3 బ్యాంకులనూ కొల్లగొట్టింది ఒక్కడే?

ఏపీ మహేశ్‌ కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ ప్రధాన సర్వర్‌ను హ్యాక్‌ చేసి రూ.12.9 కోట్లు కొల్లగొట్టిన కేసులో మరిన్ని విస్తుగొలిపే అంశాలు వెలుగుచూస్తున్నాయి. ఈ బ్యాంక్‌లో సైబర్‌ దాడికి పాల్పడిన నిందితుడు.. అంతకుముందు తెలంగాణ సహకార అపెక్స్‌ బ్యాంక్‌, ఓ విదేశీబ్యాంక్‌లో సర్వర్‌ హ్యాక్‌ చేసి నగదు కొల్లగొట్టిన నేరస్థుడు ఒక్కడేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ముందుగా ఈ మూడు బ్యాంకుల సిబ్బందిలో ఒకరికి ఈమెయిల్‌ వచ్చిందని, దాన్నుంచి నిందితుడు సర్వర్‌లోకి ప్రవేశించినట్లు తేలింది.

Published : 27 Jan 2022 04:49 IST

సర్వర్‌లను హ్యాక్‌ చేసిన తీరులో సారూప్యం
అన్నింటికీ సాఫ్ట్‌వేర్‌ సమకూర్చింది ఒక సంస్థే
ఈనాడు - హైదరాబాద్‌

పీ మహేశ్‌ కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ ప్రధాన సర్వర్‌ను హ్యాక్‌ చేసి రూ.12.9 కోట్లు కొల్లగొట్టిన కేసులో మరిన్ని విస్తుగొలిపే అంశాలు వెలుగుచూస్తున్నాయి. ఈ బ్యాంక్‌లో సైబర్‌ దాడికి పాల్పడిన నిందితుడు.. అంతకుముందు తెలంగాణ సహకార అపెక్స్‌ బ్యాంక్‌, ఓ విదేశీబ్యాంక్‌లో సర్వర్‌ హ్యాక్‌ చేసి నగదు కొల్లగొట్టిన నేరస్థుడు ఒక్కడేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ముందుగా ఈ మూడు బ్యాంకుల సిబ్బందిలో ఒకరికి ఈమెయిల్‌ వచ్చిందని, దాన్నుంచి నిందితుడు సర్వర్‌లోకి ప్రవేశించినట్లు తేలింది. వ్యక్తిగత వివరాలు తెలియకపోయినా ఐపీ చిరునామా ప్రకారం కూడా ఈ మూడు బ్యాంకుల్లోనూ ఒకే నిందితుడు నేరానికి పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ప్రధాన సర్వర్లలోకి ప్రవేశించేముందు హైదరాబాద్‌లోని సదరు బ్యాంకు శాఖలకు వెళ్లి పరిస్థితులను గమనించాడనీ భావిస్తున్నారు. ఈ బ్యాంకులకు సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని (సాఫ్ట్‌వేర్‌ను) సమకూర్చింది ఒకే బహుళజాతి సంస్థ. దాని నుంచే రక్షణ వ్యవస్థను మూడు బ్యాంకులు కొనుగోలు చేశాయి. దీనిపైనా, బ్యాంకుల లోటుపాట్లపైనా క్షుణ్నంగా తెలుసుకున్నాకే నిందితుడు ఈ సైబర్‌ దోపిడీకి పథకం వేసి, అమలు చేశాడని పోలీస్‌ అధికారులు అనుమానిస్తున్నారు.  

ఫార్మా కంపెనీ పేరుతో..

మహేశ్‌ బ్యాంక్‌లోంచి నగదు కాజేందుకు వీలుగా సైబర్‌ నేరస్థుడు కూకట్‌పల్లి శాఖలో గతేడాది డిసెంబరులో ఫార్మాహౌస్‌ పేరుతో ఓ ఖాతా ప్రారంభించాడు. ప్రధాన సర్వర్‌ను హ్యాక్‌ చేసి ఈ నెల 23న రూ.50 లక్షలు ఆ ఖాతాలోకి బదిలీచేశాడు. అందులోంచే ఈశాన్య రాష్ట్రాల్లోని వేర్వేరు ఖాతాలకు పంపించాడు. ఫార్మాహౌస్‌ ఖాతాను ప్రారంభించినప్పుడు ప్రతినిధిగా ఎవరు వచ్చారు? తొలుత ఎంత నగదు జమచేశాడు? ఇప్పటివరకు ఎన్ని లావాదేవీలు జరిగాయన్న అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. ఒక వ్యక్తి వచ్చాడని మహేశ్‌బ్యాంక్‌ అధికారులు చెప్పగా వివరాలను, సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

ఇక ముంబయికి చెందిన ఒక మహిళ మహేశ్‌బ్యాంక్‌ బషీర్‌బాగ్‌ శాఖలో పొదుపు ఖాతా తెరిచింది. ఈ ఖాతాకే సైబర్‌ నేరస్థుడు రూ.6.9 కోట్లు బదిలీ చేశాడు. ఖాతా ప్రారంభించేందుకు వచ్చినప్పుడు ఆమె వెంట ఓ పురుషుడు ఉన్నాడు. సీసీ కెమెరాల్లో దృశ్యాలు అస్పష్టంగా ఉండడంతో ఫుటేజీని విశ్లేషించేందుకు సైబర్‌ల్యాబ్‌కు పంపించారు.

రూ.12.9 కోట్లు బదిలీ చేసుకునేందుకు నాలుగు ఖాతాలు వినియోగించాడని,  ఒక మహిళ, మరో వ్యక్తి అతడికి సహకరించినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. మరో ఇద్దరికి సైబర్‌ నేరగాడితో సంబంధం లేదని భావిస్తున్నారు. రెండు నెలలుగా హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌, బంజారాహిల్స్‌, పాతబస్తీ, కూకట్‌పల్లిలోని ఏపీ మహేశ్‌బ్యాంక్‌ శాఖల సమాచారం సేకరించాడని తెలుసుకున్నారు. సైబర్‌ నేరస్థుడు వినియోగించిన ఖాతాల వివరాలను పరిశీలిస్తున్నామని, ఇప్పటికే కొంతమందిని విచారించామని సంయుక్త కమిషనర్‌ (నేర పరిశోధన) డాక్టర్‌ గజరావ్‌భూపాల్‌ తెలిపారు.


మరికొన్ని బ్యాంకులపైనా కన్ను?

కొన్ని గంటల వ్యవధిలోనే ఏపీ మహేశ్‌ కోఆపరేటివ్‌ బ్యాంకులో రూ.12.9 కోట్లు కొల్లగొట్టిన సైబర్‌ నేరగాడు రాష్ట్రంలో మరికొన్ని బ్యాంకులపైనా కన్నేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తెలంగాణ సహకార అపెక్స్‌ బ్యాంకులో సొమ్ము కాజేయడానికి కారణమైన ఐపీ చిరునామాను బ్లాక్‌ చేయాలని ఆర్బీఐ అదే ఏడాది జులై, ఆగస్టు నెలల్లో దేశంలోని అన్ని బ్యాంకులనూ ఆదేశించింది. కానీ కొన్ని బ్యాంకులు దీన్ని పట్టించుకోలేదని తెలుస్తోంది. ఆ బ్యాంకులన్నీ ఇప్పుడు సైబర్‌ నేరగాడి బారిన పడుతున్నాయని తెలుస్తోంది. తాజా ఉదంతం నేపథ్యంలో రాష్ట్రంలో బ్యాంకులన్నీ అప్రమత్తమైనా నేరగాడు ఏ రూపంలో విరుచుకుపడతాడో తెలియక హడలిపోతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని