Third Wave: ‘జన్యు’ ఆవిష్కరణ డీలా.. మూడో వేవ్‌ వస్తే ఎలా? 

మూడో వేవ్‌ వస్తుందా? రాదా? వస్తే తీవ్రత ఎలా ఉంటుందనే సందేహాలకు శాస్త్రీయంగా సమాధానం దొరకాలంటే

Published : 20 Aug 2021 12:26 IST

జనాభా, కేసులకు తగినట్టుగా లేని నమూనాల సేకరణ 
జులై నుంచి తగ్గిపోయిన జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: మూడో వేవ్‌ వస్తుందా? రాదా? వస్తే తీవ్రత ఎలా ఉంటుందనే సందేహాలకు శాస్త్రీయంగా సమాధానం దొరకాలంటే ఎప్పటికప్పుడు వైరస్‌ జన్యుక్రమాల ఆవిష్కరణ అత్యంత కీలకం. ఈ ప్రక్రియ ఆశించినంత శాస్త్రీయంగా సాగడం లేదని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్‌ రెండో వేవ్‌ తీవ్రంగా ఉన్న జూన్‌లో గరిష్ఠ స్థాయిలో చేపట్టిన వైరస్‌ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌.. జులై, ఆగస్టుకు వచ్చేసరికి పడిపోయింది. పాజిటివ్‌ కేసులు తగ్గడంతో వైరస్‌ జన్యుక్రమాల ఆవిష్కరణను తగ్గించేశారు. మూడో వేవ్‌ వస్తే అందుకు కొత్త వేరియంటే కారణమవుతుందనే నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌(వీవోసీ) గుర్తించేందుకు నిరంతర పర్యవేక్షణ, జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ అవసరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎక్కువగా వైరస్‌ జన్యుక్రమాల ఆవిష్కరణలతో ఎక్కువ సమాచారం అందుబాటులోకి వస్తుందని..అప్పుడే వైరస్‌ కొమ్ములు వంచగలమంటున్నారు.

> దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 72,931 నమూనాల్లోని వైరస్‌ను సేకరించి జన్యుక్రమాలను కొనుగొన్నారు. రెండోవేవ్‌లో మనదేశాన్ని వణికించిన డెల్టాలోని ఉత్పరివర్తనాలలో 13 ఉపరకాలు ఉన్నట్లు తేల్చారు. ఇంకా కొత్త ఉత్పరివర్తనాలు జరుగుతూనే ఉన్నాయి.

ఏవై.1, ఏవై.2, ఏవై.3 ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వ్యాప్తిలో ఉన్నాయి. మనదేశంలోనూ ఈ కేసులు పెరుగుతున్నాయి. ఏవై3 నుంచే కొత్తగా ఏవై 3.1 ఉపరకాన్ని అమెరికాలో గుర్తించారు. ఏవై.12 ఇజ్రాయేల్‌లో బయటపడింది.

మహారాష్ట్రలో ఏవై.1, ఏవై.2, ఏవై.3 రకాలు జులై నుంచి ఒకశాతం నమూనాల్లో ఉన్నట్లు గుర్తించారు. మిగతా రాష్ట్రాల సమాచారం పక్కాగాలేదు. ఇందుకు సీక్వెన్సింగ్‌లో లోపాలే కారణమని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో అరశాతమే.. 

> దేశంలో మొత్తం వైరస్‌ జన్యుక్రమాల ఆవిష్కరణలో 23 శాతం మహారాష్ట్ర నుంచే ఉన్నాయి. తెలంగాణలో 4.3 శాతం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి 2.2 శాతం మాత్రమే. అత్యంత ఎక్కువ జనాభా కల్గిన ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి వైరస్‌ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ అరశాతమే ఉందని సీసీఎంబీ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా అన్నారు. ‘వైరస్‌ నమూనాల్లో నాణ్యమైన వాటినే సీక్వెన్సింగ్‌కు ఎంపిక చేసుకుంటారు. కరోనా సోకి ఆసుపత్రిపాలైన వ్యక్తుల నమూనాలు, టీకా వేసుకున్నా ఇన్‌ఫెక్షన్‌ బారిన పడిన, వైరస్‌తో చనిపోయిన వ్యక్తులు.. ఇలా వేర్వేరుగా నమూనాలను ఎప్పటికప్పుడు సేకరించి వేగంగా ల్యాబ్‌కు పంపాలి. అక్కడ జన్యుక్రమాలను కనుగొని దేశీయంగా ఇన్సాకాగ్, అంతర్జాతీయంగా జీఐఎస్‌ఏఐడీకి పంపాలి. ఈ ప్రక్రియ యూకేలో 15 రోజుల్లో జరుగుతుంటే.. మన దగ్గర నుంచి సమాచారం వెళ్లేందుకు వంద రోజులు పడుతోంది. ఈ సమయాన్ని భారత్‌లో తగ్గించగలిగితే ముందున్న ముప్పును ప్రారంభ దశలోనే గుర్తించి చర్యలు చేపట్టేందుకు వీలుంటుంది’ అని మిశ్రా అన్నారు. 

యూకేలో ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు టీకా వేసుకున్నా 1.2 లక్షల మంది కొవిడ్‌ బారిన పడ్డారు. డెల్టా వ్యాప్తిలో ఉన్న మనదేశంలోనూ ఇందుకు అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని కేసుల్లో జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేయగా.. డెల్టా రకమే కారణమని తేలింది. టీకా వేసుకున్న వారిలో వైరస్‌ ఎక్కువ పోరాడుతూ కొత్త ఉత్పరివర్తనాలకు దారితీసే అవకాశం ఉందని.. అది బలంగా ఉందా.. బలహీనంగా ఉందా తెలియాలంటే ఎప్పటికప్పుడు జన్యుక్రమ ఆవిష్కరణ జరగాల్సిందేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని