మస్తాన్‌ వలీ.. మళ్లీ మోసం

ప్రభుత్వ సంస్థల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను స్వాహా చేస్తున్న చుండూరి సాయికుమార్‌ బృందం రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌లోనూ చేతివాటానికి యత్నించింది. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కార్వాన్‌ శాఖ ఉన్నతాధికారులు అప్రమత్తమవడంతో కుట్ర బయటపడింది. హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ పోలీసులు కీలక సూత్రధారి, ఆ బ్యాంకు మాజీ చీఫ్‌ మేనేజర్‌ షేక్‌ మస్తాన్‌ వలీని అరెస్టు చేశారు. సంయుక్త కమిషనర్‌(నేర పరిశోధన) డాక్టర్‌ గజరావ్‌ భూపాల్‌ శనివారం విలేకరుల

Published : 23 Jan 2022 05:16 IST

 గతంలో తెలుగు అకాడమీలో.. ఇప్పుడు గిడ్డంగుల సంస్థలో

 సాయికుమార్‌ బృందంతో కలిసి ఎఫ్‌డీలు కాజేసే యత్నం

 యూబీఐ చీఫ్‌ మేనేజర్‌గా నాడు పన్నాగం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ సంస్థల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను స్వాహా చేస్తున్న చుండూరి సాయికుమార్‌ బృందం రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌లోనూ చేతివాటానికి యత్నించింది. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కార్వాన్‌ శాఖ ఉన్నతాధికారులు అప్రమత్తమవడంతో కుట్ర బయటపడింది. హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ పోలీసులు కీలక సూత్రధారి, ఆ బ్యాంకు మాజీ చీఫ్‌ మేనేజర్‌ షేక్‌ మస్తాన్‌ వలీని అరెస్టు చేశారు. సంయుక్త కమిషనర్‌(నేర పరిశోధన) డాక్టర్‌ గజరావ్‌ భూపాల్‌ శనివారం విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ‘‘గిడ్డంగుల సంస్థ గతేడాది జనవరిలో యూబీఐ కార్వాన్‌ శాఖలో ఎనిమిది ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసింది. చీఫ్‌ మేనేజర్‌ మస్తాన్‌ వలీ రూ.3.98 కోట్లకు సంబంధించి రెండు నకిలీ రసీదులు ఇచ్చారు. ఈ బాగోతం వెనుక సాయికుమార్‌ బృందానికి సంబంధం ఉందని మస్తాన్‌ వలీ విచారణలో అంగీకరించాడు. తెలుగు అకాడమీ ఎఫ్‌డీలను కొట్టేసినప్పుడే గిడ్డంగుల సంస్థవీ కాజేయాలనుకున్నారు. తెలుగు అకాడమీ కేసుల్లో మస్తాన్‌ వలీకి శుక్రవారం బెయిల్‌ వచ్చింది. తాజా కేసులో ఆయనను రెండోసారి అరెస్టు చేశాం’’ అని వివరించారు.

అప్పటి కుంభకోణం.. రూ.21.32 కోట్ల రికవరీ

తెలుగు అకాడమీ అధికారులు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కార్వాన్‌, సంతోష్‌నగర్‌ శాఖల్లో; కెనరా బ్యాంకులో గతంలో రూ.64 కోట్ల విలువైన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేశారు. వాటిని సాయికుమార్‌ బృందం కాజేసింది. సాయికుమార్‌, మస్తాన్‌ వలీ, కెనరా బ్యాంక్‌ మాజీ మేనేజర్‌ సాధన సహా మొత్తం 20 మంది ఆ మొత్తాన్ని పంచుకున్నారు. ఇందులో తాము రూ.4.32 కోట్ల నగదు, రూ.17 కోట్ల స్థిరాస్తులు స్వాధీనం చేసుకున్నామని సంయుక్త కమిషనర్‌(నేర పరిశోధన) డాక్టర్‌ గజరావ్‌ భూపాల్‌ తెలిపారు. వాటాగా వచ్చిన సొమ్ముతో నిందితులు గుంటూరు, విజయవాడ, వైజాగ్‌, హైదరాబాద్‌లలో ఆస్తులు కొన్నారని ఏసీపీ మనోజ్‌కుమార్‌ వివరించారు. ‘‘సాధన శివరాంపల్లిలో రూ.2 కోట్లతో విల్లా,  వైజాగ్‌లో రూ.70 లక్షలతో ఫ్లాటు తీసుకొన్నారు.  మస్తాన్‌ వలీ రూ.1.76 కోట్లతో ఫ్లాటు, మిగిలిన నిందితులు తణుకు, సత్తుపల్లి పట్టణాల్లో స్థలాలు, ఫ్లాట్లు కొన్నారు. సూత్రధారి సాయికుమార్‌ పెద్దఅంబర్‌పేట బాహ్య వలయ రహదారి వద్ద 16 ఎకరాల భూమి కొన్నాడు. దాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాం’’ అని ఏసీపీ మనోజ్‌కుమార్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని