Updated : 27/11/2020 07:02 IST

ఆర్టీసీలో కీచకపర్వం

పైఉద్యోగి పట్ల శ్రామిక్‌ అసభ్య ప్రవర్తన

విజయవాడ: ప్రేమ, పెళ్లి అంటూ ఆర్టీసీలో పనిచేసే శ్రామిక్‌.. ఉద్యోగినిని వేధింపులకు గురిచేసి జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు. చివరకు ఉద్యోగం నుంచి సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఈ విషయాన్ని ఆర్టీసీ అధికారులు గోప్యంగా ఉంచడంతో ఆలస్యంగా వెలుగుచూసింది. విచారణ అనంతరం గవర్నర్‌పేట-1 డీఎం బాలస్వామి గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.

నిందితుడు అజయ్‌ గవర్నర్‌పేట-1 డిపోలోని గ్యారేజీలో శ్రామిక్‌గా పనిచేస్తున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో ఇదే డిపోలో తాగిన మైకంలో సూపర్‌వైజర్‌తో గొడవపడ్డాడు. దీంతో పాటు విధులకు గైర్హాజరు అవుతుండడంతో క్రమశిక్షణ చర్యల కింద అతడిని విధుల నుంచి తొలగించారు. ఉన్నతాధికారులకు మొరపెట్టుకోవడంతో తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. అయినా ప్రవర్తనలో మార్పురాలేదు. తనను ప్రేమించమంటూ అక్కడే పనిచేసే మహిళా ఉద్యోగిని వెంటపడ్డాడు. దీనిపై ఆమె పలుసార్లు చెప్పినా వినిపించుకోలేదు. ఫోన్లలోనూ అదేపనిగా ఇబ్బంది పెట్టేవాడు. ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిసి, వేధింపులు ఎక్కువ చేశాడు. ఈనెల 9, 10 తేదీల్లో మహిళా ఉద్యోగి ఇంటికి వెళ్లి బెదిరింపులకు దిగాడు. తననే పెళ్లి చేసుకోవాలని, లేనిపక్షంలో చంపి, తాను కూడా ప్రాణం తీసుకుంటానని హెచ్చరించాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు సత్యనారాయణపురం పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. జడ్జి రిమాండ్‌ విధించడంతో రాజమహేంద్రవరం కారాగారానికి తరలించారు.

●● అంతర్గత విచారణ

ఈ ఘటనకు సంబంధించి ఆర్టీసీ విజిలెన్స్‌ అధికారులు ప్రాథమికంగా విచారించారు. అనంతరం శాఖాపరమైన విచారణకు ఆటోనగర్‌ డిపో ట్రాఫిక్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ను నియమించారు. విచారణలో గుర్తించిన అంశాలతో ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. ఇందులో అజయ్‌ ఆర్టీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు తేలింది. దీంతో అతడిని సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పోలీసు కేసులో అరెస్టు అయి, 48 గంటలు పైగా రిమాండ్‌లో ఉండడం, తాగిన మైకంలో పైఉద్యోగి ఇంటికి వెళ్లి చంపుతానని బెదిరించడం, తదితర అభియోగాలు నిరూపితం అయ్యాయని ఉత్తర్వుల్లో అధికారులు పేర్కొన్నారు.

ఐదు నెలలు.. నలుగురిపై చర్యలు●

● ఇటీవలి కాలంలో కృష్ణా రీజియన్‌లో పలువురు ఉద్యోగులు సస్పెన్షన్‌కు గురికావడం చర్చనీయాంశంగా మారింది. గత ఐదు నెలల్లోనే నలుగురు సస్పెండ్‌ కాగా, ఒకరిని ఏకంగా ఉద్యోగం నుంచే తొలగించారు.

● ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పలువురు నిరుద్యోగుల నుంచి విద్యాధరపురం డిపోకు చెందిన డ్రైవర్‌ రవికుమార్‌ మోసం చేశారు. రూ. 50 లక్షలు వరకు వసూలు చేశారు. ఈ కేసులో నిందితుడు రవిని ఈ ఏడాది జులైలో ఉద్యోగం నుంచి తొలగించారు.

● విజయవాడ నగరంలో ఇళ్లు ఇప్పిస్తానని పలువురి నుంచి గన్నవరం డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న శ్రీధర్‌ రూ. 15 లక్షలు వసూలు చేశారు. దీనిపై సత్యనారాయణపురం, భవానీపురం స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా వ్యవహరించినందుకు ఆర్టీసీ అధికారులు శ్రీధర్‌ను పది రోజుల క్రితం సస్పెండ్‌ చేశారు.

● గన్నవరం డిపోలో పనిచేస్తున్న సీనియర్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ వీరభద్రరావు.. మహిళా కండక్టర్‌ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన అభియోగాలపై సస్పెండ్‌ అయ్యారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని