AP News: చోరీ అభియోగంపై చిత్రహింసలకు గురి చేశారు

చిత్తూరు జిల్లా జైలు సూపరింటెండెంట్‌ వేణుగోపాలరెడ్డి ఇంట్లో దొంగతనం చేశాననే అభియోగంతో తనను పోలీసులు చిత్రహింసలే పెట్టారని ఎస్సీ మహిళ ఉమామహేశ్వరి శనివారం విలేకరుల సమావేశంలో మొరపెట్టుకున్నారు. ‘‘వేణుగోపాలరెడ్డి ఇంట్లో 14 నెలల

Updated : 23 Jan 2022 06:44 IST

చిత్తూరు పోలీసులపై ఎస్సీ మహిళ ఆరోపణ

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు- న్యూస్‌టుడే, చిత్తూరు (నేరవార్తలు): చిత్తూరు జిల్లా జైలు సూపరింటెండెంట్‌ వేణుగోపాలరెడ్డి ఇంట్లో దొంగతనం చేశాననే అభియోగంతో తనను పోలీసులు చిత్రహింసలే పెట్టారని ఎస్సీ మహిళ ఉమామహేశ్వరి శనివారం విలేకరుల సమావేశంలో మొరపెట్టుకున్నారు. ‘‘వేణుగోపాలరెడ్డి ఇంట్లో 14 నెలల నుంచి పనిచేస్తున్నా. 18న ఉదయం 11 గంటలకు పనికి వెళ్లగా.. సూపరింటెండెంట్‌, ఆయన భార్య ఇంట్లో రూ.2 లక్షలు చోరీ అయ్యాయని గొడవ పడుతున్నారు. నన్ను కూడా ప్రశ్నిస్తే తీయలేదన్నాను. ఆ తర్వాత ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారని, చిత్తూరు ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు రమ్మనమని చెప్పడంతో అక్కడికి వెళ్లా. వేలిముద్రలు తీసుకొని రాత్రి 9 గంటలకు ఇంటికి పంపారు. 19న మధ్యాహ్నం 12 గంటలకు మరోసారి స్టేషన్‌కు రావాలని.. ఫోన్‌ చేయగా తన భర్త బాబు, తల్లితో కలిసి వెళ్లా. అక్కడ ఓ పురుష కానిస్టేబుల్‌ స్టేషన్‌లోని ఓ గదిలోకి తీసుకెళ్లారు.  కాళ్లు, చేతులు కట్టేసి.. పాదాలపై కొట్టారు. గంట సేపు చిత్రహింసలు పెట్టడంతో స్పృహ తప్పి పడిపోయా.రాత్రి11గంటలకు  నాతో సంతకం చేయించుకొని కుటుంబసభ్యులకు అప్పగించారు. నడవలేని స్థితిలో ఉన్న నన్ను నా భర్త చిత్తూరు జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడికి పోలీసులు వచ్చి.. ‘మీ తప్పేం లేదని, పొరపాటు జరిగిందని’ చెప్పారు. చికిత్సకయ్యే ఖర్చు భరిస్తామన్నారు. త్వరగా నన్ను డిశ్ఛార్జి చేయాలని ఆసుపత్రి సిబ్బందిపై పోలీసులు ఒత్తిడి తెచ్చారు’’ అని ఉమామహేశ్వరి వివరించారు. ప్రైవేటు ఆసుపత్రిలో, మెరుగైన వైద్యం కోసం కుటుంబసభ్యులు ఆమెను తిరుపతికి తరలించారు. సీఐ నరసింహరాజు మాట్లాడుతూ... ‘ఉమామహేశ్వరిని మహిళా ఎస్సై పద్మావతి విచారించగా నేరం అంగీకరించారు. స్టేషన్‌ నుంచి ఆమెను పంపించేటప్పుడు 41ఏ నోటీసు ఇచ్చాం. పోలీసులు ఆమెను కొట్టలేదు. తిట్టలేదు’ అని వెల్లడించారు. దీనిపై ఎస్పీ సెంథిల్‌కుమార్‌ ‘ఈనాడు’తో మాట్లాడుతూ.. సదరు మహిళ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని, దొంగతనం చేశానని ఆమె అంగీకరించారన్నారు.  ఈ ఘటనపై అదనపు ఎస్పీ మహేషన్‌ను విచారణాధికారిగా నియమించామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని