TS News: చెల్లి మృతదేహంతో నాలుగు రోజులు..ఓ యువతి నిస్సహాయత

ఉన్నత విద్యలో పట్టభద్రులైన అక్కాచెల్లెళ్లు  నా అన్నవారెవరూ లేకపోవడంతో ఒకరికొకరు తోడునీడలా జీవిస్తున్నారు. ఉన్నట్టుండి చెల్లి మృతిచెందడంతో నిశ్చేష్ఠురాలైన సోదరి నాలుగు

Updated : 18 Jan 2022 07:46 IST

పెద్దపల్లి, న్యూస్‌టుడే: ఉన్నత విద్యలో పట్టభద్రులైన అక్కాచెల్లెళ్లు  నా అన్నవారెవరూ లేకపోవడంతో ఒకరికొకరు తోడునీడలా జీవిస్తున్నారు. ఉన్నట్టుండి చెల్లి మృతిచెందడంతో నిశ్చేష్ఠురాలైన సోదరి నాలుగు రోజుల పాటు మృతదేహంతోనే ఉండిపోయారు. స్థానికుల ఫిర్యాదుతో ఎట్టకేలకు విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు...పెద్దపల్లి పట్టణం ప్రగతినగర్‌లో మారోజు శ్వేత(24), ఆమె అక్క స్వాతి సొంత ఇంట్లో నివసిస్తున్నారు. అమ్మ, నాన్న గతంలో మరణించారు. శ్వేత ఎంబీఏ పూర్తిచేయగా, స్వాతి ఎంటెక్‌ చదివి పట్టణంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో పనిచేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం శ్వేత మృతిచెందింది. సంబంధీకులు, బంధువులు లేకపోవడంతో విషయం ఎవరికి చెప్పాలో తెలియని స్థితిలో ఆమె సోదరి అప్పట్నుంచి మృతదేహం పక్కనే ఉండిపోయారు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన కాలనీవాసులు సోమవారం పొద్దుపోయాక పోలీసులకు సమాచారం అందించారు. సీఐ ప్రదీప్‌కుమార్‌, ఎస్సై రాజేశ్‌ ఘటనా స్థలికి చేరుకుని స్వాతిని విచారించారు. ‘తన చెల్లెలు అనారోగ్యంతో మృతి చెందినట్టు’ ఆమె తెలిపిన మీదట కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహానికి వైద్యులు అక్కడే పంచనామా నిర్వహించారు. గతంలో నానమ్మ, అమ్మమ్మ చనిపోయినప్పుడు కూడా అక్కాచెల్లెళ్లు రెండు, మూడు రోజులు ఎవరికీ చెప్పలేదని స్థానికులు తెలిపారు. వారి మానసిక స్థితిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని