం డీఎస్పీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో హిమాయత్‌నగర్‌లోని ఆయన కార్యాలయం, ఆదర్శ్‌నగర్‌లోని ఒక ఇల్లు, బాలాపూర్‌ వాసవీ కాలనీలోని ఇంట్లోంచి విలువైన పత్రాలు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రవీణ్‌కుమార్‌ ఆగస్టు 2020లో జల్‌పల్లి పురపాలిక కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. పురపాలిక పరిధిలోని ప్రైవేట్‌ పరిశ్రమలపై ఆయన దాడులు చేయడం వెనక వేరే ఉద్దేశం ఉందని, అక్కడ ఓ స్థిరాస్తి సంస్థకు అనుకూలంగా వ్యవహరించారన్న ప్రచారం కొనసాగింది. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌పై అక్కడున్న ఓ ప్రజాప్రతినిధి, ఆయన అనుచరులు ఏసీబీకి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. అనిశా అధికారులు వాటికి సాక్ష్యాధారాలు సేకరించి దాడులు నిర్వహించారు.


లంచం డిమాండ్‌ చేసిన తహసీల్దార్‌, ఆర్‌ఐల అరెస్ట్‌

ఇందల్‌వాయి, న్యూస్‌టుడే: అక్రమంగా ఇసుక తరలిస్తూ పట్టుబడిన ట్రాక్టర్‌ను వదిలేయడానికి లంచం డిమాండ్‌ చేసిన నిజామాబాద్‌ జిల్లా ఇందల్‌వాయి తహసీల్దార్‌ రమేష్‌, ఆర్‌ఐ భషరత్‌ అలీఖాన్‌లను అనిశా అధికారులు గురువారం అరెస్టు చేశారు. అనిశా డీఎస్పీ ఆనంద్‌కుమార్‌ కథనం ప్రకారం.. ఇందల్‌వాయి మండలం తిర్మాన్‌పల్లికి చెందిన కలిగోట సతీష్‌ కొద్దిరోజుల క్రితం ట్రాక్టర్‌లో అక్రమంగా ఇసుక తరలిస్తుండగా రెవెన్యూ సిబ్బంది పట్టుకున్నారు. వాహనాన్ని సీజ్‌ చేయకుండా వదిలేయాలంటే రూ.30 వేలు ఇవ్వాలని తహసీల్దార్‌, ఆర్‌ఐ డిమాండ్‌ చేశారు. బాధితుడు అనిశా అధికారులను ఆశ్రయించారు. అధికారులు గురువారం ఇందల్‌వాయి మండల రెవెన్యూ కార్యాలయం, నిజామాబాద్‌లోని నిందితుల ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించి పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.


ఇద్దరు అధికారులపై కేసు

కరీంనగర్‌ సంక్షేమ విభాగం, న్యూస్‌టుడే: స్థానికత అర్హతకు సంబంధించి తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఉద్యోగం పొందిన కరీంనగర్‌ జిల్లా తూనికల కొలతల శాఖ అధికారి రవీందర్‌, హైదరాబాద్‌ ప్రధాన శాఖలో డిప్యూటీ కంట్రోలర్‌గా పనిచేస్తున్న విమల్‌బాబుపై క్రిమినల్‌ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని