TS News: టైరు పేలి బావిలోకి కారు.. తల్లి, కుమారుడి జలసమాధి

అతివేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పింది.. టైరు పేలడంతో రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న తల్లీకుమారుడితోపాటు రాత్రి వరకు సహాయక చర్యల్లో పాల్గొన్న గజ ఈతగాడు సైతం జలసమాధి

Updated : 02 Dec 2021 12:44 IST

సహాయక చర్యల్లో పాల్గొన్న గజ ఈతగాడు సైతం దుర్మరణం

దుబ్బాక, సిద్దిపేట టౌన్‌, న్యూస్‌టుడే: అతివేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పింది.. టైరు పేలడంతో రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న తల్లీకుమారుడితోపాటు రాత్రి వరకు సహాయక చర్యల్లో పాల్గొన్న గజ ఈతగాడు సైతం జలసమాధి అయ్యారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్‌ శివారులో బుధవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌ జిల్లా నిజాంపేట మండలం నందిగామకి చెందిన సుదునం ప్రశాంత్‌(25), తల్లి లక్ష్మి(45)తో కలిసి హుస్నాబాద్‌ సమీపంలోని నందారం గ్రామంలో లక్ష్మి సోదరి మనుమరాలు బారసాల వేడుకకు కారులో బయల్దేరారు. మార్గంమధ్యలో మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో చిట్టాపూర్‌ శివారులో వంతెన సమీపంలో అతివేగంతో టైరు పగిలి కారు అదుపుతప్పింది. రోడ్డుకు ఎడమ పక్కన దిగువన ఉన్న పెంటయ్యకు చెందిన వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు హుటాహుటిన చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందర్‌రావు, ఏసీపీ దేవారెడ్డి సహాయక చర్యలను పర్యవేక్షించారు. పెద్దసంఖ్యలో తరలివచ్చిన జనం సహాయక చర్యల్లో పాలు పంచుకున్నారు. అగ్నిమాపక శకటాలకు అనుబంధంగా ఉండే రెండు మోటార్లు, మరో మూడు వ్యవసాయ మోటార్లతో నీటిని తోడి వేశారు. రెండు క్రేన్లను వినియోగించారు. సుమారు 20 అడుగులకుపైగా లోతు ఉన్న బావిలో నీటిని తోడేందుకు రాత్రి వరకు శ్రమించారు. పలుమార్లు గజ ఈతగాళ్లు తాళ్ల సాయంతో కారును గుర్తించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే క్రేన్‌తో పాటు నీటిలోకి వెళ్లిన దుబ్బాక మండలం ఎనగుర్తికి చెందిన గజ ఈతగాడు బండకాడి నర్సింలు(40) దుర్మరణం పాలయ్యారు. ఆయన కారు కిందిభాగంలో తాడు కట్టేందుకు ప్రయత్నించి ఇరుక్కుని విగతజీవిగా మారాడు. రాత్రి 8 గంటల సమయంలో కారును బయటికి తీస్తున్న క్రమంలో అందులో చిక్కుకున్న నర్సింలు మృతదేహం బావిలో పడిపోయింది. ఘటనా స్థలికి చేరుకున్న ఇరు కుటుంబాల సభ్యులు బోరున విలపించారు. ప్రజాప్రతినిధులు, పోలీసుల నిర్లక్ష్యం కారణంగా నర్సింలు మృతిచెందారంటూ ఆయన బంధువులు ఘటనాస్థలంలో ఆందోళనకు దిగారు. రహదారిపై ధర్నా నిర్వహించారు. నర్సింలుకు భార్య లత, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

ఆ ఇంట తీవ్ర విషాదం

నందిగామలో పేద కుటుంబానికి చెందిన ప్రశాంత్‌ ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. తల్లి లక్ష్మి బీడీలు చుడుతోంది. తండ్రి రాములు లారీ డ్రైవర్‌గా చేస్తున్నారు. తల్లీ కుమారుల దుర్మరణంతో రెక్కాడితే తప్ప డొక్కాడని ఈ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రశాంత్‌ అదే గ్రామానికి చెందిన స్నేహితుడు హరీశ్‌ కారులో తల్లిని ఎక్కించుకొని వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని